సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆపై ఉరేసుకుని

ABN , First Publish Date - 2020-05-30T11:02:08+05:30 IST

ఒకవైపు లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న ఉపాధి. మరోవైపు వడ్డీల కోసం వేధింపులు.

సెల్ఫీ వీడియో తీసుకుని.. ఆపై ఉరేసుకుని

వడ్డీ భూతంతో క్షురకుడి బలవన్మరణం  శ్రీకాళహస్తిలో విషాదం 


శ్రీకాళహస్తి అర్బన్‌, మే 29: ఒకవైపు లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న ఉపాధి. మరోవైపు వడ్డీల కోసం వేధింపులు. కొందరి నీచమైన మాటలు, దూషణలు, దాడులు. వీటిని తట్టుకోలేకపోయారా క్షురకుడు. తనకు ఎదురైన వేధింపులను సెల్ఫీ వీడియోలో రోదిస్తూ చెప్పి.. ఉసురు తీసుకున్నారు వెంకటరమణ. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో అందరినీ కలచివేస్తోంది. శుక్రవారం శ్రీకాళహస్తిలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాళహస్తి పట్టణం ప్రాజెక్టు వీధికి చెందిన వెంకటరమణ(40)కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. డోలు వాయిద్యంతోపాటు ఇతరుల సెలూన్‌లో కూలీగా పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే వారు. ఈ క్రమంలో పలువురి వద్ద అప్పులు చేశారు. లాక్‌డౌన్‌ ముందు వరకు సకాలంలో వడ్డీలు చెల్లిస్తూ వచ్చానని సెల్ఫీ వీడియోలో చెప్పారు. లాక్‌డౌన్‌తో ఉపాధిలేక కుటుంబ పోషణే కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమయంలో వడ్డీ వ్యాపారులు పలు దఫాలుగా వేధించారంటూ డీఎస్పీ, ఎస్‌ఐలకు నమస్కరిస్తూ సెల్ఫీ వీడియో ప్రారంభించారు.


ఓ వడ్డీవ్యాపారి తన డొక్కలో కొట్టారని.. మరో వ్యాపారి ఫైనాన్స్‌లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని దుర్భాషలాడి స్వాధీనం చేసుకున్నాడని చెప్పారు. మరో వడ్డీ వ్యాపారి నీచంగా మాట్లాడాడని విలపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా, ఈ వీడియో తీశాక ఇంట్లో ఉరేసుకుని వెంకటరమణ అసువులు బాశారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ సంజీవకుమార్‌, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అప్పుల వేధింపులపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2020-05-30T11:02:08+05:30 IST