జరిమానా ‘ఓవర్‌’.. ట్రక్‌ ఆటో డ్రైవర్ల గుండె గుభేల్‌

ABN , First Publish Date - 2021-08-23T06:03:57+05:30 IST

సరుకులు రవాణా చేస్తూ..

జరిమానా ‘ఓవర్‌’.. ట్రక్‌ ఆటో డ్రైవర్ల గుండె గుభేల్‌

ప్రాథమికంగా రూ.20 వేల పెనాల్టీ

ప్రతీ అదనపు టన్నుకు రూ.2 వేలు అదనం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): సరుకులు రవాణా చేస్తూ జీవనం సాగించే ట్రక్‌ ఆటోడ్రైవర్లు ఓవర్‌ లోడింగ్‌ పెనాల్టీలతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పెనాల్టీలు చూస్తూనే వారి గుండెలు జారినంత పని అవుతున్నది. ఒక్కసారి పెనాల్టీ పడితే ఆ ఆటోడ్రైవర్ల రెండు నెలల సంపాదన ఇట్టే ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం సవరించిన మోటార్‌ వాహన చట్టంలోని పెనాల్టీలను కొన్ని రోజుల క్రితం నుంచి జిల్లాలోని ఎంవీఐలు అమలు చేయడం ప్రారంభించారు. వాహనం పరిమితికి మించి ఏమాత్రం అదనంగా లోడింగ్‌ జరిగి ఉన్నా రూ.20 వేల పెనాల్టీ వేసేస్తోన్నారు. ఇప్పటికే చాలామంది ఓవర్‌ లోడింగ్‌తో వెళుతూ ఎంవీఐలకు చిక్కి భారీ మొత్తంలోనే పెనాల్టీలు చెల్లించారు. చట్టంలోని 194 సెక్షన్‌ ప్రకారం ఏదైనా ఆటో/లారీలో పరిమితికి మించి అదనంగా సరుకు లోడింగ్‌ చేస్తే గతంలో రూ.2 వేల పెనాల్టీ, ప్రతీ అదనపు టన్నుకు రూ.వెయ్యి జరిమానా వేసేవారు.


ఇప్పుడు చట్ట సవరణ అనంతరం ఆ పెనాల్టీలు భారంగా పరిణమించాయి. ఏమాత్రం ఓవర్‌ లోడింగ్‌ జరిగినా రూ.20 వేలు పెనాల్టీ వేస్తున్నారు. అంతేకాకుండా అదనపు బరువు పేరుతో టన్నుకు అదనంగా రూ. 2 వేలు విధిస్తున్నారు. లారీలు, ఆటోలలో కాస్త అయినా ఓవర్‌ లోడింగ్‌ చేయకుండా సరుకుల రవాణ జరిగే పరిస్థితి ఉండదు. పెరిగిన డీజిల్‌ ధరలు కారణంగా ఓవర్‌ లోడింగ్‌ చేయకపోతే ఏదైనా సరుకుల రవాణా ట్రిప్పునకు వెళితే కనీసం ఇందన ఛార్జీలు కూడా రావు. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రైవర్లు కాస్త ఓవర్‌ లోడింగ్‌ చేస్తున్నారు. దానిని ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం  అధికారులు పట్టుకుని భారీ మొత్తంలో పెనాల్టీలు విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తామెలా జీవించాలని ఆటో, లారీ డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా సెక్షన్‌ల కింద పెనాల్టీలు కూడా పెరిగినా ఓవర్‌ లోడింగ్‌ పెనాల్టీనే తీవ్రంగా వేధిస్తున్నది. 


నెలలో ఒక్కసారి ఎంవీఐకి చిక్కినా...

జిల్లాలో వివిధ టోల్‌ప్లాజాలు, చెక్‌పోస్టుల వద్దనే కాకుండా మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు పెట్రోలింగ్‌లు నిర్వహిస్తోన్నారు. వారికి ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆటో/లారీని వేబ్రిడ్జీకి తీసుకెళ్లి తూకం వేయిస్తున్నారు. ఆ సందర్భంలోనే ఓవర్‌ లోడింగ్‌ పెనాల్టీలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెలలో ఒక్కసారి ఎంవీఐకి ఇలా ఓవర్‌ లోడింగ్‌తో వెళుతూ పట్టుబడినా వారు వేసే పెనాల్టీతో కష్టార్జితం మొత్తం ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమౌతున్నది. ఈ తరహా పెనాల్టీలతో ఆటోలు/లారీలు నడిపి జీవనం సాగించలేని పరిస్థితి నెలకొన్నదని డ్రైవర్లు వాపోతున్నారు. 

 


Updated Date - 2021-08-23T06:03:57+05:30 IST