మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2022-01-25T06:15:47+05:30 IST

చెన్నైలో బీటెక్‌ చదివి మాదకద్రవ్యాలకు అలవాటు పడి తాము సేవించడమే కాకుండా ఇతరులకు విక్రయిస్తున్న ఇద్దరు యువకులకు ఎంవీపీ జోన్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రదర్శిస్తున్న సీఐ రమణయ్య. పక్కన ఎస్‌ఐ భాస్కరరావు

నిందితులిద్దరూ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు

ఎంవీపీ కాలనీ, జనవరి 24: చెన్నైలో బీటెక్‌ చదివి మాదకద్రవ్యాలకు అలవాటు పడి తాము సేవించడమే కాకుండా ఇతరులకు విక్రయిస్తున్న ఇద్దరు యువకులకు ఎంవీపీ జోన్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం సాయంత్రం ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంఽధించిన వివరాలను సీఐ రమణయ్య వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కె.రాహుల్‌ నగరంలోని అక్కయ్యపాలెంలో నివాసం ఉంటున్నాడు. పెదగంట్యాడకు చెందిన ఆర్‌.అఖిల్‌తో చెన్నైలో బీటెక్‌ చేస్తుండగా స్నేహమేర్పడింది. కళాశాల రోజుల్లోనే వీరు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. పరిచయం వున్న వ్యక్తులతో మాదకద్రవ్యాలు తెప్పించి వీరు సేవించడమే కాకుండా ఇతరులకు విక్రయించే వారని సీఐ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఆదివారం మధ్యాహ్నం సీతమ్మధారలో రాహుల్‌ను, పెదగంట్యాడలో అఖిల్‌ను అదుపులోకి తీసుకుని వీరివద్ద నుంచి డ్రగ్స్‌ అయిన ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ 19, ఓసీబీ షీట్స్‌ ఏడు, ఎండీఎంఏ పిల్స్‌ మూడు, 20 గ్రాముల గంజాయి, చిన్న తూనిక యంత్రం, రూ.రెండు వేల నగదు, ఒక స్కూటీ, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపాలని మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. సిటీ టాస్క్‌ఫోర్స్‌, ఎంవీపీ జోన్‌ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ భాస్కరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T06:15:47+05:30 IST