నష్టాల ఊబి నుంచి ఆదాయం దిశగా

ABN , First Publish Date - 2022-01-03T06:41:13+05:30 IST

నష్టాల ఊబి నుంచి ఆర్టీసీ సంస్థ ఆదాయం వైపు అడుగులేస్తోంది. కొంత కాలంగా కరోనాతో అతలాకుతలమైన సంస్థ ఆదాయమార్గాలపై దృష్టి సారించింది.

నష్టాల ఊబి నుంచి ఆదాయం దిశగా
కొత్తబస్టాండ్‌ వద్ద ప్రైవేట్‌ వాహనాలను తనిఖీ చేస్తున్న ఆర్టీఏ సిబ్బంది

ఆర్టీసీకి కలిసొస్తున్న కార్గో సేవలు 

ప్రైవేట్‌ వాహనాల కట్టడికి చర్యలు

ఆదాయంపై దృష్టి సారించిన అధికారులు


 సూర్యాపేట టౌన్‌:  నష్టాల ఊబి నుంచి ఆర్టీసీ సంస్థ ఆదాయం వైపు అడుగులేస్తోంది. కొంత కాలంగా కరోనాతో అతలాకుతలమైన సంస్థ ఆదాయమార్గాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా నిబంధనలు విరుద్ధంగా ప్రజారవాణా చేస్తున్న ప్రైవేట్‌ వాహనాల కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీస్‌ సిబ్బందితో కలసి నిత్యం ప్రైవేట్‌ వాహనాలను తనిఖీచేస్తు జరిమానాలు, వాహనాలను సీజ్‌ చేయడం చేస్తున్నారు. ఇక కార్గో సేవల తో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. డిపోల పరిధిలోని ఖాళీస్థలాలను సైతం వాణిజ్య అవసరాలకు లీజ్‌కు ఇచ్చేలా చర్యలు తీసుకుంది.     


పెరుగుతున్న ఆదాయం

సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ డిపోలు ఉన్నాయి. సూర్యాపేట డిపో పరిధిలో మొత్తం 113 బస్సులు ఉండగా, కోదాడ డిపోలో 73 ఉన్నాయి. సూర్యాపేట డిపో పరిధిలో మొత్తం 460 మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో 59 నుంచి 60 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా చూస్తున్నారు. పేట డిపోకు కరోనాకు ముందు నిత్యం రూ.12లక్షల ఆదాయం రాగా, ప్రస్తుతం రూ.13లక్షల నుంచి రూ.15లక్షల మేర ఆదాయం సమకూరుతోంది. కోదాడ డిపోలో కరోనాకు ముందు రూ.10లక్షల వరకు రాగా, ప్రస్తుతం రూ.13లక్షల వరకు ఆదాయం వస్తోంది. సూర్యాపేట, కోదాడ నుంచి ఉమ్మడి రాష్ట్రాలకు, హైదరాబాద్‌కు ఎక్కు సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. దీన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్‌ వాహనదారులు ఆయా ప్రాంతాలకు బస్సులు అధికంగా నడుపుతూ ప్రయాణికులను చేరవేస్తున్నాయి. పేట హైటెక్‌ బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌ వద్ద ప్రైవేట్‌ వాహనదారులు అడ్డాలు ఏర్పాటు చేసుకొని ప్రయాణికులను తరలిస్తుండటంతో ఆర్టీసీ ఆదాయం తగ్గుతోంది. దీనిపై సంస్థ దృష్టిసారించి ప్రైవేట్‌ వాహనాలను తనిఖీలు చేసి జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సైతం సీజ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు 30కి పైగా వాహనాలను తనిఖీ చేసి సుమారు రూ.20వేల వరకు జరిమానా విధుస్తున్నారు. ఏత ఏడాది నవంబరు 22వ తేదీ నుంచి డిసెంబరు వరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ఇప్పటి వరకు 45పైగా వాహనాలను సీజ్‌ చేశారు. రూ.2లక్షల జరిమానా విధించారు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీవైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో 30శాతంలోపు ఉన్న ఓఆర్‌ ప్రస్తుతం 37.21శాతానికి పెరిగింది. శని, ఆదివారాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీకి ఆదాయం కూడా పెరిగింది.


కార్గోతో నిత్యం రూ.15వేల వరకు

కార్గో సేవలతో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. గత ఏడాది క్రితం కార్గో కొరియర్‌ పార్సిల్‌ సేవలను ఆర్టీసీ ప్రారంభించింది. ఒక్క సూర్యాపేట డిపో పరిధిలో నిత్యం రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఆదాయం వస్తోంది. కార్గో పార్సిళ్లను ఇంటింటికీ చేరవేసేలా సేవలను విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


ఆర్టీసీలోనే సురక్షిత ప్రయాణం :  శివశంకర్‌, సూర్యాపేట డీఎం 

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమైనది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్‌ వాహనాలపై పోలీస్‌,ఆర్టీఏ సహకారంతో చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీఏ నిబంధనల ప్రకారం బస్టాండ్‌కు సుమా రు 2కి.మీ దూరంలో ప్రైవేట్‌ వాహనాలు నిలపాలి. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే చర్చలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఆర్టీసీకి ఆదాయం పెంచేలా ఖాళీ స్థలాలను వాణిజ్య అవసరాలకు లీజ్‌కు ఇస్తున్నాం.


Updated Date - 2022-01-03T06:41:13+05:30 IST