జైపూర్: ఉదయ్‌పూర్ దర్జీ కన్నయ్యలాల్ (Kanhaiya Lal) హత్య కేసుకు సంబంధించి మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. కన్నయ్య లాల్‌ను హత్య చేయడంలో నిందితులిద్దరూ విఫలమైతే.. ఆ ‘పని’ పూర్తి చేసేందుకు మరో ఇద్దరు సిద్ధంగా (Standby) ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులను ఈ రోజు (శనివారం) జైపూర్ (Jaipur)లోని కోర్టులో ప్రవేశపెట్టగా వారిని ఈ నెల 12 వరకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీకి అప్పగించింది. అనంతరం నిందితులను తరలించేందుకు కోర్టు వెలుపలికి తీసుకురాగా నిందితులపై జనం ఒక్కసారిగా దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన ఎన్ఐఏ బృందం వారిని జనం బారి నుంచి రక్షించి అప్పటికే సిద్ధంగా ఉన్న వ్యాన్‌లోకి ఎక్కించడంతో నిందితులు గాయాలు కాకుండా తప్పించుకున్నారు.
కన్నయ్య లాల్ హత్య తర్వాత కొన్ని గంటల్లోనే నిందితులు రియాజ్ అఖ్తరి (Riaz Akhtari), గౌస్ మహమ్మద్ (Ghouse Mohammad)లను పోలీసులు అరెస్ట్ చేశారు. కన్నయ్యను హత్య చేయడంలో నిందితులు విఫలమైతే ఆ పనిని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో ఇద్దరు నిందితులు మోసిన్ (Mohsin), అసిఫ్(Asif)లను గురువారం అరెస్ట్ చేశారు. హంతకులు పరారయ్యేందుకు వీరిద్దరు సాయం చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. దర్యాప్తునకు కీలకంగా మారిన హంతకుల్లో ఒకడైన మహమ్మద్ గౌస్ స్కూటర్‌ను పోలీసులు ఉదయ్‌పూర్‌లో స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి