కూరగాయ రైతుకు కష్టాలు

ABN , First Publish Date - 2020-03-29T10:17:13+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం కూరగాయలు సాగుచేసే రైతుపై తీవ్రంగా పడుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల రాకపోకలను నిషేధించడంతో పండించిన కూరగాయలను మార్కెట్లకు తరలించలేని పరిస్థితి ఎదురవుతోంది.

కూరగాయ రైతుకు కష్టాలు

కోతకు లభించని కూలీలు

గ్రామాలకు రాని వ్యాపారులు

నిలిచిపోయిన బస్సులు

పట్టణాలకు చేర్చేందుకు పాట్లు

తిరుగు ప్రయాణంలో

ఖాళీ వాహనాలను

పోలీసులు అడ్డుకుంటుండడంతో

తీవ్ర ఇబ్బందులు

మరోవైపు గ్రామాల్లో ఆంక్షలు

రైతుబజార్లకు వెళ్లొద్దని ఆదేశాలు

ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన 

 

కె.కోటపాడు, మార్చి 28:కరోనా వైరస్‌ ప్రభావం కూరగాయలు సాగుచేసే రైతుపై తీవ్రంగా పడుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల రాకపోకలను నిషేధించడంతో పండించిన కూరగాయలను మార్కెట్లకు తరలించలేని పరిస్థితి ఎదురవుతోంది. స్థానికంగా  తంటాలుపడి వాహనాలను సమకూర్చుకుని కూరగాయలను మార్కెట్‌కు చేరిస్తే దించడానికి హమాలీలు లేకపోవడం, ఏదోవిధంగా అమ్ముకుని ఇంటిదారి పడుతుంటే...ఖాళీ వాహనాన్ని పలుచోట్ల పోలీసులు నిలిపివేస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. కూరగాయలకు డిమాండ్‌ పెరిగి మంచి ధర లభించే ప్రస్తుత సమయంలో అధికారుల తీరుతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 


గ్రామాల్లో ఆంక్షలు

మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి పలు గ్రామాల్లో స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. రహదారులకు అడ్డంగా ముళ్లకంచెలు, కర్రలు పాతుతున్నారు. ఈ పరిస్థితిలో ఆయా గ్రామాలకు ఆటోలు, సరుకు రవాణా వాహనాలు రావడం లేదు. రోజూ పట్టణ ప్రాంతాలకు కూరగాయలు తీసుకువెళ్లి అమ్ముకుంటున్న రైతులను సామాజికంగా బహిష్కరిస్తామని ఆయా గ్రామాల వారు హెచ్చరిస్తున్నారు. కూరగాయలను విశాఖ, అనకాపల్లి, పెందుర్తి ప్రాంతాలకు వెళ్లి అమ్ముకుంటుండడంతో కొనుగోలుకు చాలామంది వస్తుంటారని వారిలో ఎవరికైనా కరోనా వైరస్‌ లక్షణాలుంటే...రైతులకూ సంక్రమిస్తుందని, తద్వారా గ్రామంలో మిగిలిన వారందరికీ సోకుతుందని భయపడుతున్నారు.


ఈ నేపథ్యంలో కూరగాయల అమ్మకాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లవద్దని, స్థానికంగా వ్యాపారులు వస్తే అమ్ముకోవాలని కొన్ని గ్రామాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. పక్వానికి వచ్చిన కూరగాయలను ఒకటి, రెండు రోజుల్లో కోయకపోతే ముదిరిపోవడం/మగ్గిపోవడం/కుళ్లిపోవడం జరుగుతోందని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.


రైతుబజార్‌ బస్సులు బంద్‌

విశాఖ నగరంలోని పలు రైతుబజార్లలో రైతులకు స్టాల్స్‌ ఉన్నాయి. రోజూ ఆర్టీసీ బస్సుల ద్వారా కూరగాయలను తీసుకువెళ్లి, విక్రయించిన అనంతరం తిరిగి బస్సుల్లోనే ఇళ్లకు వస్తుంటారు. కానీ గత ఆదివారం నుంచి బస్సులను నడపడం లేదు. దీంతో సగం మందికి పైగా రైతులు కూరగాయలను విశాఖ తీసుకువెళ్లలేకపోతున్నారు.


వీరు చుట్టుపక్కల గ్రామాలకు, సంతపాలెం తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. అంతేకాకుండా కూరగాయలు కోయడానికి కూలీలు కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులే ఆ పనులు చేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు రవాణా వాహనాలు లేక వ్యాపారులు కూడా సంతపాలెం, కె.కోటపాడు రావడం లేదు. దీంతో ధరలు తగ్గిపోయాయి. జిల్లా అధికారులు స్పందించి,  కూరగాయలను విశాఖ, పెందుర్తి, అనకాపల్లి ప్రాంతాల్లో అమ్ముకునేలా వాహనాలకు అనుమతులివ్వాలని, రైతుబజార్లకు బస్సులు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


అమ్ముకోలేకపోతున్నాం... బండారు రాజపాత్రుడు, కూరగాయ రైతు, ఆర్లి

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా కూరగాయలను విశాఖ తీసుకువెళ్లి అమ్ముకోవడానికి వీలు కావడంలేదు. ఆటోలు, గూడ్స్‌ వ్యాన్లలో తరలిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు సొంత ఊళ్లో అభ్యంతరం చెబుతున్నారు. విశాఖ వెళితే కరోనా సోకే ప్రమాదం వుందని, వెళ్లవద్దని భయపెడుతున్నారు. అధికారులు దృష్టిసారించి వ్యాపారులను రైతుల వద్దకే పంపించి కూరగాయలు కొనుగోలు చేసేలా చూడాలి.

Updated Date - 2020-03-29T10:17:13+05:30 IST