టీఆర్‌ఎస్‌కు ఝలక్‌

ABN , First Publish Date - 2021-11-24T06:00:32+05:30 IST

కరీంనగర్‌ మాజీ మేయర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉద్యమకాలంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేత సర్దార్‌ రవీందర్‌సింగ్‌ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాయకత్వానికి ఝలక్‌ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌కు ఝలక్‌

- ఎమ్మెల్సీ పోటీలో రవీందర్‌సింగ్‌ 

- ప్రతిపాదకుల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రతినిధులు 

- ఆసక్తిగా అధికార పార్టీ రాజకీయాలు 

- బుజ్జగింపులకు శ్రీకారం చుట్టిన మంత్రులు 

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌ మాజీ మేయర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉద్యమకాలంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేత సర్దార్‌ రవీందర్‌సింగ్‌ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాయకత్వానికి ఝలక్‌ ఇచ్చారు. అధినేత కేసీఆర్‌ కరీంనగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన టి భానుప్రసాద్‌రావు, మాజీ మంత్రి ఎల్‌ రమణ పేర్లను ఖరారు చేశారు. ఆఖరిరోజు వారిద్దరు నామినేషన్‌ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వారికంటే ముందే టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత సర్దార్‌ రవీందర్‌సింగ్‌ నామినేషన్‌ వేయడం  కలకలం రేపింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరీంనగర్‌ స్థానం నుంచి పోటీ చేయడానికి రవీందర్‌సింగ్‌ ఆసక్తి చూపించగా అధినేత కేసీఆర్‌ రాజకీయభవిష్యత్‌ గురించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆ ఆలోచనను విరమించుకొని ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఎమ్మెల్యేల కోటాలో తనకు అవకాశం దక్కకున్నా స్థానిక సంస్థల కోటాలో అవకాశం కల్పిస్తారని రవీందర్‌సింగ్‌ పార్టీలో అందరికి చెబుతూ వచ్చారు. జిల్లాలోని రెండు స్థానాల్లో రెండేసి సార్లు ప్రాతినిధ్యం వహించిన వారు ఉండడంతో ఈసారి తనకు తప్పక అవకాశం దక్కుతుందని పార్టీ అధినేత కేసీఆర్‌ స్వయంగా రెండుమార్లు హామీ ఇచ్చిన నేపథ్యంలో రవీందర్‌సింగ్‌ తాను ఎమ్మెల్సీ కావడం ఖాయమని భావించారు. ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేయక పోగా కనీసం ఫోన్‌ కూడా చేసి మాట్లాడక పోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తున్నది. 

జిల్లాలో ప్రాధాన్యం లభించడం లేదని..

జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్‌ వద్ద తనకు ఏమాత్రం ప్రాధాన్యం లభించడం లేదని, తన ఉనికినే గుర్తించడం లేదనే అభిప్రాయంతో ఆయన చాలా కాలంగా మనస్థాపం చెందుతున్నారని పార్టీవర్గాలు అంటున్నాయి. ఇటీవల హుజురాబాద్‌ ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో కరీంనగర్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు కీలక పాత్ర వహిస్తూ వచ్చినా తనను మాత్రం పక్కనబెట్టారని రవీందర్‌సింగ్‌ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. వీటన్నిటి నేపథ్యంలో ఆయన పార్టీ అవకాశం కల్పించినా, కల్పించక పోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. 

ముందుగానే ఏర్పాట్లు

ఆయన ముందుగానే టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడి వారిని తన పేరు ప్రతిపాదించే వారిగా ఒప్పించుకున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమం జరిగిన కాలంలో ఉద్యమంలో పాల్గొన్న తన సహచరులుగా వారు తన పేరును ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించారని రవీందర్‌సింగ్‌ చెబుతున్నా తనకు అవకాశం కల్పించక పోవచ్చని భావించే ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. నిజమాబాద్‌లో చివరి క్షణంలో కల్వకుంట్ల కవిత పేరు ప్రతిపాదనకు వచ్చి నామినేషన్‌ వేసిన విధంగానే కరీంనగర్‌లో కూడా ఆఖరి క్షణంలో ఏదైనా జరగవచ్చని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఆఖరిక్షణంలో ఏ మార్పులు జరగకపోతే తాను పోటీలో ఉండడం ఖాయమని ఆయన అంటున్నారు. 

మంత్రి హరీష్‌రావు ఫోన్‌

రవీందర్‌సింగ్‌ ఎమ్మెల్సీ పదవికి నామినేషన్‌ వేయబోతున్నారన్న విషయం టీఆర్‌ఎస్‌ వర్గాలకు తెలియడంతో స్థానిక నేతలు ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకవెళ్లగా ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగి రవీందర్‌సింగ్‌కు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. అధినేత నిర్ణయానికి భిన్నంగా నామినేషన్‌ వేయవద్దని, ఆయన దృష్టిలో ఉన్నందున సముచిత స్థానం లభిస్తుందని నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు తనపై జరుగుతున్న వివక్షను వివరించి ఆయన నామినేషన్‌ వేశారు. ఈ వ్యవహారంలో పార్టీ అధినేత కేసీఆర్‌ రవీందర్‌సింగ్‌తో నామినేషన్‌ను ఉపసంహరింపజేస్తారనే ధీమా పార్టీవర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఈనెల 26 వరకు ఉపసంహరణకు గడువు ఉండడంతో అప్పటి వరకు అధిష్ఠానం ఏదో ఒక చర్య చేపడుతుందని అనుకుంటున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తికాగానే ముందు జాగ్రత్త చర్యగా టీఆర్‌ఎస్‌ తన స్థానిక సంస్థల ప్రతినిధులందరిని శామీర్‌పేట సమీపంలోని లియోమెరిడియన్‌ రిసార్ట్‌కు తరలించింది. నియోజకవర్గాల వారీగా శాసనసభ్యులు బాధ్యతలు తీసుకొని తమ పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అక్కడికి తరలించారు. మంత్రి గంగుల కమలాకర్‌ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి క్యాంపులో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమై మాట్లాడనున్నట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాకు చెందిన మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్థానిక సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధానంగా ఎంపీటీసీలు, తమకు విధులు, నిధులు ఏమి లేవని, తమకు రాజకీయాల్లో ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారామని అసంతృప్తితో ఉన్నారు. ఈ సందర్భంగానైనా ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకొని ఎంపీటీసీల ప్రాధాన్యాన్ని పెంచుతుందని వారు భావిస్తున్నారు. లేనిపక్షంలో వారిలో కొందరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశముందని చర్చించుకుంటున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని , తాను పోటీచేస్తే ఉద్యమకారులు, అవకాశం దక్కని టీఆర్‌ఎస్‌ నేతలు, కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తనకు ఓటు వేస్తారనే ధీమాతో రవీందర్‌సింగ్‌ ఉన్నట్లు చెబుతున్నారు. పోటీలో అభ్యర్థులను ఉంచడం లేదని కాంగ్రెస్‌, బీజేపీ ప్రకటించినా జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తూ అవసరమైతే పోటీలో ఉన్న వారికి సహకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

Updated Date - 2021-11-24T06:00:32+05:30 IST