దుర్ఘటనకు రెండేళ్లు

ABN , First Publish Date - 2022-08-20T04:22:10+05:30 IST

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ ఉత్పాదన కేంద్రంలో జరిగిన ప్రమాదానికి శనివారంతో రెండేళ్లు పూర్తి కావస్తున్నాయి.

దుర్ఘటనకు రెండేళ్లు
శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు పవర్‌హౌజ్‌లో చెలరేగిన మంటలు (ఫైల్‌)

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్‌ ఉత్పాదన కేంద్రం ప్రమాదం నుంచి నేటికీ తేరుకోని సిబ్బంది

ఘటనలో తొమ్మిది మంది మృతి.. 

నాల్గో యూనిట్‌ పునరుద్ధరణకు మరో మూడు నెలలు పట్టే అవకాశం


నాగర్‌కర్నూల్‌/దోమలపెంట, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ ఉత్పాదన కేంద్రంలో జరిగిన ప్రమాదానికి శనివారంతో రెండేళ్లు పూర్తి కావస్తున్నాయి. పవర్‌హౌస్‌లో షార్ట్‌సర్క్యూట్‌ చోటు చేసుకుని, రూ.కోట్లలో ఆస్తినష్టంతో పాటు తొమ్మిది మంది సిబ్బంది అసువులు బాసిన విషయం తెలిసిందే. వారితో గడిపిన చివరి క్షణాలను సిబ్బంది స్మరించుకుంటూనే పవర్‌ప్లాంట్‌ పునరుద్ధరణ పనుల్లో మమేకమయ్యారు. రాష్ర్టానికి వెలుగును అందించే కీలకమైన జల విద్యుత్‌ ఉత్పాదనలో పాలుపంచుకుంటున్నారు. 2020 ఆగస్టు 20న ఎడమ గట్టు పవర్‌హౌజ్‌లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. ఒక్కోటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్న ఆరు యూనిట్లు గల పవర్‌హౌజ్‌లో షార్ట్‌సర్య్కూట్‌ జరిగి అంతటా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో దాదాపు 30 మంది నైట్‌ షిఫ్టులో పని చేస్తున్నారు. మంటలతో వ్యాప్తి చెందిన పొగతో శ్వాస ఆడక హైదరాబాద్‌కు చెందిన డీఈ శ్రీనివాస్‌గౌడ్‌, ఏఈలు మోహన్‌కుమార్‌, ఉజ్మాఫాతిమా, పాల్వంచకు చెందిన ఏఈ వెంకట్రావు, సూర్యాపేటకు చెందిన సుందర్‌, ప్లాంట్‌ అటెండెంట్‌ రాంబాబు, కిరణ్‌, అమెరూన్‌ బ్యాటరీ కంపెనీకి చెందిన వినేష్‌కుమార్‌, మహేష్‌కుమార్‌ దుర్మరణం పాలయ్యారు. వారితోపాటు విధి నిర్వహణలో ఉన్న అంకినేడు, కమలాకర్‌, కృష్ణారెడ్డి, మత్రునాయక్‌, వెంకట్రావు, నాగులు, వెంకటయ్య, మోతిలాల్‌, మోజేష్‌, జయబాబు, మహమూద్‌, రాజేందర్‌రెడ్డి ఎమర్జెన్సీ మార్గం గుండా అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు. అయితే తమతో చివరి క్షణాలను పంచుకున్న సహోద్యోగుల దుర్మరణంపై ఇప్పటికీ వాళ్లు షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. ప్రమాదం జరిగి రెండేళ్లవుతున్న నేపథ్యంలో వారితో ‘ఆంధ్రజ్యోతి’ మట్లాడే ప్రయత్నం చేయగా, భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమవుతూ మాట్లాడలేకపోయారు. 150 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్ల పునరుద్ధరణ పనులను పూర్తి చేసిన పవర్‌ప్లాంట్‌ సిబ్బంది, నాల్గో యూనిట్‌లో కూడా మూడు నెలల వ్యవధిలో విద్యుత్‌ ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.



Updated Date - 2022-08-20T04:22:10+05:30 IST