చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2022-05-22T06:50:15+05:30 IST

మండలంలోని అడ్డరోడ్డు తిమ్మాపురం గ్రామంలో జరిగిన చోరీ కేసును శనివారం పోలీసులు ఛేదించినట్టు సీఐ నారాయణరావు తెలిపారు.

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ నారాయణరావు


ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షలు స్వాధీనం

ఎస్‌.రాయవరం, మే 21: మండలంలోని అడ్డరోడ్డు తిమ్మాపురం గ్రామంలో జరిగిన చోరీ కేసును శనివారం పోలీసులు ఛేదించినట్టు సీఐ నారాయణరావు తెలిపారు.ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, అడ్డరోడ్డు తిమ్మాపురంలో ఈ నెల 19వ తేదిన అర్ధరాత్రి రెండు ఇళ్లల్లో చోరీ జరిగిందని, ఒక ఇంట్లో రూ.1.5 లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారని చెప్పారు. సమాచారం అందిన వెంటనే వెళ్లి క్లూస్‌ టీం ద్వారా పరిశీలించి, సాక్ష్యాధారాలను సేకరించామన్నారు. ఇప్పటికే మూడు కేసులు ఉన్న ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరానికి చెందిన చేపల నానితో పాటు చోడిపల్లి శివపై అనుమానం ఉండడంతో, వారిని వెతికి పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్టు అంగీకరించారన్నారు. వారి నుంచి ఒక ఇంటికి చెందిన రూ.1.5 లక్షల నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేయగా, మరో ఇంటిలో దొంగతనానికి పాల్పడినప్పటికీ ఏమీ పోలేదని ఫిర్యాదుదారుడు చెప్పినట్టు సీఐ తెలిపారు. దుర్వ్యసనాలు, జూదాలకు అలవాటు పడడంతోనే నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. చేపల నాని, చోడిపల్లి శివపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-22T06:50:15+05:30 IST