Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 25 Jan 2022 02:26:19 IST

యుద్ధం ముంగిట ఉక్రెయిన్‌!

twitter-iconwatsapp-iconfb-icon
యుద్ధం ముంగిట ఉక్రెయిన్‌!

నాటో-రష్యా సమర భేరి!!

అటు అమెరికా యుద్ధనౌకలు, జెట్‌లు 

తోడుగా నాటో ఐరోపా దళాలు

ఇటు సరిహద్దుల్లో రష్యా సైన్యం

పుతిన్‌పై దురాక్రమణ ఆరోపణలు

ఖండిస్తున్న రష్యా అధ్యక్షుడు

ఫలితమివ్వని బైడెన్‌తో చర్చలు

అడకత్తెరలో ఉక్రెయిన్‌


సోవియట్‌ యూనియన్‌ మాజీ రిపబ్లిక్‌ ఉక్రెయిన్‌ కేంద్రంగా ఐరోపాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించబోతోందని, ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రకటించవచ్చని రెండు నెలలుగా అమెరికా, బ్రిటన్‌ సహా నాటో కూటమి దేశాలు ఆరోపణలు చేస్తున్నా.. ఇంతవరకు అలాంటిదేమీ జరుగలేదు. అయితే వారం రోజులుగా ఈ యుద్ధ ప్రచారం ఊపందుకుంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో 1,20,000 మంది సైనికులను రష్యా మోహరించిందని.. అదే జరిగితే కఠినాతికఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా సారథ్యంలోని నాటో కూటమి హెచ్చరిస్తోంది. రష్యా ఈ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. దురాక్రమణకు అవకాశమే లేదని తేల్చిచెబుతున్నా.. అమెరికా పెద్దఎత్తున యుద్ధనౌకలను, ఫైటర్‌ జెట్‌లను ఉక్రెయిన్‌కుతరలించింది. భద్రత దృష్ట్యా స్వదేశం వచ్చేయాలని ఆ దేశ రాజధాని కీవ్‌ నగరంలోని తన ఎంబసీ సిబ్బందిని ఆదేశించింది.


ఏమిటీ వివాదం?

సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం తర్వాత ఉక్రెయిన్‌ 1991 డిసెంబరు 1న స్వాతంత్య్రం ప్రకటించుకుంది. విస్తీర్ణం ప్రకారం రష్యా తర్వాత ఐరోపాలో రెండో అతిపెద్ద దేశమిది. జనాభాపరంగా ఎనిమిదోది. 8.13 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీరిలో 17.3 శాతం మంది రష్యన్‌ జాతీయులే. సోవియట్‌ యూనియన్‌ పతనమయ్యాక రక్షణ, అణ్వస్త్ర, క్షిపణి పరిశ్రమలు, అపార ఖనిజ సంపద ఉక్రెయిన్‌లోనే ఉండిపోవడంతో రష్యా అది తన మిత్రదేశంగా.. తన ఛత్రఛాయల్లో కొనసాగాలని వాంఛించింది. కానీ నాటో కూటమిలో చేరాలని ఉక్రెయిన్‌ కోరుకుంది.  నాటోలో అది చేరితే నాటో దళాలు తన సరిహద్దుల్లో తిష్ఠ వేస్తాయన్నది రష్యా ఆందోళన. అందుకే ఉక్రెయిన్‌ అణ్వస్త్రరహిత దేశంగా ఉండాలని.. నాటోలో చేరవద్దని ఆ దేశంపైన, దానిని చేర్చుకోవద్దని అమెరికా, ఐరోపా దేశాలపైన ఒత్తిడి తెస్తోంది. ఉక్రెయిన్‌ దారికి రాకపోవడంతో 2014లో క్రిమియాను ఆక్రమించుకుని తనలో విలీనం కూడా చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఐరోపా దేశం.. మరో దేశ భూభాగాన్ని ఆక్రమించుకుని కలుపుకోవడం ఇదే ప్రథమం. సెవొస్తోపోల్‌ ప్రాంతంలోనూ రష్యా అనుకూల ప్రభుత్వం నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్‌ రక్షణ కోసమంటూ అక్కడ సేనలను దించాయి.


శతాబ్దాల సత్సంబంధాలు..

ఉక్రెయిన్‌తో రష్యాకు వేల ఏళ్లుగా సాంస్కృతిక, భాషా, కుటుంబపరమైన సత్సంబంధాలున్నాయి. అయితే క్రిమియా ఒకప్పుడు రష్యా భూభాగంలో ఉండేది. సోవియట్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా కృశ్చేవ్‌ (ఉక్రెయిన్‌కు చెందినవారు) ఉన్నప్పుడు 1954లో దానిని ఉక్రెయిన్‌ రిపబ్లిక్‌లో విలీనం చేశారు. నల్లసముద్రంలో రష్యా నౌకాదళానికి క్రిమియా తీరమే స్థావరం. అయితే స్వాతంత్ర్యానంతరం ఉక్రెయిన్‌ తీరు తన భద్రతను ప్రమాదంలో పడవేయడంతో పుతిన్‌ ‘ఒకే రష్యా’ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. బెలారస్‌, రష్యా, జార్జియా వంటి రిపబ్లిక్‌లన్నీ రష్యా నాగరికతలో భాగమని.. ఉక్రెయిన్‌ తమతో సన్నిహితంగా మెలగాలని కోరుతున్నారు. ఈ వాదనతో ఉక్రెయిన్‌ పాలకులు ఏకీభవించడం లేదు. భాషాపరంగా తామెప్పుడో విడిపోయామంటున్నారు. 


గ్యాస్‌ పైపులైన్‌ సమస్య..

ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో అతి కీలకమైనది గ్యాస్‌ పైపులైన్‌ సమస్య. రష్యా నుంచి ఐరోపా దేశాలకు గ్యాస్‌, పెట్రోలు సరఫరా చేయాలంటే ఉక్రెయిన్‌ భూభాగం మీదుగా వేసిన పైపులైన్లే ఆధారం. ఇందుకోసం ఉక్రెయిన్‌కు రష్యా ఏటా మిలియన్ల డాలర్లు రాయల్టీగా కూడా చెల్లిస్తోంది. అయితే ఉక్రెయిన్‌ పాలకులు తరచూ ఈ పైపులైన్లను స్తంభింపజేస్తామని బెదిరిస్తుండడంతో.. రష్యా ప్రత్యామ్నాయం ఆలోచించింది. బాల్టిక్‌ సముద్రగర్భం గుండా పైపులైన్ల నిర్మాణం చేపట్టింది. జర్మనీ వరకు పూర్తిచేసింది కూడా. ఫ్రాన్స్‌కు కూడా దీని ద్వారా ఇంధన సరఫరా చేస్తానని ప్రతిపాదించింది. దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఐరోపాలో రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే జర్మనీయే దానితో గ్యాస్‌ సరఫరాపై ఒప్పందం కుదుర్చుకోవడం.. ఫ్రాన్స్‌ కూడా సుముఖంగా ఉండడంతో అమెరికా, బిట్రన్‌లలో, సోవియట్‌ మాజీ రిపబ్లిక్‌లలో ఆందోళన మొదలైంది. దీనికితోడు జర్మనీ నేవీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అచిమ్‌ స్కోన్‌బాచ్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పుతిన్‌ మర్యాదస్తుడని.. ఆయన క్రిమియాను తిరిగివ్వరని.. ఉక్రెయిన్‌ ఏనాటికీ మళ్లీ పొందే అవకాశం లేదని ఇటీవల భారత పర్యటన సందర్భంగా అన్నారు. జర్మనీ నాయకత్వం ఆయన్ను పదవి నుంచి తొలగించినా.. దాని వైఖరి రష్యాకు మద్దతుగా ఉండడం నాటోలోని ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇంకోవైపు.. ఉక్రెయిన్‌కు గ్యాస్‌ రాయల్టీ రాకపోతే దాని ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని, అందుకే దానిని తాము ఆక్రమించబోతున్నట్లు ప్రచారం చేస్తున్నాయని.. యుద్ధ విన్యాసాలను సమర సన్నాహాలుగా పేర్కొంటూ తమపై దాడి చేయాలని చూస్తున్నాయని పుతిన్‌ విమర్శిస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన ఫోన్లో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోరాదని షరతు విధించారు. ఇందుకు బైడెన్‌ అంగీకరించలేదు. త్వరలో ముఖాముఖి సమావేశం కావాలని పుతిన్‌ కోరుతున్నారు. ఈలోపు ఐరోపా దేశాల్లో ఆయనపై సానుకూలత ఏర్పడకుండా చూసేందుకు అమెరికా వాటిని యుద్ధం పేరిట భయపెడుతోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్‌రోవ్‌ ఆరోపిస్తున్నారు. మొత్తమ్మీద అటు అమెరికా జెట్‌లు, యుద్ధనౌకలు.. ఇటు సరిహద్దుల్లో రష్యా సేనల మోహరింపుతో ఉక్రెయిన్‌ విలవిలలాడుతోంది.

- సెంట్రల్‌ డెస్క్‌.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.