కాంగ్రెస్ ర్యాలీకి వెళ్లానని వంట గ్యాస్ కనెక్షన్ తీసేశారు: మహిళ ఆరోపణ

ABN , First Publish Date - 2021-12-09T02:07:07+05:30 IST

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ర్యాలీకి వెళ్లి ఇంటికి తిరిగివచ్చే సరికి కొంత మంది బీజేపీ కార్యకర్తలు మా ఇంటికి వచ్చి గ్యాస్ కనెక్షన్ మొత్తం తొలగించి వెళ్లారు’’ అహెమాడ్ ఆషగ్బీ దేవి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు అందజేసింది..

కాంగ్రెస్ ర్యాలీకి వెళ్లానని వంట గ్యాస్ కనెక్షన్ తీసేశారు: మహిళ ఆరోపణ

ఇంపాల్: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీకి వెళ్లాననే కారణంతో ఉజ్వల పథకం కింద తనకు ఇచ్చిన వంట గ్యాస్ కనెక్షన్‌ను వెనక్కి తీసుకున్నారని మణిపూర్‌కి చెందిన ఒక మహిళ ఆరోపించింది. అహెమాడ్ ఆషగ్బీ దేవి (47) అనే మహిళ ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి హాజరయ్యింది. అయితే ర్యాలీ నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి వంటగదిలో ఉండే గ్యాస్ కనెక్షన్ పూర్తిగా తొలగించి ఉంది. విషయం ఏంటా అని కనుక్కుంటే కొంత మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లారని తెలిసింది.


‘‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ర్యాలీకి వెళ్లి ఇంటికి తిరిగివచ్చే సరికి కొంత మంది బీజేపీ కార్యకర్తలు మా ఇంటికి వచ్చి గ్యాస్ కనెక్షన్ మొత్తం తొలగించి వెళ్లారు’’ అహెమాడ్ ఆషగ్బీ దేవి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు అందజేసింది. మణిపూర్‌లోని నంబోల్ మున్సిపల్ కౌన్సిల్ వార్డ్ నంబర్ 10 లో నివాసం ఉంటున్న అహెమాడ్ ఆషగ్బీ దేవి, అతి తక్కువ ఆదాయం గల మహిళ. దీంతో ఆమెను ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద అర్హురాలిగా ప్రకటించి వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు.


బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్‌లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ కార్యకర్తలు ప్రజలను ప్రభుత్వ పథకాలపై భయభ్రాంతులకు గురి చేస్తుంటారని స్థానికులు వాపోతున్నారు. అయితే స్థానిక మున్సిపల్ కౌన్సిల్ అధినేత మాట్లాడుతూ అహెమాడ్ ఆషగ్బీ దేవి ఫిర్యాదు తమ వరకు అందిందని, వీలైనంత తొందరలో ఆమె వంట గ్యాస్ కనెక్షన్ పునరుద్ధరించడంతో పాటు నిందితులపై చర్యలకు ఆదేశిస్తామని అన్నారు.

Updated Date - 2021-12-09T02:07:07+05:30 IST