Abn logo
Sep 16 2021 @ 23:12PM

వేటగాళ్ల ఉచ్చుకు ఇద్దరు బలి

గుంత నుంచి బయటకు తీసిన మృతదేహాలు

- వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్‌తీగలు

- వాటికి తగిలి విగతజీవులైన యువకులు

కాగజ్‌నగర్‌ రూరల్‌, సెప్టెంబరు 16:కాగజ్‌నగర్‌ మండలం ఈసుగాం విలేజ్‌ నం.6లో వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్‌తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. కాగజ్‌నగర్‌ రూరల్‌ సీఐ రాజేంద్రప్రసాద్‌ తెలి పిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన తీగల దుర్గారాజ్‌ (30), కన్నెపల్లి సత్తయ్య(28) బుధ వారం సాయంత్రం ఇంటి నుంచి ఎప్పటిలాగే అడవికి బయలుదేరారు. ఐతే ఉదయంవరకు ఇంటికి రాకపో వడంతో అనుమానంతో కుటుంబీ కులు వారు ఎప్పుడు వెళ్లే ప్రాంతా నికి వెళ్లి వెతికారు. ఈ క్రమంలో అనుకోడ సమీపంలోని విలేజ్‌ నం.6లో యువకుల సగం వరకు పూడ్చిఉంచిన మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు తక్షణమే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వన్యప్రాణుల వేటకోసం అమర్చిన విద్యుత్‌ తీగలకు తగిలి ఇద్దరు మృతిచెందగా వారిని సమీపంలోని పొదళ్లలోకి తీసుకెళ్లి పూడ్చే ప్రయత్నం చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఐతే పూడ్చింది, విద్యుత్‌ తీగలు అమర్చింది ఎవరనేది తెలియాల్సి ఉందన్నారు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.