ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస వెళ్తున్న ఉక్రెయిన్ దేశస్తులు

ABN , First Publish Date - 2022-02-25T22:00:57+05:30 IST

ఉక్రెయిన్‌ దేశస్తులు మాతృభూమిని వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విదేశాలకు వలస వెళ్తున్నారు. గురువారం ఒక్కరోజే సుమారు లక్ష మంది ఉక్రెయిన్లు విదేశాలకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి శరనార్థ ఏజెన్సీ అధికార ప్రతినిథి..

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస వెళ్తున్న ఉక్రెయిన్ దేశస్తులు

కీవ్: రష్యా దాడులు తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడంతో ఉక్రెయిన్‌ దేశస్తులు మాతృభూమిని వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విదేశాలకు వలస వెళ్తున్నారు. గురువారం ఒక్కరోజే సుమారు లక్ష మంది ఉక్రెయిన్లు విదేశాలకు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి శరనార్థ ఏజెన్సీ అధికార ప్రతినిథి షబిన మంటూ ప్రకటించారు. రాజధాని కీవ్ నుంచే ఈ వలసలు ఎక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. కీవ్ నగరం వెలుపల రహదారి అంతా వలస వెళ్లేవారి వాహనాలతో నిండిపోయి ఉంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గురువారమే కీవ్‌పై దాడికి దిగారు. అయితే శుక్రవారం మద్యాహ్నానికి కీవ్‌లోకి రష్యా దళాలు ప్రవేశించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంటును స్వాధీనం చేసుకున్న తర్వాత కీవ్ వైపు శత్రు బలగాలు వస్తున్నాయన్నారు. కీవ్ నగరాన్ని మరో 96 గంటల్లో శత్రు సేనలు ముట్టడించే అవకాశం ఉందన్నారు. యూరోపుపై నూతన ఉక్కు తెరను వేయబోతున్నారని మండిపడ్డారు.


ఇదిలావుండగా, మీడియా కథనాలనుబట్టి ఉక్రెయిన్ ఇక రష్యా చేతికి చిక్కినట్లేనని తెలుస్తోంది. కీవ్‌లోకి రష్యన్ బలగాలు ఇప్పటికే చేరుకున్నాయని, మరో నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ పూర్తిగా రష్యా వశమవుతుందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో తనకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికాపై ఉక్రెయిన్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. సాయం చేస్తామంటూనే, తీరా అవసరం వచ్చేసరికి చేతులెత్తేసింది. అదేవిధంగా నాటో దేశాలు కూడా ఉక్రెయిన్‌కు హ్యాండిచ్చాయి.

Updated Date - 2022-02-25T22:00:57+05:30 IST