Traffic Challan: బండిలో సరిపడా ఇంధనం లేదట.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఓనర్‌కు రూ.250ఫైన్ వేసిన అధికారులు!

ABN , First Publish Date - 2022-07-28T15:20:18+05:30 IST

హెల్మెట్ ధరించలేదని.. లైసెన్స్ లేదని.. ఇలా రకరకాల కారణాలతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఫైన్ విధించడం చూశాం. కానీ ఓ పోలీసు అధికారి మాత్రం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఓనర్‌కు షాకిచ్చాడు.

Traffic Challan: బండిలో సరిపడా ఇంధనం లేదట.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఓనర్‌కు రూ.250ఫైన్ వేసిన అధికారులు!

ఇంటర్నెట్ డెస్క్: హెల్మెట్ ధరించలేదని.. లైసెన్స్ లేదని.. ఇలా రకరకాల కారణాలతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఫైన్ విధించడం చూశాం. కానీ ఓ పోలీసు అధికారి మాత్రం.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఓనర్‌కు షాకిచ్చాడు. బండిలో సరిపడా ఇంధనం లేదనే కారణంతో అతడికి జరిమానా విధించాడు. దీంతో సదరు ఓనర్ కంగుతిన్నాడు. వెంటనే అందుకు సంబంధించిన చలానా చీటీని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడి పోస్ట్ వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళకు చెందిన బాసిల్ శ్యామ్ అనే వ్యక్తి ఎప్పటిలాగే ఈ నెల 22న తన Royal Enfield బైక్‌పై ఆఫీస్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలోనే అతడు రాంగ్ రూట్‌లో బైక్‌ను డ్రైవ్ చేయాల్సి వచ్చింది. అది కాస్తా అక్కడే ఉన్న ట్రాఫిక్ అధికారుల కంట పడటంతో.. రాంగ్ రూట్‌లో బైక్ డ్రైవ్ చేసినందుకు రూ.250 ఫైన్ విధించారు. దీంతో చేసిన తప్పు ఒప్పుకున్న శ్యామ్.. జరిమానా చెల్లించేసి ఆఫీస్‌కు వెళ్లి పోయాడు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత చలానా చీటీని చూసి అతడు కంగుతిన్నాడు. బండిలో సరిపడా ఇంధనం లేదనే కారణంతో తనకు ఫైన్ విధించినట్టు చలానాపై ఉండటంతో షాకయ్యాడు. అధికారులు చేసిన పొరపాటుకు నవ్వుకుని.. ఆ చలానా చీటీని Facebookలో పోస్ట్ చేశాడు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.



ద్విచక్ర వాహనంలో సరిపడా ఇంధనాన్ని క్యారీ చేయాలనే రూల్ భారత దేశంలో లేనే లేదు. కానీ.. కేరళలో మాత్రం ఒక నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం.. ఆటో, కార్లు వంటి ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు తప్పనిసరిగా సరిపడా ఇంధనాన్ని  కలిగి ఉండాలి. లేకపోతే అక్కడి అధికారులు ఫైన్ విధిస్తారు. ఇంధనం అయిపోయి వాహనాలు ఆగిపోతే ప్రయాణికులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో అక్కడి ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధన బైక్‌కు వర్తించదు. శ్యామ్ విషయంలో Trafic అధికారి పొరపాటు పడి.. అతడు చేసిన తప్పుకు కాకుండా బండిలో సరిపడా ఇంధనం లేదనే కారణంతో Challan జారీ చేశాడు. 


Updated Date - 2022-07-28T15:20:18+05:30 IST