Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమబాట

నేటి నుంచి దశల వారీ ఆందోళన


నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 6 : ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమబాట పడుతున్నారు. 71 డిమాండ్లను నెరవేర్చాలంటూ ఉద్యోగ సంఘాల వారు జేఏసీగా ఏర్పడి మంగళవారం నుంచి ఉద్యమానికి సిద్ధమయ్యారు. పీఆర్సీ ప్రకటించకుండా మూడేళ్లపాటు తాత్సారం చేసి, డీఏలు ఇవ్వకండా, ఉద్యోగుల హక్కులు అమలు చేయకుండా ఇబ్బంది పెడుతోందంటూ ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 


లక్షమందికిపైబడి ఉద్యోగులు 

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌, విశ్రాంత ఉద్యోగులు లక్షమందికి పైబడి ఉన్నారు. వీరంతా ఆందోళన బాట పడితే జిల్లా పరిపాలన కుంటుపడే ప్రమాదం ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు ఈ సారి స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి ఐక్యతతో తలపెట్టిన దశలవారీ ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ముందస్తుగా కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు నాయకులు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు మన్నేపల్లి పెంచలరావు, ఏపీజేఏసీ-అమరా వతి జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


ప్రధాన డిమాండ్లు ఇవే...

11వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలి.  పీఆర్సీ సిఫార్సులను యూనివర్సిటీలు, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులకూ అమలు చేయాలి.


సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన ఏడు డీఏలను వెంటనే విడుదల చేయాలి

సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో లోపాలను సరిచేసి సక్రమంగా అమలు చేయాలి. 

కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలి. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించి రద్దు చేయాలి.

కాంట్రాక్టు, అవుటోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచాలి.

ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ను సక్రమంగా అమలు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులకు ఆ స్కీమ్‌ కింద మెరుగైన సేవలు అందేలా చూడాలి.

ఉపాధ్యాయులందరికీ కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలి.  


ఉద్యమ కార్యాచరణ ఇలా...

ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హజరు కావడం.

13న నిరసన ప్రదర్శనలు, 21న జిల్లా కేంద్రాల్లో మహాధర్నా

27న విశాఖలో సదస్సు, 30న తిరుపతిలో సదస్సు


72 డిమాండ్లు పరిష్కరించాల్సిందే

ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి ఐక్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఉద్యమబాటపట్టాయి. 72 డిమాండ్లను రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వం ముందు ఉంచింది. వాటన్నింటినీ పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు.

- అల్లంపాటి పెంచలరెడ్డి, ఏపీజేఏసీ-అమరావతి జిల్లా అధ్యక్షుడు


ఎంత కాలమైనా పోరాడతాం 

డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఇప్పటి వరకు వేచిచూశాం. డిమాండ్ల సాధన కోసం ఎంతకాలమైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం.  

- మన్నేపల్లి పెంచలరావు, ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షుడు 


వెంటనే నెరవేర్చాలి 

ఉపాధ్యాయుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. కనీసం పిల్లల పెళ్లిళ్లకోసం దాచుకొన్న పీఎఫ్‌ డబ్బును తీసుకునే పరిస్థితి కూడా ప్రస్తుతం లేకపోవటం చాలా దారుణం. హెల్త్‌ కార్డులతో వైద్యం అందటం లేదు. నాలుగేళ్ల ఏపీజీఎల్‌ఐ అప్పును వెంటనే మంజూరు చేయాలి. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ సౌకర్యం వెంటనే కల్పించాలి. 

- వీ కోటేశ్వరరావు, ఏపీటీఎఫ్‌- 1938, జిల్లా ఉపాధ్యక్షుడు 


డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

పీఆర్సీ ప్రకటన, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఏపీజీఎల్‌ఐ, పీఎఫ్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంటు బిల్లులను వెంటనే ఆమోదించాలి. హెల్త్‌కార్డుల ద్వారా సరైన వైద్యం అందేలా చూడాలి.

- వై రమణారెడ్డి, ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు

Advertisement
Advertisement