Abn logo
Apr 13 2021 @ 00:55AM

దుర్గమ్మ వెండి రథం సిద్ధం

నేటి నుంచి వసంత నవరాత్రోత్సవాలు 

దుర్గామల్లేశ్వరుల రథోత్సవం నేడే 

మాయమైన సింహాల స్థానంలో కొత్తవి 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఏడాది విరామం తరువాత సరికొత్త సింహం ప్రతిమలతో కనకదుర్గమ్మవారి వెండి రథం వసంత నవరాత్రోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. గత ఏడాది కరోనా కారణంగా రథోత్సవం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత రథంపై సింహం ప్రతిమలు మాయం కావడంతో, ఈ ఏడాది ఓ దాత అటువంటి ప్రతిమలను కానుకగా ఇచ్చారు. వాటిని రథానికి అమర్చి, మంగళవారం ఉగాది ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు దుర్గగుడి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.  


ఏటా ఉగాది రోజుఇంద్రకీలాద్రిపై గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో రథోత్సవాన్ని నిర్వహించలేదు. ఈ సమయంలోనే రథంపై ఉండే సింహం విగ్రహాల్లో మూడు మాయమైన సంగతి తెలిసిందే. తరువాత దిమ్మెల రూపంలో ఉన్న చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో ఉన్నందున ఆ దిమ్మెలను కోర్టు ద్వారా దేవస్థానానికి స్వాధీనం చేయడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. దీంతో ఈ ఏడాది ఉత్సవాలకు అమ్మవారిని ఊరేగించే వెండి రథంపై సరికొత్త సింహం ప్రతిమలను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాదుకు చెందిన దాత స్వచ్ఛందంగా వీటిని తయారు చేయించి ఇటీవలే దేవస్థానం అధికారులకు అందజేశారు. మంగళవారం దాత ఇచ్చిన వెండి ప్రతిమలతో రథాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు.


నేడు వైభవంగా రథోత్సవం 

ప్లవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు దుర్గగుడి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి, పూజాదికాలను పూర్తి చేసి, ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు దేవస్థానంలోని రుద్రహోమం యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన, మండప పూజలు నిర్వహిస్తారు. 5 గంటలకు మల్లికార్జున మహామండపం నుంచి దుర్గామల్లేశ్వరుల ఉత్సవమూర్తులను వెండి రథంపై అంగరంగ వైభవంగా ఊరేగిస్తారు. 


తొమ్మిది రోజులు ప్రత్యేక పుష్పార్చనలు 

ఉగాది నుంచి తొమ్మిది రోజులపాటు ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా రోజుకు రెండు, మూడు రకాల పూలతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు అమ్మవారి ప్రధానాలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో పండితులు కలశ స్థాపన చేసి ఆది దంపతులకు ప్రత్యేక పుష్పార్చనలను ప్రారంభించనున్నారు. తొలిరోజు మల్లెలు, మరువంతో పుష్పార్చన జరుగుతుంది. 


ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి స్థిత క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి 20వ తేదీన తమలపాకుల పూజ నిర్వహిస్తారు. 21న శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలోనే సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement