లోలెవల్‌ కాజ్‌వేలతో ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-10-28T05:21:05+05:30 IST

మండలంలో లోలెవల్‌ కాజ్‌వేలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. దశాబ్దాలుగా పరిస్థితి ఇలాగే ఉండడంతో ఈ సమస్య పరిష్కారం కాదా అని ఆవేదన చెందుతున్నారు. రోడ్డుకు నాలుగు నుంచి ఐదు అడుగుల మేర తగ్గుగా ఉండడంతో వర్షాకాలం వంకలు పొంగితే రాకపోకలు ఆగాల్సిందే.

లోలెవల్‌ కాజ్‌వేలతో ఇక్కట్లు
రాచిన్నాయపల్లె సమీపంలో ఉన్న లోలెవల్‌ కాజ్‌వే

వంక వస్తే రాకపోకలు బంద్‌

దశాబ్దాలు దాటుతున్నా ఇంతేనా..! 

చెన్నూరు, అక్టోబరు 27: మండలంలో లోలెవల్‌ కాజ్‌వేలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. దశాబ్దాలుగా పరిస్థితి ఇలాగే ఉండడంతో ఈ  సమస్య పరిష్కారం కాదా అని ఆవేదన చెందుతున్నారు. రోడ్డుకు నాలుగు నుంచి ఐదు అడుగుల మేర తగ్గుగా ఉండడంతో వర్షాకాలం వంకలు పొంగితే రాకపోకలు ఆగాల్సిందే. పైగా ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వంక పొంగిన సమయంలో వెళ్లాలంటే 5 నుంచి 10 కి.మీ. మేర చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ కాజ్‌వేల విషయంపై గతంలో ప్రజలు జిల్లా ఉన్నతాధికారులకు, ఆర్‌అండ్‌బీ అఽధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. గ్రామాల నుంచి మండల కేంద్రానికి, కడప నగరానికి వెళ్లాలన్నా వర్షాకాలంలో కాజ్‌వేలతో ఇబ్బంది తప్పడం లేదు. వంకల ఉధృతి ఉండేది మూడు, నాలుగు రోజులైనా ప్రజలు ఆ సమయంలో రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. 


ఇబ్బంది పెట్టే వంకలు ఇవే...

మండలంలో వర్షాకాలం ఇబ్బంది పెట్టే వంకలు మూడు ఉన్నాయి. రాచిన్నాయపల్లె నుంచి కడప నగరానికి వెళ్లే బైపా్‌సరోడ్డు వద్ద ఉన్న రాళ్లవంక, అలాగే రామనపల్లె, ముండ్లపల్లె వద్ద ప్రవహించే ఉప్పువంక, శివాలపల్లె వద్ద ప్రవహించే జింకల వంక వల్ల ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోతుంటాయి. ఈ వంకలు పలు చోట్ల పూర్తిగా లోలెవల్‌ కాజ్‌వేలుగా ఉండడంతో పాటు పలు చోట్ల ఆక్రమణలకు గురికావడం, పూడిక తీయకపోవడం, వెడల్పు లేకపోవడం, చెట్ల పొదలు పెరగడంతో చిన్నపాటి వర్షం కురిసినా వంకలు పొంగి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. 


వర్షాకాలం వస్తే ఇబ్బందే 

నగరంతో పాటు మండల కేంద్రానికి రోజూ ఏదో ఒక పని మీద ప్రజలు, రైతులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లాల్సి ఉన్నా, వ్యవసాయ పనిమీద వెళ్లాల్సి ఉన్నా వంకలు పొంగి కాజ్‌వే పై నీరు ప్రవహిస్తే వెళ్లే అవకాశమే ఉండదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే చుట్టూ తిరిగి పోవాల్సిందే. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఇలాగే ఉంది. హైలెవల్‌కు మాత్రం మోక్షం కలగడం లేదు. 

- సుబ్రమణ్యం, రామనపల్లె


గతంలో ఎన్నోసార్లు చెప్పినా ఫలితం లేదు

లోలెవల్‌ కాజ్‌వేలు హైలెవల్‌ చేయాలని గతంలో ఎంతోమంది పెద్దలు ఆర్‌అండ్‌బీ అధికారులను కోరారు. అయినా ఫలితం లేదు. మండలానికి, గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులతో పనులు చేపట్టాలన్నా నిబంధనలు అడ్డు వస్తున్నాయి. ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఉన్న రాచిన్నాయపల్లె, ముండ్లపల్లె లోలెవల్‌ కాజ్‌వేలను వీలైనంత త్వరగా హై లెవల్‌గా మారిస్తే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. లేకపోతే ఏటా వర్షా కాలం ఇబ్బంది పడాల్సిందే. 

- నారాయణరెడ్డి, సర్పంచ్‌, రాచిన్నాయపల్లె

Updated Date - 2021-10-28T05:21:05+05:30 IST