ఉద్ధవ్‌ నిర్ణయం

ABN , First Publish Date - 2022-07-14T06:08:51+05:30 IST

నాది అంత సంకుచిత మనస్తత్వం కాదు అంటూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా నిలబడిన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే...

ఉద్ధవ్‌ నిర్ణయం

నాది అంత సంకుచిత మనస్తత్వం కాదు అంటూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా నిలబడిన ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఆమెకు మద్దతు ఇవ్వాలని తనపై ఎలాంటి ఒత్తిడీ లేదని, తన ఎంపీలు కూడా బలవంతపెట్టలేదని అన్నారాయన. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎన్డీయే నిలబెట్టిన అభ్యర్థికి తాను మద్దతు ఇవ్వకూడదని అంటూనే ద్రౌపదికి ఓటేశారాయన. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఉద్ధవ్ ఉదారతను ఓ రాజకీయ ఎత్తుగడగా, బీజేపీతో రాజీపడినట్టుగా భావిస్తున్నారు.


పార్టీ ఎంపీలతో సోమవారం జరిపిన సమావేశంలో ద్రౌపదికే మద్దతు ఇవ్వాలని ఎక్కువమంది కోరినట్టు వార్తలు వచ్చాయి. ఠాక్రేలను ప్రశ్నించడమన్నది ఎరుగని పార్టీలో కొందరి సంతకాలతో ఓ ఎంపీ ఆయనకు లేఖ రాశాడు. ఎంపీలతో జరిపిన భేటీ ఉద్ధవ్‌కు దిశానిర్దేశం చేసిందనీ, ఆయన గీత దాటే అవకాశాలు లేవని మీడియా అంచనాకు వచ్చింది. సమావేశానికి హాజరైన ఎంపీలంతా ఏకకంఠంతో ద్రౌపదికి మద్దతు ఇవ్వమని పట్టుబట్టారంటూ అందులో పాల్గొన్న ఓ ఎంపీ మీడియాకు చెప్పాడు కూడా. అందువల్ల, ఆయన ద్రౌపదికి మద్దతు ప్రకటించకపోతేనే ఎక్కువ ఆశ్చర్యపడాలి. మహావికాస్ అగాఢీలో ఉంటూనే యశ్వంత్ సిన్హాను కాక ద్రౌపదిని సమర్థించడం మరోవిశేషం. మాతో ఒక్కమాట చెప్పకుండా ఇలాచేయడం సరికాదన్నది కాంగ్రెస్. రాజ్యాంగ నియమాలను బేఖాతరు చేస్తూ అడ్డతోవలో అగాఢీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి, శివసేన ఉనికినే దెబ్బతీసిన బీజేపీ కూటమికి ఠాక్రే మద్దతు ఎలా ఇచ్చారని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నది. పవార్ పార్టీ కూడా ఉద్ధవ్‌ను గట్టిగానే నిలదీసింది.


పార్టీ ఎదుర్కొంటున్న తీవ్ర వ్యతిరేక పరిస్థితుల నేపథ్యంలోనే ఉద్ధవ్ ఈ నిర్ణయానికి వచ్చారన్నది వాస్తవం. 19మంది ఎంపీల్లో సమావేశానికి హాజరైనది పన్నెండుమందే కావచ్చును కానీ, ద్రౌపదికి మద్దతు ప్రకటించని పక్షంలో దీనిని సాకుగా చూపి వీరంతా ఎగిరిపోవచ్చు. కేవలం ఈ నిర్ణయంతో బీజేపీ దూకుడును నిలవరించలేకపోయినా, బీజేపీ, షిండే పక్షాలనుంచి కొనసాగుతున్న దాడిని కాస్తంత నిలువరించవచ్చును. జరిగిందేదో జరిగిపోయింది, బీజేపీతో వియ్యానికి దారులు పరవండి అని ఎంపీలు చేస్తున్న ఈ ఒత్తిడి వెనుక తిరుగుబాటు ఎత్తుగడే ఉన్నప్పటికీ, వారి మాట కాదనకుండా ఉన్నట్టు కనిపించవచ్చు. కనీసం పన్నెండుమంది ఎంపీలు షిండేవర్గం వైపు దూకేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైనందున కనీసం వారినైనా కాపాడుకోవాలంటే ఇలా దిగిరాకతప్పదు. గతంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే ముందు కూడా బీజేపీతో రాజీకి రమ్మని ఠాక్రేను కోరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎంపీల మాట వినకపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారని బీజేపీ నాయకులు హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ నిర్ణయం విధిలేకతీసుకున్నదే అయినా, బీజేపీ శివసేనల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థితిని కాస్తంత చల్లార్చేందుకు ఉపకరించవచ్చు. ఈ చర్యతో బీజేపీతో రాజీకి తాను సిద్ధమేనన్న సంకేతాన్ని ఇచ్చారనీ, బీజేపీ పెద్దలతో సుహృద్భావాన్ని కోరుకుంటున్నట్టు అర్థమని కొందరు విశ్లేషిస్తున్నారు. షిండేను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చుతున్న అంతటి సంక్షోభంలో కూడా ఠాక్రేలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ పెద్దలు దిగువస్థాయి నాయకత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఠాక్రే వర్గానికి షిండే వర్గం స్పీకర్ అనర్హత నోటీసులు జారీచేసినప్పుడు కూడా అందులో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్యలేడు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు అంటూ ఉండరని అంటారు. ఉద్ధవ్ ప్రస్తుత నిర్ణయం ఇరుపార్టీల మధ్యా దోస్తీకి బాటలు పరిచే అవకాశాలు పూర్తిగా కాదనలేనివి. ఉద్ధవ్ మద్దతు ప్రకటించారు కనుక నేడు ముంబైలో పర్యటించబోతున్న ద్రౌపది ముర్ము ఆయనను కలుసుకొనే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు. అదే జరిగితే బీజేపీ అధిష్ఠానం ఈ చర్య ద్వారా సానుకూల సందేశాలు పంపినట్టు భావించవచ్చు. ఉద్ధవ్ దగ్గర మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేల జోలికిరావద్దని కొత్త స్పీకర్‌ను ఆదేశించి, షిండే తిరుగుబాటునుంచి ప్రభుత్వ ఏర్పాటు వరకూ అన్ని నిర్ణయాలపై ఉద్ధవ్ దాఖలు చేసిన పిటిషన్లన్నింటి అత్యవసరవిచారణకు నిరాకరించి, ప్రత్యేక బెంచ్ ఏర్పాటు ద్వారా వాటిసంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు తేల్చేసిన నేపథ్యంలో ఆత్మరక్షణ తప్ప మరోదారి లేదని ఠాక్రేకు అర్థమై ఉంటుంది.

Updated Date - 2022-07-14T06:08:51+05:30 IST