భారంగా ట్రాక్టర్ల నిర్వహణ

ABN , First Publish Date - 2020-11-23T05:03:20+05:30 IST

భారంగా ట్రాక్టర్ల నిర్వహణ

భారంగా ట్రాక్టర్ల నిర్వహణ
చౌదర్‌పల్లిలో ట్రాక్టర్‌ ద్వారా చెత్త సేకరిస్తున్న సిబ్బంది

  • డీజిల్‌, డ్రైవర్‌ జీతం, మెయింటెనెన్స్‌కు తడిసి మోపెడు
  • సొంత డబ్బులు వెచ్చిస్తున్నామని సర్పంచుల ఆవేదన

యాచారం : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంచాయతీలకు పంపిణీ చేసిన ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది. ట్రాక్టర్ల కారణంగా పంచాయతీలు పరిశుభ్రంగా దర్శనమిస్తున్నా.. డీజిల్‌ ఖర్చు తడిసిమోపెడవుతోంది. మేజర్‌ పంచాయతీల్లో నిధులు ఉండడంతో ఎలాగో అలా డీజిల్‌, ఇతర ఖర్చులను భరిస్తున్నారు. కాగా చిన్న పంచాయతీలైన తక్కళ్లపల్లితండా, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, అయ్యవారిగూడ, తాడిపర్తి, నానక్‌నగర్‌, కేస్లీతండా, ధర్మన్నగూడ, మంతన్‌గౌరెల్లి, నజ్దిక్‌సింగారం, కుర్మిద్ద, తమ్మలోనిగూడ, గడ్డమల్లాయగూడ, చౌదర్‌పల్లి, నల్లవెల్లి, మల్కీజ్‌గూడ గ్రామాల్లో ట్రాక్టర్ల నిర్వహణ ఖర్చు భరించలేక సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను నడిపేందుకు ప్రతీ రోజు డీజిల్‌ ఖర్చులు, డ్రైవర్‌ వేతనం కోసం తంటాలు పడుతున్నామని సర్పంచులు వాపోతున్నారు. కాగా పంచాయతీ పనులు ముగిసిన తరువాత గ్రామంలో ఇతర అవసరాలకు వాడుకుంటే ట్రాక్టర్‌ ఖర్చులకు సరిపోతాయని సర్పంచులు  అభిప్రాయపడుతున్నారు. చిన్న పంచాయతీలకు గరిష్టంగా ఏటా రూ.15 లక్షల వరకు మాత్రమే నిధులు వస్తున్నాయి. అవి గ్రామంలో అభివృద్ధి పనులకే సరిపోతున్నాయి. ఇక ట్రాక్టర్‌ మెయింటేనెన్స్‌,  డీజిల్‌, టైర్ల మరమ్మతులు, డ్రైవర్‌ వేతనం ఇలా అన్ని కలిపి పెద్ద మొత్తంలో ఖర్చవుతోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీల్లో ఆదాయం లేకపోయినా సొంత డబ్బు వెచ్చిస్తున్నామని సర్పంచులు చెబుతున్నారు. చిన్న పంచాయతీల్లో ట్రాక్టర్లను వ్యవసాయ పనులకు ఉపయోగించడం కోసం కలెక్టర్‌ ఆదేశాలు జారీచేస్తే పంచాయతీలకు కొంత ఆదాయం పెరుగుతుందని. దీని ద్వారా ట్రాక్టర్‌ మెయింటేనెన్స్‌ ఖర్చులకు అందుతుందని సర్పంచులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-11-23T05:03:20+05:30 IST