ఇన్‌చార్జి అధికారులతో ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-04-30T06:49:09+05:30 IST

నగర పాలక సంస్థలోని పలు శాఖల్లో ఇన్‌చార్జి అధికారులతోనే పాలన కొనసాగిస్తున్నారు. దీంతో నగర ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. 60 డివిజన్‌లు, 7 విభాగాలు, 1700 మంది ఉద్యోగులతో కూడిన నిజామాబాద్‌ నగరపాలక సంస్థ పూర్తిస్థాయి అధికారులు లేక పాలన గాడి తప్పుతోంది.

ఇన్‌చార్జి అధికారులతో ఇక్కట్లు

గాడితప్పుతున్న నగరపాలక సంస్థ పాలన

ముఖ్య విభాగాలకు ఇన్‌చార్జి అధికారులే దిక్కు

ఎంహెచ్‌వో లేక పారిశుధ్య వ్యవస్థ అస్తవ్యస్తం

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 29: నగర పాలక సంస్థలోని పలు శాఖల్లో ఇన్‌చార్జి అధికారులతోనే పాలన కొనసాగిస్తున్నారు. దీంతో నగర ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. 60 డివిజన్‌లు, 7 విభాగాలు, 1700 మంది ఉద్యోగులతో కూడిన నిజామాబాద్‌ నగరపాలక సంస్థ పూర్తిస్థాయి అధికారులు లేక పాలన గాడి తప్పుతోంది. కమిషనర్‌తో పాటు ముఖ్య విభాగాలకు పనిచేస్తున్న అధికారులంతా ఇన్‌చార్జిలే కావడంతో కిందిస్థాయి సిబ్బందిపై అధికారుల పర్యవేక్షణ లోపిస్తుంది. ముఖ్యంగా శానిటేషన్‌ వ్యవస్థలో అనేక లోపాలు ఉంటున్నాయి. నగరం పరిశుభ్రత ఉండడంతో పాటు పారిశుధ్య వ్యవస్థ బాగుండాలంటే పూర్తిస్థాయి ఎంహెచ్‌వో ఉండా ల్సిందే. కానీ ఎనిమిది నెలలుగా ఎంహెచ్‌వో పోస్టు ఖాళీగా ఉండగా డిప్యూటీ కమిషనర్‌ అదనపు బాధ్య తలు చూస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం డిప్యూటీ సిటీ ప్లానర్‌సైతం ఇన్‌చార్జి అధికారే కొనసాగుతున్నారు. అడిషనల్‌ కమిషనర్‌ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగానే ఉంటుంది. నగరపాలక సంస్థగా మారిన నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధి సైతం గతంలో కంటే ప్రస్తుతం పెరిగి 60 డివిజన్‌లుగా మార్పు చెందగా నిత్యం పర్యవేక్షణ చేసే అధికారులు లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారుతోంది. అధికారులు, సిబ్బంది కనీసం సమయపాలన కూడా పాటించకపోవడంతో ప్రజల సమస్యలు పరిష్కారం కావడంలేదు. నిత్యం వందలాది మంది నగర కార్పొరేషన్‌ కార్యాలయానికి వచ్చి పనులుకాక వెనుదిగుతున్న ఘటనలు అనేక జరుగుతున్నాయి. ఏళ్లుగా కార్పొరేషన్‌లో తిష్టవేసిన అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధుల అండతో తమను ఎవరూ ఏం చేయలేరనే ఉద్దేశంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2005లో మున్సిపాలిటీగా ఉన్న నిజామాబాద్‌ను కార్పొరేషన్‌గా మార్చి 17 ఏళ్లు గడుస్తున్నా నగరంలో కొత్తగా వచ్చిన మార్పులు ఏమీ కనిపించడంలేదు. కార్పొరేషన్‌ కార్యాలయంలో కూడా అదే సిబ్బంది, అదే అధికారులు తప్ప మార్పు కనిపించడంలేదు. 

ఐదు నెలలుగా ఇన్‌చార్జ్‌ కమిషనర్‌..

నగరపాలక సంస్థగా ఏర్పడిన నిజామాబాద్‌ కార్పొరేషన్‌కు 2020లో పూర్తిస్థాయి ఐఏఎస్‌ అధికారి జితేష్‌ వి.పాటిల్‌ కమిషనర్‌గా వచ్చారు. అంతకముందు పనిచేసిన కమిషనర్‌లు అంతా నాన్‌ క్యాడర్‌ అధికారులే. 2021 డిసెంబరులో కమిషనర్‌ జితేష్‌ పాటిల్‌ను కామారెడ్డి కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించగా అప్పటి నుంచి నగరపాలక సంస్థ కమిషనర్‌గా అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. అటు స్థానిక సంస్థల బాధ్యతలు, ఇటు కార్పొరేషన్‌ బాధ్యతలను ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తున్నా పూర్తిస్థాయి పర్యవేక్షణ లేక కిందిస్థాయి సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.

ఎనిమిది నెలలుగా ఎంహెచ్‌వో లేరు..

నగరపాలక సంస్థలో పారిశుధ్య వ్యవస్థను పర్యవేక్షించే మున్సినల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ పోస్టు ఎనిమిది నెలలకు పైగా ఖాళీగా ఉంది. ఇది వరకు పనిచేసిన శ్రీనివాస్‌ బాధ్యతల నుంచి తప్పుకోగా డిప్యూటీ కమిషనర్‌ హరిబాబు ప్రస్తుత ఇన్‌చార్జ్‌ ఎంహెచ్‌వోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుమారు 1500 మంది ఉద్యోగులు పారిశుధ్య విభాగంలో నిత్యం పనిచేస్తుండగా పూర్తిస్థాయి అధికారి ఉంటేనే వారి పర్యవేక్షణ సాగుతోంది. ఇన్‌చార్జి అధికారుల పర్యవేక్షణ కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రస్తుతం నగరపాలక సంస్థ శానిటేషన్‌ విభాగంలో శాశ్వత సానిటరి ఇన్స్‌పెక్టర్‌లు కొనసాగడం విమర్శలకు తావిస్తుంది. పూర్తిస్థాయి ఎంహెచ్‌వో లేక నగరంలో పారిశుధ్య వ్యవస్థతో పాటు శానిటేషన్‌ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారుతోంది.

ఇంజనీరింగ్‌ విభాగం ఆగమాగం..

నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు పర్యవేక్షించే ఇంజనీరింగ్‌ విభాగం ఆగమాగంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇంజనీరింగ్‌ విభాగం సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజనీర్‌, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌లు నిత్యం హైదరాబాద్‌ నుంచి వచ్చి విధులు నిర్వహిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. నగర అభివృద్ధి పనులు పర్యవేక్షించే ముఖ్య అధికారులే స్థానికంగా ఉండకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది పనుల పర్యవేక్షణ చేయకపోగా కార్యాలయానికి హాజరుకావడంలేదని సమాచారం ఉంది. అభివృద్ధి పనులకు సంబంధించిన పర్యవేక్షణ లేక బిల్లులు మంజూరుకాక ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.

పట్టణ ప్రణాళిక విభాగానికి ఇన్‌చార్జి అధికారే..

నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం డిప్యూటీ సిటీ ప్లానర్‌ గత నెల వరకు పూర్తిస్థాయి అధికారి ఉండగా ఆయన బదిలిపై వెళ్లారు. ప్రస్తుతం ఇన్‌చార్జి అధికారే పర్యవేక్షణ చేస్తుండగా ఇష్టారీతిన ఇంటి, వ్యాపార సముదాయాల అనుమతులు ఇసు ్తన్నారనే ఆరోపణలు ఉన్నాయి. నగర ప్రజల అవసరాలను తీర్చే నగరపాలక సంస్థ ఇన్‌చార్జి అధికారులతో పాలన గాడితప్పుతోందని పూర్తిస్థాయి అధికారులను నియమించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-04-30T06:49:09+05:30 IST