బలవంతంగా బదిలీ?

ABN , First Publish Date - 2022-07-02T05:28:54+05:30 IST

నరసరావుపేట మున్సిపాల్టీలో రాజకీయ బదిలీలు జరిగాయి. ఐదేళ్ల గడువు పూర్తి కాకుండానే నలుగురు ప్రధాన అధికారులను సాగనంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బలవంతంగా బదిలీ?
నరసరావుపేట మున్సిపాల్టీ కార్యాలయం

ఐదేళ్లు పూర్తికాకుండానే సాగనంపారు

నరసరావుపేట మున్సిపాల్టీలో రాజకీయ బదిలీలు

మూడేళ్లలో నాల్గో కమిషనర్‌, మూడో ఇంజనీర్‌ బదిలీ

నిబంధనలను పట్టించుకోకుండా బదిలీ చేశారని విమర్శలు 

 

నరసరావుపేట, జూలై 1: నరసరావుపేట మున్సిపాల్టీలో రాజకీయ బదిలీలు జరిగాయి. ఐదేళ్ల గడువు పూర్తి కాకుండానే నలుగురు ప్రధాన అధికారులను సాగనంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలు జరిగిన తీరుపై అధికార పార్టీలోని కొందరు వ్యక్తులు కూడా విమర్శిస్తుండటం గమనార్హం. మున్సిపాల్టీ కమిషనర్‌, ఇంజనీర్‌, అకౌంటెంట్‌, రెవెన్యూ అధికారిని బదిలీ చేశారు. ఈ బదిలీల్లో ప్రభుత్వ నిబంధనలను కూడా తుంగలో తొక్కారన్న విమర్శలున్నాయి. కొంతకాలంగా అధికారుల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌ వల్లే బదిలీలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. మూడేళ్లలో నలుగురు కమిషనర్లు, ముగ్గురు మున్సిపల్‌ ఇంజనీర్లు ఇక్కడి నుంచి బదిలీ అయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. శేషన్న, శివారెడ్డి, వెంకటేశ్వర్లు, తాజాగా కే రామచంద్రారెడ్డి కమిషనర్లుగా ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. మున్సిపల్‌ ఇంజనీర్లు వెంకటేశ్వరరావు, రామమోహనరావు, మాల్యాద్రి ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. కీలక అధికారులు ఏడాదికి ఒకరు బదిలీ అవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి ఎటువంటి ఆరోపణలు, ఇతర బలమైన కారణాలు లేకపోయినా వీరు బదిలీ అయ్యారు. కమిషనర్‌ కే రామచంద్రారెడ్డి పేరు బదిలీ జాబితాలో లేదని తొలుత ప్రచారం జరగడంతో పట్టుపట్టి మరీ ఆయన్ను బదిలీ చేయించారు. ఇందుకు మున్సిపాల్టీలో బిల్లుల వ్యవహారమే కారణమని సమాచారం.  బిల్లుల్లో అవకతవకలతో వాటిని ఆయన అమోదించలేదు. అందువల్లే ఆయన్ను బదిలీ చేసి ఉండవచ్చని కార్యాలయ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రగతి పనులు జరుగుతున్నాయని కమిషనర్‌ వాటికి ఆమోదం తెలపక పోవడం కూడా బదిలీకి ఓ కారణమన్న ప్రచారం జరుగుతున్నది. అయితే ఆయనకు ఎక్కడా కూడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. సీడీఎంఏలో రిపోర్టు చేయమని రామచంద్రారెడ్డికి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మీద బదిలీల విషయంలో కార్యాలయంలో కొందరు చక్రం తిప్పి విజయం సాధించారని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.


మూడేళ్లలో ఐదో కమిషనర్‌గా రవీంద్ర

మూడేళ్లలో ఎస్‌ రవీంద్ర ఐదో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పని చేస్తున్న రవీంద్రను ఇక్కడికి బదిలీ చేశారు. మున్సిపల్‌ ఇంజనీరు మల్యాద్రిని ఒంగోలు కార్పొరేషన్‌కు బదిలీ చేశారు ఆయన స్థానంలో విజయవాడ కార్పొరేషన్‌ నుంచి కే కోటేశ్వరరావును నియమించారు. మూడేళ్లలో కోటేశ్వరరావు నాల్గో ఇంజనీరుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్వో మహేష్‌ను వినుకొండకు బదిలీ ఆ స్థానంలో వినుకొండలో ఆర్‌వోగా పనిచేస్తున్న జబ్బార్‌ను నియమించారు. అకౌంటెంట్‌ నిరాజక్ష ప్రసాద్‌ తెనాలి మున్సిపాల్టీకి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదని కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-07-02T05:28:54+05:30 IST