కీవ్‌లో ప్రవేశించిన రష్యన్ దళాలు : ఉక్రెయిన్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-02-25T19:13:30+05:30 IST

ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యన్ దళాలు సమీపిస్తున్నాయని

కీవ్‌లో ప్రవేశించిన రష్యన్ దళాలు : ఉక్రెయిన్ అధ్యక్షుడు

కీవ్ : ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యన్ దళాలు సమీపిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ శుక్రవారం చెప్పారు. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంటును స్వాధీనం చేసుకున్న తర్వాత కీవ్ వైపు శత్రు బలగాలు వస్తున్నాయన్నారు. కీవ్ నగరాన్ని మరో 96 గంటల్లో శత్రు సేనలు ముట్టడించే అవకాశం ఉందన్నారు. యూరోపుపై నూతన ఉక్కు తెరను వేయబోతున్నారని మండిపడ్డారు. 


అంతకుముందు ఉక్రెయినియన్ ప్రధాన మంత్రి డెనిస్ ష్మిహాల్ మాట్లాడుతూ, చెర్నోబిల్ ఎక్స్‌క్లూజన్ జోన్, చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్మాణాలను రష్యన్ సేనలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 


ఇదిలావుండగా, మీడియా కథనాలనుబట్టి ఉక్రెయిన్ ఇక రష్యా చేతికి చిక్కినట్లేనని తెలుస్తోంది. కీవ్‌లోకి రష్యన్ బలగాలు ఇప్పటికే చేరుకున్నాయని, మరో నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ పూర్తిగా రష్యా వశమవుతుందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో తనకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పుతిన్ భావిస్తున్నట్లు సమాచారం. 


మరోవైపు అమెరికాపై ఉక్రెయిన్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. సాయం చేస్తామంటూనే, తీరా అవసరం వచ్చేసరికి చేతులెత్తేసింది. అదేవిధంగా నాటో దేశాలు కూడా ఉక్రెయిన్‌కు హ్యాండిచ్చాయి. 


Updated Date - 2022-02-25T19:13:30+05:30 IST