ఎన్నాళ్లీమృత్యు ఘోష...?

ABN , First Publish Date - 2021-04-17T06:12:19+05:30 IST

శుక్రవారం ఇడమడక గ్రామానికి చెందిన జెట్టి రమణయ్య (45), ముద్దం బాలనాగమ్మ (50) ఇక్కడ జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పెరుగు మాధవిని

ఎన్నాళ్లీమృత్యు ఘోష...?
ప్రమాదంలో మృతి చెందిన బాలనాగమ్మ

ఇప్పటికే 15 మంది మృత్యువాత

కడప-కర్నూలు జాతీయ రహదారిపై కారు ఢీకొని ఇద్దరు మృతి

అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలని గ్రామస్థుల ఆందోళన

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషాను అడ్డుకున్న ప్రజలు

దువ్వూరు, ఏప్రిల్‌ 16: ఆ రెండు గ్రామాల పాలిట జాతీయ రహదారి మృత్యుకూపంగా మారింది. గత ఐదేళ్లలో ఇక్కడ 15 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు.  అనేకమంది గాయపడ్డారు. కడప-కర్నూలు జాతీయ రహదారి కడపజిల్లా సరిహద్దులోని ఇడమడక చెక్‌పోస్టు వద్ద ఇడమడక, నారాయణపల్లె వెళ్లే గ్రామాలకు అండర్‌పాస్‌, సర్వీసు రోడ్డు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఇడమడక గ్రామానికి చెందిన జెట్టి రమణయ్య (45), ముద్దం బాలనాగమ్మ (50) ఇక్కడ జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పెరుగు మాధవిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చాగలమర్రి చెక్‌పోస్టు వద్ద వీరి స్కూటర్‌ను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ఇడమడక, నారాయణపల్లె గ్రామస్థులు మొదట మృతదేహాలతో జాతీయ రహదారిపై బైఠాయించారు. మండుటెండను సైతం లెక్కచేయక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రహదారిపై ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి కావడంతో ఇరువైపుల కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కడప డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా కడప నుంచి హైదరాబాదుకు వెళుతూ ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కున్నారు. విషయం తెలుసుకున్న మైదుకూరు రూరల్‌ సీఐ కొండారెడ్డి, దువ్వూరు ఎస్‌ఐ కుళాయప్ప, డిప్యూటీ సీఎం వాహనాలను పంపించేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అంగీకరించలేదు. దీంతో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా విషయాన్ని తెలుసుకుని గ్రామస్థుల సమస్యను కలెక్టర్‌, ఎస్పీకి ఫోనలో చెప్పారు. గ్రామస్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, మెట్ట సమీపంలో యూటర్న్‌ ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అంతటితో ప్రజలు శాంతించక తమ ప్రాణాలు నిలబెట్టాలంటే తక్షణమే సర్వీసు రహదారులు, యూటర్న్‌, అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులతో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తానే స్వయంగా సోమవారం లోపు సమస్యను పరిష్కరిస్తామనడంతో వారు ఆందోళన విరమించారు.



Updated Date - 2021-04-17T06:12:19+05:30 IST