టీటీడీ ఈవో సింఘాల్‌ బదిలీ

ABN , First Publish Date - 2020-10-01T17:48:14+05:30 IST

టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ అయ్యారు.2017 మే నెల 6వ తేదిన..

టీటీడీ ఈవో సింఘాల్‌ బదిలీ

తిరుమల(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బదిలీ అయ్యారు.2017 మే నెల 6వ తేదిన ఈవోగా బాధ్యతలు స్వీకరించి నప్పటినుంచీ వారానికోసారి స్వామికి తలనీలాలు సమర్పిస్తూ భక్తిభావంతో సేవలందించిన  సింఘాల్‌ను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా బుధవారం రాత్రి  ప్రభుత్వం బదిలీ చేసింది.టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సర్వ దర్శనం భక్తులు అధిక సమయం క్యూలైన్లలో వేచివుండకుండా ‘స్లాటెడ్‌ సర్వదర్శనం’ (ఎస్‌ఎస్‌డీ) విధానానికి శ్రీకారం చుట్టిన సింఘాల్‌ తిరుపతి, తిరుమలల్లో కొన్ని కౌంటర్లను ఏర్పాటు చేసి కావాల్సిన సమయానికి టోకెన్లు పొందిన భక్తులకు గంట నుంచి గంటన్నర వ్యవధిలో శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు.


దీంతో పాటు ఆలయాల నిర్మాణం, మరమ్మతుల కార్యక్రమం కోసం శ్రీవాణి ట్రస్టును కూడా తీసుకువచ్చారు. ఈ ట్రస్టు దాతలకు దర్శన సౌకర్యం కూడా కల్పిస్తుండడంతో విరాళాలు పెరుగుతున్నాయి. రూ.60లక్షల వ్యయంతో ఉగ్రాణం, రూ.90 కోట్ల వ్యయంతో శ్రీవారిసేవా సదన్‌ జంట భవనాలు, రూ.20 కోట్లతో నారాయణగిరి ఉద్యావనంలో వెయిటింగ్‌ షెడ్లు, పటిష్టమైన క్యూలైన్లను నిర్మించడంతో పాటు రూ.వంద కోట్లతో కాటేజీల గదులకు మరమ్మతులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సామాన్యులెవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో ఉచిత ఫుడ్‌ కౌంటర్లను ఏర్పాటు చేశారు.


తిరుమలలో భద్రతను పెంచడంలో భాగంగా 1200కు పైగా సీసీ కెమెరాల వ్యవస్థ, కమాండెంట్‌ కంట్రోల్‌ రూమ్‌ తీసుకువచ్చారు. శ్రీవారి దర్శనార్థం భక్తులు వేచివుండే కంపార్టుమెంట్లలో సమాచార బోర్డులను ఏర్పాటు చేయించారు. ఏ సమయానికి దర్శనం పూర్తవుతుంది, ఏ కంపార్టుమెంటులో ఉన్నారు, ప్రస్తుతం ఏ కంపార్టుమెంటులోని భక్తులు దర్శనానికి వెళుతున్నారనే సమాచారం తెలిపే డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే క్యూలైన్లోకి సెల్‌ఫోన్లకు అనుమతి లేని నేపథ్యంలో బంధువులతో మాట్లాడేందుకు వీలుగా ఉచిత ఫోన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువ చ్చారు. తిరుమల కొండపై విద్యుత్‌ ఆదా చేసేందుకు ఎల్‌ఈడీ లైట్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. తద్వారా ఏడాదికి సుమారు రూ.2 కోట్ల దాకా విద్యుత్‌ ఖర్చు తగ్గింది.


ఆలయంలో పురాతన కట్టడాలను భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ నుంచి శ్రీవారి సన్నిధి వరకు క్యూలైన్‌లో తోపులాటలు, తొక్కిస లాటలు జరగకుండా పటిష్టమైన క్యూలైన్ల నిర్మాణాలు ఈయన హయాంలోనే జరిగాయి. శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా కన్యాకుమారి, ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి ప్రదేశాల్లో నూతన ఆలయ నిర్మాణాలను కూడా పూర్తిచేశారు. మూడేళ్ల ఐదు నెలలు ఈవోగా పనిచేసిన సింఘాల్‌ అత్యధిక కాలం పనిచేసిన ఈవోల్లో మూడవస్థానంలో నిలిచారు.మరోవైపు  అప్పుడప్పుడూ తలెత్తిన విమర్శలను కూడా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సమర్థవంతంగా  ఎదుర్కొంటూ వచ్చారు.

Updated Date - 2020-10-01T17:48:14+05:30 IST