Abn logo
Nov 25 2020 @ 01:14AM

తేలని బదిలీల పంచాయితీ!

తాత్కాలిక ఖాళీల జాబితాలో 3781

జీఓ 54కు సవరణలు

స్కూల్‌  స్టేషన్‌సర్వీసు పాయింట్లపై 8 ఏళ్ల సీలింగ్‌ తొలగింపు

తాజాగా 59 జీఓ విడుదల

మారనున్న ఖాళీల జాబితా


అనంతపురం విద్య, నవంబరు 24: ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీల పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. తాత్కాలిక ఖాళీల జాబితాలో 3781 చూపి బ్లాగ్‌లో పెట్టారు. బదిలీల జీఓ 54కు విద్యాశాఖ సవరణలు చేయటంతో మళ్లీ ఖాళీల జాబితా తయారీ మొదటికొచ్చింది. తాత్కాలిక జాబితాలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలకు జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై 10 రోజులకుపైగా జిల్లా విద్యాశాఖాధికారులు జిల్లా సైన్స్‌ సెంటర్‌లో కుస్తీ పడుతున్నారు. ఈనెల 23న తాత్కాలిక ఖాళీల జాబితా తయారు చేశారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 1,279, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2502 ఖాళీలు చూ పారు. మొత్తం 3781 ఖాళీలుగా తేల్చి, డీఈఓ బ్లాగులో పెట్టారు. స్టేషన్‌సర్వీసు పాయింట్లపై కొన్నిరోజులు సందిగ్ధత నేపథ్యంలో ఇటీవల పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గతనెల 12న విడుదల చేసిన బదిలీల జీఓ 54కు కొన్ని సవరణలు చేస్తూ మంగళవారం జీఓ 59 విడుదల చేశారు. స్కూల్‌ స్టేషన్‌ సర్వీసు పాయింట్లపై ఉన్న 8 ఏళ్ల సీలింగ్‌ తొలగించారు. ప్రధానోపాధ్యాయుల విషయంలో ఐదు విద్యా సంవత్సరాలు పూర్తి కావాలన్న నిబంధనను తొలగించి, ఐదేళ్లు పూర్తి చేసుకున్నవారు తప్పనిసరిగా బదిలీ చేసేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీఓ 54కు సవరణల నేపథ్యంలో బదిలీ ఖాళీల జాబితాలో మా ర్పులు, చేర్పులు చేయాల్సి ఉంది. ప్రధానోపాధ్యాయుల ఖాళీల్లో మార్పులుంటాయి. దీంతో తుది ఖాళీల జాబితా తేలాలంటే మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది.


Advertisement
Advertisement
Advertisement