అరకులోయ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించిన గిరిజనులు, సీపీఎం నాయకులు
అరకులో సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయింపు
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపాటు
అరకులోయ, జూన్ 29: సమస్యలపై పలు గ్రామాల గిరిజనులు కదంతొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై నిరసన గళం వినిపించారు. సీపీఎం ఆధ్వర్యంలో పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి అరకులోయ పట్టణం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బైఠాయించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు ఉమామహేశ్వరరావు, బాలదేవ్, రామారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గిరిజనుల సమస్యలను పరిష్కరిం చడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నదని మండి పడ్డారు. దీనికితోడు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచేయడంతో గిరిజనుల జీవనం దినదిన గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గిరిజన గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రహదారులు, వంతెనలు, పాఠశాల, అంగన్ వాడీ భవనాలను అరకొరగా నిర్మించి వదిలేశారన్నారు. అరకులోయ టౌన్‌షిప్ పేరుతో శర్భగుడ, కంఠబౌంసుగుడ, తాంగులగుడ గ్రామ గిరిజనుల భూములు తీసుకున్న ప్రభుత్వం, నేటివరకు ఆయా గ్రామాల రైతులకు ఇళ్ల పట్టాలను సైతం ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. వారికి వెంటనే పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వా లని డిమాండ్ చేశారు. అలాగే గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కరించాలని, చెక్‌డ్యామ్‌ల మరమ్మతు చేపట్టా లని నినదించారు. అనంతరం పంచాయతీల వారీగా సమస్యలపై వివరాలను అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు బుజ్జిబాబు, గెమ్మెలి చిన్నబాబు, భగత్‌రాం, కూర్మన్న, నాని, దశరథ్, బాబూరావు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.