ఆ మూడు ఘాట్లలో రద్దీ

ABN , First Publish Date - 2020-11-29T05:20:16+05:30 IST

తుంగభద్ర పుష్కరాల తొమ్మిదోరోజు శనివారం సంకల్‌బాగ్‌, మంత్రాలయం, సంగమేశ్వరం ఘాట్లలో రద్దీ కనిపించింది.

ఆ మూడు ఘాట్లలో రద్దీ
సంగమేశ్వరంలో షవర్ల కింద స్నానం చేస్తున్న భక్తులు

  1.  వర్షంలోనూ వచ్చిన భక్తులు
  2.  మిగతా వాటిలో అంతంత మాత్రమే


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, కర్నూలు: తుంగభద్ర పుష్కరాల తొమ్మిదోరోజు శనివారం సంకల్‌బాగ్‌, మంత్రాలయం, సంగమేశ్వరం ఘాట్లలో రద్దీ కనిపించింది. వర్షం పడుతున్నా భక్తులు వచ్చి స్నానాలు ఆచరించారు. అయితే మిగతా వాటిలో ఎప్పటిలాగే భక్తుల సంఖ్య అంతమాత్రమే ఉంది. శనివారం కూడా వర్షం పడడంతో కొన్నిచోట్ల టెంట్లు కారుతుండటంతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. హిందూస్థాన్‌ కంప్యూటర్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) చైర్మన్‌ శ్రీధర్‌ గుండ్రేవుల పుష్కర ఘాట్‌కు వచ్చారు. తుంగభద్ర పుష్కరాలకు రావడం ఇది నాలుగోసారి అని తెలిపారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం, అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో సంకల్‌బాగ్‌ పుష్కర ఘాట్‌ హరిహర క్షేత్రంలో వెయ్యి మందికి అన్నదానం నిర్వహించారు. రాంభొట్ల ఘాట్‌, గంగమ్మ గుడి పుష్కర ఘాట్‌లలో నగర బ్రాహ్మణ సంఘం, హిందూ వాయుసేన సేవాదళ్‌ ఆధ్వర్యంలో ముల్లంగి హర్ష జ్ఞాపకార్థం ముల్లంగి కిషన్‌ గాంధీ చేతుల మీదుగా ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కళ్లే చంద్రశేఖరశర్మ, కరివేన అన్నదాన సత్రం కార్యదర్శి డాక్టర్‌ వేణుగోపాల్‌, హిందూ వాయు సేవాదళ్‌ సభ్యులు గోవిందరాజు, పాండురంగారావు, భానుప్రకాశ్‌, లలితాపీఠం పీఠాధిపతి సుబ్రహ్మణ్యం స్వామి బృందం పాల్గొన్నారు. కర్నూలులోని రాఘవేంద్ర పుష్కర ఘాట్‌లో వారం రోజులుగా లయన్స్‌ క్లబ్‌ కర్నూలు మెల్విన్‌ జోన్స్‌, నైస్‌ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పుష్కర భక్తులకు, రక్షణ సిబ్బందికి, మున్సిపల్‌ శానిటరీ వర్కర్లకు అల్పాహారం, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తున్నారు. అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్‌, ఇతర ప్రతినిధులు వెంకటేశ్వర్లు, డాక్టర్‌ జయప్రకాశ్‌, శ్రీకాంత్‌, నైస్‌ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి రాయపాటి నాగలక్ష్మి, ఎంపీడీవో సుబ్బారెడ్డి, శారదమ్మ తదితరులు పాల్గొన్నారు. సంగమేశ్వరంలో తుంగభద్ర పుష్కరాలకు గత రెండు రోజులతో పోలిస్తే భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 850 మంది భక్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కపిలేశ్వరం వద్ద కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఏర్పాట్లను డిప్యూటీ కలెక్టర్‌ చంద్రమోహన్‌, డ్వామా పీడీ వెంగన్న పరిశీలించారు. కర్నూలు సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌లో సాయంత్రం కార్తీక పంచ హారతులు ఇచ్చారు. 


వృద్ధులకు పుష్కర స్నానాలు


తుంగభద్ర పుష్కరాల్లో రెండు రోజులుగా పోలీసు అధికారులు సామాజిక సేవలు నిర్వహిస్తున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ ఫక్కీరప్ప సూచనలతో, పోలీసు అధికారులు శనివారం పుష్కరాల తొమ్మిదో రోజున కర్నూలు నగరంలోని రెండు వృద్ధాశ్రమాలకు చెందిన 22 వృద్ధులను పోలీసు వాహనాల్లో పుష్కరాలకు తీసుకువచ్చారు. నదీ జలాలలో వారికి సంప్రోక్షణ చేయించారు. అనంతరం యాగశాలకు తీసుకుపోయి వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించారు. వారికి దుప్పట్లు, శానిటైజర్లు, మాస్కులు, బిస్కెట్లు అందించారు. అడిషనల్‌ ఎస్పీ ఎల్‌.అర్జున్‌, కర్నూలు టౌన్‌ డీఎస్పీ కేవీ మహేష్‌, హోంగార్డు డీఎస్పీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ  ఆదివారంఅనాథ ఆశ్రమంలోని 12 ఏళ్లు పైబడి వారికి తుంగభద్ర పుష్కర స్నానం, పూజా కార్యక్రమాల్లో పాల్గొనే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సీఐలు మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్‌లు పాల్గొన్నారు. 



Updated Date - 2020-11-29T05:20:16+05:30 IST