పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2021-07-26T06:25:19+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆదివారం లక్షా తొంభై వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరింది.

పోటెత్తిన వరద

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌ గేట్ల ఎత్తివేత 

రాయదుర్గం, జూలై 25 : తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఆదివారం లక్షా తొంభై వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి చేరింది. దీంతో అప్రమత్తమైన బోర్డు అధికారులు వెంటనే ఐదు క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని కిందివైపు  నదికి వదిలారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు బోర్డు కార్యదర్శి నాగమోహన క్రస్ట్‌గేట్ల స్విచలను ఆన చేసి నీటిని నదిలోకి వదిలారు. క్రమేపీ గేట్ల స్థాయిని పెంచుతూ పది గేట్లను ఎత్తి 41,690 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. నీటి ఉధృతి పెరిగే కొద్ది కనీసం 20 గేట్లదాకా సోమవారం ఉద యానికి ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే జలాశయంలో 90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఊహించని రీతిలో ఎగువ నుంచి జలాశయంలోకి నీరు చేరుతుండటంతో దిగువకు నీరు వదిలేస్తున్నారు. ఇప్పటికే నదీపరివాహక ప్రాంతంలోని హంపి, కంప్లి లాంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని దండోరాలు వేయించి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. రెండు లక్షల క్యూసెక్కుల దాకా నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరద నీటి ఉధృతిని అంచనా వేస్తూ జలాశయానికి ఎలాంటి ముప్పు లేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎగువన తుంగ జలాశయం నుంచి 1.45 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అగుంబె, శివమొగ్గలతో పాటు హరిహర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండ టంతో తుంగభద్ర జలాశయం నిండుతోంది. కాగా జలాశయానికి అనుబంధంగా ఉన్న కాలువలన్నింటికీ నీరు విడుదల చేశారు. రోజుకు 8,948 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 


Updated Date - 2021-07-26T06:25:19+05:30 IST