Abn logo
Jan 27 2021 @ 00:55AM

ట్రాక్టర్లతో కిసాన్‌ ర్యాలీ

 రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 26: కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరవధిక ఆందోళనకు మద్దతుగా మంగళవారం రాజమహేంద్రవరంలో ట్రాక్టర్లతో కిసాన్‌ ర్యాలీ నిర్వహించారు. ముందుగా గోకవరం బస్టాండు వద్దనున్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేవీచౌక్‌, వై.జంక్షన్‌, నందం గనిరాజు సెంటర్‌ మీదుగా ఆజాద్‌చౌక్‌ వరకు ట్రాక్టర్లు, మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్‌చౌక్‌ వద్ద వివిధ ప్రజా సంఘాల నాయకులు టి.అరుణ్‌, నల్లా రామారావు, జహంగీర్‌, ఏవీ రమణ, అజ్జరపు వాసు, ఎస్‌ఎస్‌ మూర్తి మాట్లాడారు. కొత్త వ్యవసాయ చట్టాలను 18 నెలలపాటు నిలిపివేయడానికి కేంద్రం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినా పార్లమెంట్‌ చేసిన చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందని, ఆ తర్వాత గెజిట్‌ ద్వారా నోటిఫై చేశారని, అందువల్ల ఈ చట్టాలను ప్రభుత్వం నిలువరించే అవకాశం లేదని అన్నారు. ప్రజాసంఘాల నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, టీఎస్‌ ప్రకాష్‌, తులసి, రాజులోవ, పవన్‌, రాజా, సావిత్రి, రాంబాబు, కోరుకొండ చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌, గన్నియ్య, నాగలక్ష్మి, హబీబుల్లాఖాన్‌, కరీమ్‌, వెలుగుకుమారి, విజయ్‌కుమార్‌, సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐటీయూసీ, పీఎన్‌ఎం, ఏఐవైఎఫ్‌, ఎస్‌ఐఓ, మహిళాసమాఖ్య, ముస్లిం ఐక్యవేదిక, మెడికల్‌ రిప్స్‌, బీమా, కోకకోలా, పేపర్‌మిల్లు, హార్లిక్స్‌ ఫ్యాక్టరీ కార్మికులు పాల్గొన్నారు. 

  జై జవాన్‌... జై కిసాన్‌ ...

ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో చిన్నారులు స్వేచ్ఛ, స్వప్నిక, తేజస్‌ కిసాన్‌, జవాన్‌ వేషధారణలతో అలరించారు. నాగలిపట్టిన మహిళా రైతు వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. 

కాకినాడలో రైతులకు మద్దతుగా..

  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో తలపెట్టిన ట్రాక్టర్ల పెరేడ్‌కు మద్దతుగా కాకినాడలో మంగళవారం ట్రాక్టర్ల పెరేడ్‌ నిర్వహించారు. బాలాజీచెరువు సెంటర్‌ వద్ద కౌలు రైతు సంఘం అద్యక్షుడు ఎం.రాజశేఖర్‌ అధ్యక్షతన సభ  నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ రైతు ఉద్యమానికి దేశవ్యాప్తంగా కార్మికవర్గం సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. పౌర  సంక్షేమ సంఘం కన్వీనర్‌ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రైతు ఉద్యమం దేశభక్తి ఉద్యమమన్నారు. తోకల ప్రసాద్‌, అయితాబత్తుల రామేశ్వరరావు, నరాల శివ, జి.బేబిరాణి, దువ్వా శేషబాబ్జి, ఎం.వీరలక్ష్మి, సీహెచ్‌ అజయ్‌కుమార్‌, కేఎస్‌ శ్రీనివాస్‌, సీహెచ్‌ పద్మ, రమణ, చంద్రరావు పాల్గొన్నారు. 


రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

  రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ జగ్గంపేటలో రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్‌ ఆధ్వర్యంలో మంగళవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఆలిండియా రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ చేస్తున్న ఢిల్లీ రైతులకు మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించినట్లు రమేష్‌ తెలిపారు.  జిల్లా నాయకుడు కొండా దుర్గారావు, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి కడితి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement