పునాది దాటని గిరిజన భవనం

ABN , First Publish Date - 2022-08-10T05:24:31+05:30 IST

గిరిజన ప్రాంతమైన ఇల్లందు నియోజకవర్గంలో ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం మూలంగా గిరిజన సంక్షేమ పథకాలు అందని దాక్షగా మారుతున్నారు.

పునాది దాటని గిరిజన భవనం
పునాదులు తీసి వదిలేసిన గుంతలు

 ఏడాది దాటినా అతీగతీలేని డిజైన్‌ మార్పిడి

 కాసులు ముట్టనిదే డిజైన్‌ మార్పు జరగదట!

 పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

ఇల్లెందు, ఆగస్టు 9: గిరిజన ప్రాంతమైన ఇల్లందు నియోజకవర్గంలో ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం మూలంగా గిరిజన సంక్షేమ పథకాలు అందని దాక్షగా మారుతున్నారు. సాక్షాత్తు నియోజక వర్గకేంద్రమైన, ఇల్లెందు పట్టణంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ భవన నిర్మాణం అధికారుల నిర్ల్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. 

పట్టణంలోని మిషన్‌స్కూల్‌ సమీపంలో రూ.కోటి వ్యయంతో గిరిజన భవనం మంజూరు చేశారు. ఈ మేరకు టెండర్‌ ప్రక్రియ కూడా పూర్తికావడం, కాంట్రాక్టర్‌ గిరిజన భవన్‌ నిర్మాణం కోసం ఇసుక, కంకర, స్టీల్‌ కొనుగోలు చేసి, పునాదులు సైతం తవ్వించారు. అయితే గిరిజన భవన్‌ పై కప్పును తొలుత రేకుల షెడ్‌తో ఏర్పాటు చేసేందుకు డీపీఆర్‌ను రూపొందించి నిధులు కేటాయించారు. కాగా పనులు ప్రారంభ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులు భవనానికి పై కప్పు రేకులు వేయడం సరైనది కాదని, ప్రతిష్టాత్మక భవనానికి పై కప్పు స్లాబు వేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు డిజైన్‌ మార్చాలని పేర్కోన్నారు. 80 ఫీట్ల పోడవు, 40 ఫీట్ల వెడల్పుతో ఉత్సవాలకు, వేడుకలకు ప్రయోజనకరంగా ఉండవలసీన గిరిజన భవన్‌ డిజైన్‌ మార్చాలని ఎమ్మెల్యే  హరిప్రియ, అధికారులను ఆదేశించారు. అయితే ఏడాది కావోస్తున్నా గిరిజన భవన్‌ పై కప్పు డిజైన్‌ మార్పిడికి సంబందించిన పూర్తి చేయకపోవడం గమనార్హం. ఏడాది కాలంగా పని ప్రదేశంలోని కాంట్రాక్టర్‌ సమకూర్చుకున్న మేటిరియల్‌ ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. ఇనుప చువ్వలు తుప్పుపడుతుండగా, ఇసుక వర్షాలకు కొట్టుకపోతుంది. కంకరకు ఆలనాపాలనా పట్టించుకునే నాధులు లేకపోవడంతో ఎత్తుకెలుతున్నారు. ఎవరు పట్టించుకోకపోవడంతో భవన నిర్మాణానికి తవ్విన పిల్లర్ల గుంటలు ప్రమాదంగా మారి, వర్షాపు నీటితో నిండి ప్రాణంతకంగా ఉంది. ఇదేవిషయమై టెండర్‌ పొందిన కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా తాము ఏడాది క్రితమే నిర్మాణానికి రూ. 1.50 లక్షల విలువైన ఇసుకను, రూ. 2 లక్షల సిమెంట్‌, రూ. 25 లక్షల విలువైన స్టీల్‌, ఒక లక్షతో కంకర కొనుగోలు చేశామని, పిల్లర్ల నిర్మాణానికి , పునాదుల గుంతలు తవ్వడం జరిగిందని వెల్లడించారు. డిజైన్‌ మార్పిడి కోసం 11 నెలలుగా ఎదురు చూస్తున్నామని వివరించారు. డిజైన్‌ మార్పు జాప్యం వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు.


ఇన్‌చార్జ్‌ అధికారుల నిర్లక్ష్యం- పనుల్లో జాప్యం


కేవలం ఒకరోజు వ్యవధిలో ఇంజనీరింగ్‌ అధికారులు డిజైన్‌ మార్పు చేసి సాంకేతిక అనుమతి పొందడానికి అవకాశం ఉన్నపట్టికి ఇంజనీరింగ్‌ అధికారులు నిర్లక్ష్యంగా గిరిజన భవన్‌ పనులకు గ్రహపాటుగా మారిందనడం అతిశయోక్తికాదు. అయితే మున్సిపాలిటీకి పూర్తికాలం డీఈ లేకపోవడంతో పంచాయతీరాజ్‌ డీఈకి ఇన్‌చార్జ్‌గా నియమించడంతో పర్యవేక్షణ సరిగా లేక పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిసింది. మునిసిపాలిటీలో ఇరువురు ఏఈలుగా సైతం ఉద్యోగ విరమణ చేసిన రిటైర్డ్‌ ఉద్యోగులను నియమించడం గమనార్హం. పూర్తి బాధ్యతలు నిర్వర్తించే ఇంజనీరింగ్‌ అధికారులు లేక పోవడం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు గ్రహపాటుగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం పై కప్పు డిజైన్‌ మార్పిడి చేయకుండా ఏడాది కాలంగా ఇంజనీరింగ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే వీరిపని తీరును అర్ధం చేసుకోవచ్చు. అయితే గిరిజన భవన్‌ నిర్మాణ పనుల జాప్యంపై మున్సిపాలిటిలో ఇన్‌చార్జి డీఈగా వ్యవహరిస్తున్న రామకృష్ణను ప్రశ్నించగా డిజైన్‌ మార్పిడి కోసం ఆర్కిటేక్‌ రూ. 2 లక్షలు డిమాండ్‌ చేశారని, కాంట్రాక్టర్‌ రూ. లక్ష మాత్రమే ఇవ్వడం వలన డిజైన్‌ మార్పు పని జరగలేదని చేప్పడం గమనార్హం


Updated Date - 2022-08-10T05:24:31+05:30 IST