చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-07-02T05:54:58+05:30 IST

చేపల కోసం వేసిన విద్యుత్‌ కడీలతో విద్యుదాఘాతానికి గురై వృద్ధుడు మృతి చెందాడు.

చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
సీతారాములు(ఫైల్‌ఫొటో)

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడ్డారు. సూర్యాపేట జిల్లా మద్దిరాలలో వృద్ధుడితో పాటు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో యువకుడు చెరువులో పడి మృతి చెందారు. 

మద్దిరాల, జూలై 1:చేపల కోసం వేసిన విద్యుత్‌ కడీలతో విద్యుదాఘాతానికి గురై వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నర్సింగ్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మారెపల్లి మల్లయ్య(62), ముత్తమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరంతా వివాహాలు కావడంతో ఉపాధి నిమిత్తం వెళ్లి వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. మల్లయ్య దంపతులు స్వగ్రామంలో ఇంటి వద్దే ఉంటున్నారు. మల్లయ్య అప్పుడప్పుడు చెరువులో చేపల వేటకు వెళ్తుంటాడు. చేపల కోసం శుక్రవారం మల్లయ్య ఒంటరిగా వెళ్లాడు. అయితే కొంతకాలంగా చెరువులో ఇనుప కడీలకు విద్యుత్‌ సరఫరా చేసి కొందరు చెరువులో చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ సరఫరా అవుతున్న కడీలను అలాగే చెరువు గుంటలో వదిలి వెళ్లారు. ఇది గమనించని మల్లయ్య గుంటలోకి చేపల కోసం దిగాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్ది సేపటి తర్వాత అటుగా వెళ్లిన గ్రామస్థులు గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మల్లయ్య కుమారులు లింగయ్య, సంపత్‌ల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మల్లయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

మూసీనదీలో పడి

వేములపల్లి:చేపల వేటకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మూసీనదిలో పడి మృతి చెం దాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చలిచీమలపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చలిచీమలపాలెం గ్రామానికి చెందిన సాకి సీతారాములు(36) గ్రామసమీపంలోని మూసీవాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వాగు సమీపంలో నిలబడి వల విసిరే క్రమంలో ప్రమాదవశాత్తు మూసీలో పడ్డాడు. వేసిన వల కాళ్లకు చిక్కుకొని ప్రవాహంలో కొట్టుకొని వెళ్లి గల్లంతయ్యాడు. సమీపంలోని సూర్యాపేటకు చెందిన శ్రీను, తుంగతుర్తికి చెందిన సోమయ్య గ్రామస్థులకు సమాచారమివ్వగా అందరూ గాలించారు. నీటి ప్రవాహానికి కిలోమీటరు దూరం కొట్టుకుపోయి పెద్ద బండరాయి వద్ద సీతారాములు కనిపించగా గ్రామస్థులు బయటకు తీసి చూడగా అప్పటికే మృతిచెందాడు. సీతారాములుకు భార్య శ్రీలక్ష్మి, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

Updated Date - 2022-07-02T05:54:58+05:30 IST