ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల కోసం కేంద్రమంత్రితో డీఎంకే ఎంపీల కమిటీ భేటీ

ABN , First Publish Date - 2022-03-06T13:47:23+05:30 IST

ఉక్రెయిన్‌లోని తమిళ విద్యార్థులను స్వస్థలాల తరలించే పనులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎంపీల కమిటీ ఢిల్లీలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్‌తో భేటీ అయింది. ఉక్రెయిన్‌పై

ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థుల కోసం కేంద్రమంత్రితో డీఎంకే ఎంపీల కమిటీ భేటీ

చెన్నై: ఉక్రెయిన్‌లోని తమిళ విద్యార్థులను స్వస్థలాల తరలించే పనులను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎంపీల కమిటీ ఢిల్లీలో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయశంకర్‌తో భేటీ అయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి చెందిన 777 మంది విద్యార్థులను స్వస్థలాలకు తరలించారు. ఈ నేపథ్యంలో యుద్ధవాతావరణంలో ఆహారం లేకుండా అలమటిస్తున్న వేలాదిమంది తమిళ విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించే పనులను పర్యవేక్షించేందుకు డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, కళానిధి వీరాస్వామి, అబ్దుల్లా, శాసనసభ్యుడు టీఆర్‌పీ రాజా, ఐఏఎస్‌ అధికారులు కమల్‌కిశోర్‌, ఎం.ప్రదీప్‌కుమార్‌, అజయ్‌ యాదవ్‌, గోవిందరావు, ప్రవాస తమిళుల సంక్షేమ బోర్డు అధికారి జెసిథా లాజరస్‌తో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ శనివారం ఉదయం ఢిల్లీలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌ను కలుసుకున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని తమిళ విద్యార్థులు  స్వస్థలాలకు తీసుకెళ్లే విమానాల కోసం ఎదురు చూస్తున్నారని, సుమీ ప్రాంతాల్లో వంద మంది తమిళ విద్యార్థులు ఆహారం లేక అలమటిస్తున్నారని, వీరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈ కమిటీ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసింది. పోలండ్‌, రుమేనియా, హంగేరి వెళ్లేందుకు తమకు తగు సదుపాయాలు సమకూర్చమని కూడా కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జయశంకర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రాష్యా తాత్కాలిక యుద్ధ విరమణ ప్రకటించడంతో అక్కడి తమిళ విద్యార్థులను వీలైనంత త్వరగా స్వస్థలాలకు తరలించగలమని హామీనిచ్చారు. ఈ పరిస్థితుల్లో కమిటీ సభ్యులు రష్యా, ఉక్రెయిన్‌ దేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చని తెలిపారు.


తిరిగొచ్చిన పొన్నేరి విద్యార్థిని...

ఉక్రెయిన్‌ నుంచి పొన్నేరికి చెందిన వైద్య విద్యార్థిని రిత్తికా క్షేమంగా స్వస్థలానికి చేరుకుంది. ఉక్రెయిన్‌లో రిత్తికా మూడేళ్లుగా ఎంబీబీఎస్‌ చదువుతోంది. పడమటి ఉక్రెయిన్‌లో ఉన్న రిత్తికా గత వారం రోజులుగా ఆహారం లేక అలమటించింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్ర ప్రభుత్వం పంపిన విమానంలో తాను క్షేమంగా తిరిగొచ్చినట్లు ఆమె తెలిపింది. శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టిన రిత్తికాకు ఆమె తల్లిదండ్రులు జగన్‌, నాగజ్యోతి, ఇతర కుటుంబసభ్యులు స్వాగతం పలికారు.

Updated Date - 2022-03-06T13:47:23+05:30 IST