ట్రంప్ బస చేసిన హోటల్‌లో కమెండోలు, షార్ప్ షూటర్లతో పహరా

ABN , First Publish Date - 2020-02-25T18:08:33+05:30 IST

అగ్రరాజ్యమైన అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుటుంబసభ్యులు బస చేసిన ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్‌లో పలు కీలక విభాగాల కమెండోలు, షార్ప్ షూటర్లతో భారీ భద్రత కల్పించారు. ....

ట్రంప్ బస చేసిన హోటల్‌లో కమెండోలు, షార్ప్ షూటర్లతో పహరా

న్యూఢిల్లీ : అగ్రరాజ్యమైన అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుటుంబసభ్యులు బస చేసిన ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్‌లో పలు కీలక విభాగాల కమెండోలు, షార్ప్ షూటర్లతో భారీ భద్రత కల్పించారు. ట్రంప్ బస చేసిన హోటల్ లో ఐదంచెల భద్రత కల్పించారు. మొదటి రెండు అంచెల భద్రతలో అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ, ఎఫ్‌బీఐ అధికారులను నియమించారు. మౌర్యా హోటల్ లాబీలు, పార్కింగ్, లాన్, స్విమ్మింగ్ పూల్ ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసు సెక్యూరిటీ విభాగం అధికారులు తనిఖీలు చేస్తూ పహరా కాస్తున్నారు.


మౌర్యా హోటల్‌లోని  ప్రతీ అంతస్తులో నేషనల్ సెక్యూరిటీ గార్డులు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండోలు నిరంతరం గస్తీగా తిరుగుతున్నారు. భద్రతా కారణాల రీత్యా హోటల్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. హోటల్ ఉద్యోగులను కూడా ట్రంప్ బస చేసిన ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోకి అనుమతించడం లేదని ఓ భద్రతాధికారి చెప్పారు.


మొట్టమొదటిసారి మౌర్యా హోటల్ లో ఉన్న 438 గదులను ఖాళీ చేయించి అమెరికన్ల కోసం వీటిని కేటాయించారు. అత్యంత అధునాతన ఆయుధాలతో అమెరికన్ సీక్రెట్ సర్వీసు జవాన్లు వెయ్యిమంది ట్రంప్ కుటుంబ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ హోటల్ చుట్టుపక్కల భవనాలపై కమాండోలు, షార్ప్ షూటర్లను రంగంలోకి దించి నిరంతరం డేగకళ్లతో నిఘా వేశారు. హోటల్ ముందు రోడ్డును మూసివేసి ట్రాఫిక్ ను దారి మళ్లించారు.ట్రంప్ కాన్వాయ్ వెళుతున్న ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ జామర్లను ఏర్పాటు చేశారు. ట్రంప్ పర్యటిస్తున్న రాజ్ ఘాట్, రాష్ట్రపతి భవన్, హైదరాబాద్ హౌస్ ప్రాంతాల్లో భారీ బలగాలను మోహరించారు.

Updated Date - 2020-02-25T18:08:33+05:30 IST