ట్రాక్టర్ ర్యాలీ చెడ్డ పనేం కాదు: రాకేశ్ టికాయత్
ABN , First Publish Date - 2021-07-27T01:08:03+05:30 IST
ట్రాక్టర్ ర్యాలీ చెడ్డ పనేం కాదు: రాకేశ్ టికాయత్
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని హర్యానాలోని జింద్ రైతులు ఇచ్చిన పిలుపును భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ సమర్ధించారు. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం చెడ్డ పనేం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ట్రక్టార్ నిర్వహించడం చెడ్డ పనేం కాదు. జింద్ (హర్యానా) ప్రజలు విప్లవాత్మకమైన ఆలోచనలు కలిగిన వారు. ఆగస్టు 15న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలనే వారి ఆలోచన సరైనదే. జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించాల్సిన సమయం ఇది. ఇది ఒక జాతీయ స్ఫూర్తిని నిర్మిస్తుంది. అయితే సంయుక్తి కిసాన్ మోర్చా నిర్ణయం ఏంటనేది తెలియదు’’ అని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకంతో పాటు మరో జెండా ఎగురవేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో దీప్ సిద్దూ అనే వ్యక్తి సహా మరికొందరు అరెస్టై విచారణలో ఉన్నారు. అనంతరం తాజాగా మరోసారి ట్రాక్టర్ ర్యాలీకి రైతులు పూనుకోవడం గమనార్హం.