Abn logo
May 31 2020 @ 04:27AM

చెరువులు నిండినా.. చేప పిల్లలు ఆగస్టులోనే!

గోదావరి జలాలతో 100 చెరువులు, కుంటలకు జలకళ

ప్రభుత్వం ఉచితంగా వదలడానికి మరో రెండు నెలలు

రెండు  కుంటల్లోకి ప్రైవేటు కాంట్రాక్టర్ల సహకారంతో 20 వేల చేప పిల్లలు


సిద్దిపేట, మే 30: గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపినా ప్రభుత్వ ఉచితంగా చేప పిల్లలు ఇప్పట్లో వదిలే అవకాశం లేకపోవడంతో మత్స్యకారులే ముందుకొస్తున్నారు. ఇప్పటికే రెండు కుంటల్లో 20 వేల చేప పిల్లలను వదిలారు. జిల్లాలో నీటి పారుదలశాఖ పరిధిలో 3,256 చెరువులున్నాయి. వీటిలో 1,455 చెరువులు, కుంటలు చేపలు పెంచడానికి అనువైనవిగా మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో ప్రభుత్వపరంగా ఉచితంగా చేప పిల్లలు వదులుతుంటారు. గత సంవత్సరం వర్షాలు ఆలస్యం కావడంతో చెరువుల్లో చేప పిల్లలు వేయడం ఆలస్యమైంది. ఆగస్టు నుంచి అక్టోబరు వరకు చేప విత్తనం పోశారు. 780 చెరువుల్లో 2.48 కోట్ల చేప పిల్లలు వదలగా.. వీటిలో అత్యధికంగా తక్కువ నిల్వ సామర్థ్యమున్న కుంటలే! సాధారణంగా చేపలు ఆరు నెలల వ్యవధిలో అర కిలో వరకు, 9 నెలల్లో కిలో వరకు ఎదుగుతాయి. 


గోదావరి జలాలతో చెరువులకు కళ

సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, తపాసుపల్లి రిజర్వాయర్ల ద్వారా గోదావరి జలాలను తరలించడంతో ఇప్పటికే 100 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు మత్తడి దుంకుతున్నాయి. త్వరలోనే మరిన్ని చెరువులను నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి జలాలు రావడంతో వానాకాలానికి ముందే  చెరువులు, కుంటలు నిండినా ప్రభుత్వం ఇప్పుడే చేప పిల్లలు వదిలే అవకాశం లేదు. ఈ సంవత్సరం జిల్లాలోని రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌తో కలిపి 1,591 చెరువుల్లో 4.37 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సంబందించిన టెండర్‌ షెడ్యూల్‌ శనివారం విడుదలైంది. జూన్‌ 23న టెండర్లు ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం జూలై చివర్లో లేదా ఆగస్టు నెలలో చెరువుల్లో చేప విత్తనం వదిలే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. 


మత్స్యకారులే ముందుకొచ్చి..

సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లి పరిధిలోని రెండు కుంటలు గోదావరి జలాలతో నిండడంతో మత్స్యకార సొసైటీల ద్వారా 20 వేల చేప పిల్లలను వదిలారు. ప్రభుత్వం పిల్లలు వదలడానికి సమయం ఉండడంతో మత్స్యకారుల సంఘాల ప్రైవేటు వ్యాపారులతో ఒప్పందం చేసుకుని పిల్లలు పోయిస్తున్నారు. గడువు ముగిసిన అనంతరం వ్యాపారులే చేపలు పట్టుకొని తీసుకెళ్తారు. మార్కెట్‌ ధరకంటే చాలా తక్కువ మొత్తంలో మత్స్యకారులకు చెల్లిస్తారు. ఈ విధానంలో మత్స్యకారుల కంటే కాంట్రాక్టర్లే ఎక్కువ లబ్ధిపొందుతారు. గోదావరి జలాలలో నిండిన చెరువుల్లో దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ముందుగానే చేప పిల్లలు వదిలితే మత్యకారులకు ప్రయోజనం కలుగుతుంది.

Advertisement
Advertisement