చెట్ల కిందే వైద్యం

ABN , First Publish Date - 2022-08-07T06:27:08+05:30 IST

మండలంలోని వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతోంది. పురాతన భవనం కావడంతో శిథిలమై శ్లాబు పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. పీహెచసీ భవన నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరైనా కాంట్రాక్టరు వెనక్కి తగ్గడంతో నిర్మాణం ప్రారంభం కాలేదు.

చెట్ల కిందే వైద్యం
ప్రమాదాల్లో గాయపడ్డ వారికి డ్రెసింగ్‌ చేసేది ఇక్కడే...

  • శిథిలమై కూలడానికి సిద్ధంగా వీరవల్లిపాలెం పీహెచసీ
  • 30 పడకల ఆసుపత్రి మంజూరైనా నిర్మాణానికి నోచుకోని వైనం

అయినవిల్లి, ఆగస్టు 6: మండలంలోని వీరవల్లిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతోంది. పురాతన భవనం కావడంతో శిథిలమై శ్లాబు పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు కూలుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. పీహెచసీ భవన నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరైనా కాంట్రాక్టరు వెనక్కి తగ్గడంతో నిర్మాణం ప్రారంభం కాలేదు. రహదారులు, భవనాల శాఖ రీటెండర్‌ పిలవాల్సి ఉంది. ఈ పీహెచసీ పరిధిలో ఆరు సచివాలయాలు, తొమ్మిది  గ్రామాలు ఉన్నాయి. వీరవల్లిపాలెం, అద్దంకివారిలంక, కె.జగన్నాథపురం, పోతుకుర్రు, మాగాం, శానపల్లిలంక, కొండుకుదురు, పొట్టిలంక, కొండుకుదురులంక గ్రామాలకు చెందిన 25వేల జనాభాకు వీరవల్లిపాలెం పీహెచసీ వైద్య సేవలందిస్తోంది. వీరవల్లిపాలెం, కొండుకుదురులంక, పొట్టిలంక లంక గ్రామాలు కావడంతో వరదల సమయంలో సిబ్బంది రెండుచోట్లా పడవలపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎస్‌.మూలపొలంలో పీహెచసీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 30 పడకల ఆసుపత్రి మంజూరైనా నిర్మాణానికి నోచుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీహెచసీ భవనంలో తగిన గదులు లేకపోవడంతో చెట్ల కింద డ్రెసింగ్‌ చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఆపరేషన థియేటర్‌ కూడా లేదని, ప్రభుత్వం పీహెచసీ భవన నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. అయినవిల్లి పీహెచసీలో ‘నాడు-నేడు’ పథకంలో ప్రహారీ నిర్మించారు. వర్షపునీరు బయటకు పోయే మార్గం లేకపోవడంతో ఆరోగ్య కేంద్రం చుట్టూ నీరు నిల్వ ఉండి చెరువును తలపిస్తోంది. నీరు నిల్వ ఉండడంతో దోమలు పెరుగుతున్నాయని, పీహెచసీ లోపల మెరక చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2022-08-07T06:27:08+05:30 IST