జీసీసీకి ‘ట్రైఫెడ్‌’ అవార్డులు

ABN , First Publish Date - 2021-08-06T05:36:00+05:30 IST

గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ‘ట్రైఫెడ్‌’ ఐదు జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించింది.

జీసీసీకి ‘ట్రైఫెడ్‌’ అవార్డులు
ప్రధాన మంత్రి వన్‌ధన్‌ వికాస కేంద్రంలో విస్తర్ల తయారీలో శిక్షణ పొందుతున్న గిరిజన మహిళలు (ఫైల్‌ ఫొటో)

జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాలకు ఎంపిక

నేడు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకోనున్న అధికారులు


పాడేరు, ఆగస్టు 5: గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ‘ట్రైఫెడ్‌’ ఐదు జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించింది. గిరిజనుల అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించడం, అటవీ ఉత్పత్తుల కొనుగోలు, వన్‌ధన్‌ వికాస కేంద్రాల నిర్వహణలో చక్కటి పనితీరు కనబరిచినందుకు ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ట్రైఫెడ్‌ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి చేతుల మీదుగా వీటిని ప్రదానం చేయనున్నారు. 


కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో వుండే ట్రైబల్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ట్రైఫెడ్‌)...అటవీ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, మద్దతు ధర కల్పించడం, అటవీ ఉత్పత్తుల విలువను పెంచడం వంటి కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్న సంస్థలకు ప్రతి ఏటా ఆగస్టులో అవార్డులు ప్రకటిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు సేవలు అందిస్తున్న జీసీసీని ఈ ఏడాది ఐదు అవార్డులకు ఎంపిక చేసింది. ప్రధాన మంత్రి వన్‌ధన్‌ వికాస కేంద్రాల ద్వారా అటవీ ఫలసాయాలకు కనీస మద్దతు ధర కల్పించినందుకు; సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తుల రిటైట్‌ మార్కెటింగ్‌లో జీసీసీ మొదటి స్థానాల్లో నిలిచింది. కేంద్రం ఇచ్చిన రూ.4.5 కోట్లతో అటవీ ఫలసాయాలు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసినందుకు రెండో స్థానం; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 9.76 కోట్లతో అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసినందుకు, 2020-21 వార్షిక బడ్జెట్‌గా రూ.12.86 కోట్లు వ్యయం చేసిన విషయంలో మూడో స్థానంలో నిలిచింది. ట్రైఫెడ్‌ 34వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండా చేతుల మీదుగా జీసీసీ అధికారులు అవార్డులు అందుకోనున్నారు. జీసీసీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించడంతో జీసీసీ అధికారులు, ఉద్యోగులకు సంస్థ చైర్మన్‌శోభా స్వాతిరాణి, ఎండీ పీఏ శోభ అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-08-06T05:36:00+05:30 IST