ఉక్రెయిన్‌ మంటల్లో లంకా దహనం

ABN , First Publish Date - 2022-03-21T07:53:35+05:30 IST

శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. కళ్లెం తెంచుకున్న నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ..

ఉక్రెయిన్‌ మంటల్లో  లంకా దహనం

ఆయువుపట్టుగా ఉన్న పర్యాటకానికి దెబ్బ

కాగితాల కొరతతో పరీక్షలు రద్దు 

పెట్రోల్‌ కోసం క్యూలో నిల్చున్న ఇద్దరి మృతి

కిలో చికెన్‌ రూ.1,000.. పాల పొడి ధర రూ.1,945

 

కొలంబో, మార్చి 20: శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. కళ్లెం తెంచుకున్న నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. బిక్కుబిక్కుమంటున్న లంకకు 4000 మైళ్ల దూరంలో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధపు మంటల సెగలూ తాకుతున్నాయి. శ్రీలంకకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రం గాన్ని దెబ్బతీస్తున్నాయి. ఏటా శ్రీలంకకు వచ్చే పర్యాటకుల్లో 30ు మంది రష్యా, ఉక్రెయిన్‌, పోలండ్‌, బెలారస్‌ దేశాలవారే. యుద్ధం వల్ల ఇప్పుడు అక్కడి పర్యాటకులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో శ్రీలంక ఆదాయానికి గండిపడింది. దీంతో శ్రీలంక కేంద్ర బ్యాంకు చేతిలో ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీగా తగ్గిపోయాయి. రూ.75 వేల కోట్ల(10 బిలియన్‌ డాలర్ల) లోటుతో శ్రీలంక ప్రస్తుతం కొట్టుమిట్టాడుతోంది. శ్రీలంక కరెన్సీలో అమెరికా డాలరు విలువ భారీగా పెరిగి రూ.270కి చేరింది. దీంతో నిత్యావసరాలు, ఇంధన ధరలు మండిపోతున్నాయి. ఆదివారం కోడిగుడ్డు ధర రూ.35, కిలో చికెన్‌ ధర రూ.1000, కిలో ఉల్లిగడ్డలు రూ.200, కిలో బియ్యం రూ.210, కిలో గోధుమపిండి రూ.220, కిలో మసూరి పప్పు రూ.350, లీటరు కొబ్బరినూనె రూ.900 పలికాయి. ప్రింటింగ్‌ కాగితాల కొరత వల్ల సోమవారం నుంచి జరగాల్సిన పాఠశాల స్థాయి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికార వర్గాలు ప్రకటించాయి. దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉందని పేర్కొన్నాయి. శ్రీలంకలో కప్పు టీ తాగాలంటే రూ.100 నోటు జేబులో ఉండాల్సిందే. టీ తయారీకి వాడే ముడి పదార్థాల ధరలన్నీ పెరగడంతో ఈ పరిస్థితి వచ్చింది. 1 కేజీ పాల పొడి ధర రూ.1,945కి చేరింది. చక్కెర ధర ఇప్పటికే కిలో రూ.150 దాకా పలుకుతోంది. హోటళ్లలో వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా రూ.1,359కి పెరిగింది. అందుకే హోటళ్ల నిర్వాహకులు కప్పు టీ ధరను రూ.100కు పెంచేశారు. వంటగ్యాస్‌ కొరతతో దేశంలోని 90ు రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. గ్యాస్‌ ధరలు భారీగా పెరగడంతో శ్రీలంకలోని చాలా కుటుంబాలు కిరోసిన్‌ వాడకాన్ని ప్రారంభించాయి. శ్రీలంకలో లీటరు పెట్రోలు ధర రూ.283, లీటరు డీజిల్‌ ధర రూ.220కు చేరింది. ధరలు మరింత పెరగొచ్చనే ఆందోళనతో పెట్రోలు బంక్‌ల వద్ద వాహనదారులు 3, 4 గంటల పాటు క్యూలో నిలబడి ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. దేశంలో రోజూ ఏడున్నర గంటలపాటు విద్యుత్‌ కోతలు విధించారు.

Updated Date - 2022-03-21T07:53:35+05:30 IST