దొంగలకు ట్రైనింగ్‌... టీచర్‌ అరెస్ట్‌.. పట్టున్న ప్రాంతాల్లోనే చోరీలు

ABN , First Publish Date - 2020-08-15T16:47:10+05:30 IST

అతనో టీచర్‌. చోరీ సొత్తును తాకట్టు పెట్టించి కమీషన్‌ పొందేవాడు. తర్వాత తానే దొంగగా మారాడు. జైలుకెళ్లిన ప్రతీసారీ అక్కడున్న వారిలో చురుకైనా గుర్తించి ఓ ముఠాగా తయారుచేసేవాడు. వారికి దొంగతనాలపై శిక్షణ ఇచ్చేవాడు.

దొంగలకు ట్రైనింగ్‌... టీచర్‌ అరెస్ట్‌.. పట్టున్న ప్రాంతాల్లోనే చోరీలు

రాయదుర్గం, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): అతనో టీచర్‌. చోరీ సొత్తును తాకట్టు పెట్టించి కమీషన్‌ పొందేవాడు. తర్వాత తానే దొంగగా మారాడు. జైలుకెళ్లిన ప్రతీసారీ అక్కడున్న వారిలో చురుకైనా గుర్తించి  ఓ ముఠాగా తయారుచేసేవాడు. వారికి దొంగతనాలపై శిక్షణ ఇచ్చేవాడు. రాత్రి సమయాల్లో తాళం వేసిన ఇళ్లలో  దొంగనాలకు పాల్పడేవారు. ఈ అంతరాష్ట్ర ముఠాను శంషాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టుచేసి వారి నుంచి 175 గ్రాముల బంగారు ఆభరణాలు, 350 గ్రాముల వెండి వస్తువులు, ద్విచక్రవాహనం, ఐదు ఫోన్లు, తలుపులు పగులగొట్టే పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ కేసు వివరాలను వెల్లడించారు. గుంటూరుకు చెందిన కసూరి శ్రీనివాసరావు(54) గతంలో టీచర్‌గా పని చేసేవాడు. ఆ ఉద్యోగం మానేసి చోరీలబాట పట్టాడు. 


దొంగల ముఠా

తాను కల్వకుర్తిలో టీచర్‌గా పని చేసిన స్కూల్‌ అటెండర్‌ యోగేందర్‌కుమార్‌, అతని తమ్ముడు ఉదయ్‌కుమార్‌ 2009లో సోదరి వివాహం ఉందని బంగారం తాకట్టు పెట్టి డబ్బు ఇప్పించాలని శ్రీనివాస్‌రావును కోరారు. తాకట్టు డబ్బుల్లో కొంత కమీషన్‌ శ్రీనివాస్‌రావు తీసుకునేవాడు. ఇలా కొన్ని సార్లు జరిగింది. కొద్దిరోజుల తర్వాత యోగేందర్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌ ఓ చోరీ కేసులో బోయినపల్లి పోలీసులకు పట్టుబడ్డారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు. తిరిగి చోరీలకు పాల్పడుతూ బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు శ్రీనివాస్‌రావుకు ఇచ్చేవారు. వారిని చూసి శ్రీనివాసరావు తన టీచర్‌ ఉద్యోగాన్ని వదిలి చోరీల బాటపట్టాడు. 2009 నుంచి అనేక చోరీలు చేసి పలుసార్లు జైలుకువెళ్లి వచ్చాడు. జైలులో ఉన్న నిందితుల్లో చురుకైన వారిని గుర్తించి తన ముఠాలో చేర్చుకునేవాడు. ముందుగా తాను బెయిల్‌పై వచ్చి వారికి బెయిల్‌ ఇప్పించడం, వారు ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసి వారితో చోరీలు చేయించేవాడు. 


ఇలా యోగేందర్‌, కోటేశ్వరరావు, నర్సింగ్‌రావు, వనపర్తి జిల్లాకు చెందిన శంకర్‌నాయక్‌(28), నిజాంపేటకు చెందిన రామారావు(51), చంటి, సిహెచ్‌ సిసింద్రితో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. శ్రీనివాసరావు 48 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని కమిషనర్‌ తెలిపారు. తాజాగా ఒంగోలు జైలు నుంచి గతనెల 16న బయటకు వచ్చిన శ్రీనివాసరావు తన సభ్యులైన శంకర్‌నాయక్‌ (2012 నుంచి 51 చోరీ కేసుల్లో నిందితుడు) రామారావు ( 2011 నుంచి 47 కేసుల్లో నిందితుడు) చింతల సిసింద్రీ (2014 నుంచి 20కేసుల్లో నిందితుడు) సురేష్‌బాబు(43) తో కలిసి కొత్త ముఠాను ఏర్పాటు చేసి చోరీలకు పథకం వేశారు. ఈ ముఠా సభ్యులు శుక్రవారం రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీకి యత్నిస్తుండగా శంషాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు ముఠా సభ్యులతో వారికి పట్టున్న ప్రాంతాల్లోనే చోరీలు చేయించేవాడు. అనంతరం వారిని అక్కడి నుంచి తరలించడం కానీ, ఆ సొత్తును తీసుకుని వెళ్లిపోవడం కానీ చేసేవాడు. 

Updated Date - 2020-08-15T16:47:10+05:30 IST