కంది పైనే ఆశ

ABN , First Publish Date - 2020-11-27T04:39:01+05:30 IST

ఈసారి భారీగా కురిసిన వర్షాల కారణంగా పత్తి పాడైపోయింది. వరి నేలకొరిగింది.

కంది పైనే ఆశ
ఏపుగా పెరిగి పూత దశలో ఉన్న కంది పంట

  • పూత, పిందె, కాయ దశకు చేరిన పంట
  • సస్యరక్షణ చర్యలతో ప్రయోజనం


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది కంది పంట ఆశాజనకంగా ఉంది. వరి, పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేసింది కంది పంటనే.. ప్రభుత్వ నియంత్రిత సాగు విధానాన్ని ప్రవేశ పెట్టడంతో రైతులు కంది వైపు మొగ్గు చూపారు. ఈసారి భారీ వర్షాలకు కంది పంటకు నష్టం వాటిల్లినప్పటికీ.. ఉన్న మిగతా పంట ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం పూత, పిందె, కాయ దశలో ఉంది. తగిన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఈసారి భారీగా కురిసిన వర్షాల కారణంగా పత్తి పాడైపోయింది. వరి నేలకొరిగింది. కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. కంది పంట మాత్రం ఆశాజనకంగా ఉండటంతో రైతులు దిగుబడులపై ఆశలు పెంచుకున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన కంది పంట ప్రస్తుతం పూత, పిందె, కాయ దశలో ఉంది. నియంత్రిత సాగు విధానం అమలులో భాగంగా పత్తి, వరి తర్వాత కందికే అధిక ప్రాధాన్యమిచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో కంది సాధారణ విస్తీర్ణం 71,073.5 ఎకరాలు కాగా 1,43,374.4 ఎకరాలు సాగు చేశారు. ఈసారి సర్కారు నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేయడంతో పత్తి తర్వాత కందినే ఎక్కువగా సాగు చేశారు. 2,60,240 ఎకరాలు నియంత్రిత కంది సాగు లక్ష్యంగా కాగా 2,42,601 ఎకరాలు సాగు చేశారు. ఈ సారి కురిసిన భారీ వర్షాల కారణంగా 39,445 ఎకరాల విస్తీర్ణంలో కంది పాడైంది. మిగతా 2,03,156 ఎకరాల్లో కంది ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం ఏపుగా పెరిగి పూత, పిందె కాయ దశలో కళకళలాడుతోంది. ఈ సమయంలోనే రైతులు సస్యరక్షణ చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.

        ఈసారి నియంత్రిత సాగు విధానంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పత్తి, వరి తర్వాత కంది పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. వికారాబాద్‌ జిల్లాలో కంది పంటను అత్యధికంగా సాగు చేశారు. ఇం దులో సింహభాగం తాండూరు, కొడంగల్‌ నియోజక వర్గాల్లో సాగు చేశారు. 2019 ఖరీఫ్‌లో వికారాబాద్‌ జిల్లాలో కంది సాధారణ విస్తీర్ణం 56,721 ఎక రాలు కాగా 1,25,161 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈసారి నియంత్రిత సాగు విధానం అమల్లోకి రావడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 1,75,900 ఎకరాల్లో సాగు చేయాలని సర్కార్‌ నిర్ణయించింది. దీంతో 1,70,627 ఎకరాల్లో కందిని సాగు చేశారు. ఇటీవల భారీ వర్షాలకు 33,142 ఎకరాల విస్తీర్ణంలో కంది నీట మునగడంతో కొంత మేర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది కంది సాధారణ విస్తీర్ణం 14,050 ఎకరాలు కాగా, 18,127 ఎకరాలు సాగు చేశారు. ఈసారి 82,554 ఎకరాల్లో సాగు ప్రణాళిక కాగా 69,808 ఎక రాలు సాగు చే శారు. ఇందులో వర్షాలకు 6,303 ఎకరాలు దెబ్బ తిన్నది. మేడ్చల్‌ జిల్లాలో గత ఏడాది ఖరీఫ్‌లో కంది సాధారణ విస్తీర్ణం 302.5 ఎకరాలు ఉండగా కేవలం 86.4 ఎకరాల్లో కంది వేశారు. ఈసారి ఖరీఫ్‌లో 1,786 ఎకరాలు సాగు చేస్తారని అంచనా వేయగా 2,166 ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది క్వింటా కందులకు మద్దతు ధర రూ. 5,800 చెల్లించారు. ఈసారి రూ.6 వేలు చెల్లించనున్నారు. మద్దతు ధర క్వింటాకు రూ.200 పెరగ నుందని అధికారులు తెలిపారు. 


సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.. : గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

పూతదశలో కంది పంటకు శనగ పచ్చ పురుగు, మారుక మచ్చల పురుగు ఆశించే అవకాశముంది. తగిన సస్యరక్షణ చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. పంట రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు అధికారి మాటల్లో..


శనగ పచ్చపురుగు..

  • ఎకరానికి 4 లింగార్షక బుట్టలను పెట్టి పురుగు ఉనికి గమనించి తగిన సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. 
  • ఎకరానికి 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేస్తే పురుగులను తినే పక్షులను ఆకర్శించేందుకు వీలవుతుంది. చాలారకాల పక్షులు పురుగులను ఏరి తింటాయి.
  • పురుగు గుడ్లను, తొలి దశ పురుగులను గమనించిన వెంటనే 5శాతం వేప గింజల కషాయం లేదా వేప సంబంధమైన మందు అజాదిరచిటిన్‌ 1500 పీపీఎం, 5 మి.లి నీటిలో కలిపి పిచికారి చేస్తే పురుగు పెరుగుదల గుడ్డుపెట్టడం తగ్గుతుంది. 
  • బాగా ఎదిగిన పురుగుల మీద రసాయన మందులు పనిచేయవు. కాగా చెట్టును బాగా కుదిపి గోన సంచిలపై పడిన పురుగులను నాశనం చేయాలి. 
  • రసాయనిక పురుగు మందులను విచక్షణా రహితంగా వాడ కూడదు. పురుగు ఉదృతినిబట్టి తొలి పూతదశలో ఉన్నప్పుడు క్లోరి పైరిఫాస్‌ 2.5 మి.లి పూతకాయ దశలో అసిఫేట్‌ 1.5 గ్రా లేదా స్పైనోశాడ్‌ 0.3 మి.లి. నోవాల్యూరాన్‌ 0.75 మి.లి లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. 


మారుక మచ్చల పురుగు..

పూత, పిందె దశలో కాయలకు కాయతొలుచు పురుగు రంధ్రాలు చేసి గింజలు తింటుంది. ఒక కాయ నుంచి మరో కాయకు ఆశిస్తుంది. పురుగు మొగ్గ, పూత పిందెలపై గుడ్డుపెట్టి లార్వా దశ నుంచి గూడు కట్టుకొని తింటుంది. ఒకసారి గూడు కట్టి లోపల వెళ్లిన తర్వాత నివారణ కష్టం కాబట్టి గుడ్లను తొలిదశలోనే నివారించడం అవసరం. దీని నివారణకు క్లోరిపైరిఫోస్‌ 2.5మి.లీ., అసిఫేట్‌ 1.0గ్రాము స్పైనోశాడ్‌ 0.3మి.లీ, నోవాల్యూరాన్‌ 0.7 మి.లీ., లేదా థయోడికార్బ్‌ 1గ్రాముతో డైక్లోరోవైస్‌ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి మందులు మార్చి వారంరోజులకోసారి పిచికారి చేయాలి. 


కంది పంట బాగుంది..!

గత ఏడాది 24 ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. ఎకరానికి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈ సారి కూడా 24 ఎకరాల్లో కందిని సాగు చేశాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 6ఎకరాల వరకు కంది పంట దెబ్బతిన్నది. మిగతా 18 ఎకరాల్లో పంట ఏపుగా పెరిగింది. పూత దశకు చేరుకుంది. ఇప్పటివరకు  ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. పూత, కాయ దశలో పురుగు ఆశించే ప్రమాదం ఉంది. మందుల పిచికారికి ఎకరానికి మరో 10 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంది. సస్యరక్షణ చర్యలు చేపడితే... ఈ సారి దిగుబడి అధికంగా వచ్చే అవకాశాలున్నాయి. 

- శ్రీనివాస్‌రెడ్డి, ఎక్మాయి గ్రామం, బషీరాబాద్‌ మండలం 


Updated Date - 2020-11-27T04:39:01+05:30 IST