Abn logo
Mar 26 2021 @ 01:04AM

‘తూచ్’ ఫ్యాక్టరీ?

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి క్రమంగా తీవ్రమవుతున్నది. బుధవారంనాడు హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్రసమితితో సహా అనేక రాజకీయ పక్షాలు ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి. రాజధాని ఢిల్లీలో టిఆర్ఎస్ ఎంపీలు రైల్వే మంత్రికి విజ్ఞాపన పత్రం సమర్పించారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ల నిర్మాణ సంస్థను నెలకొల్పుతామని ప్రభుత్వాలు వాగ్దానాలు చేయడం, తరువాత వెనక్కు తగ్గడం దశాబ్దాలుగా జరుగుతోంది. కాజీపేటలో సంకల్పించిన ఫ్యాక్టరీని చివరినిమిషంలో దేశంలోని మరో ప్రాంతానికి తరలించడం లేదా దీన్ని పెండింగ్‌లో పెట్టి, కొత్తగా మరోచోట నెలకొల్పడం చేసేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా, రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణలో ఏర్పరిచే నూతన వ్యవస్థల కింద కోచ్ ఫ్యాక్టరీని కూడా పేర్కొనడంతో, ప్రజలలో తిరిగి కొత్త ఆశలు చిగురించాయి. ఫ్యాక్టరీ నిర్మాణం పురోగతి గురించి సమాచార చట్టం కింద చేసిన అభ్యర్థనకు రైల్వే మంత్రి ఈ మధ్య ఇచ్చిన సమాధానం తెలంగాణలో కలవరపాటుకు కారణమైంది. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పరిశీలనలో లేదని, ఆ అవసరం కూడా లేదని మంత్రి ఇచ్చిన సమాధానంపై నిరసనలు వ్యక్తం కాసాగాయి. 


తెలంగాణలో ఎన్నికలుజరుగుతున్న శాసనమండలి పట్టభద్రస్థానాలలో వరంగల్ కూడా ఉండడంతో, కోచ్ ఫ్యాక్టరీ అంశం రాజకీయ అంశంగా పరిణమించింది. బిజెపి ని నిలదీయడానికి అధికార టిఆర్ఎస్‌కు ఆయుధం లభించింది. ఈ హడావుడి ఎన్నికల ప్రచారం వరకే పరిమితం కావచ్చునని, తరువాత, కోచ్ ఫ్యాక్టరీ అంశం మరుగున పడవచ్చునని అనిపించింది. కానీ, రాజకీయేతర ప్రజాసంఘాలు ఉద్యమాన్ని చేపట్టడం, సకల రాజకీయపక్షాలు భాగస్వాములు కావడంతో ఈ అలజడి బలపడుతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. పైగా, తెలంగాణలో బిజెపి ప్రాబల్యాన్ని నిరోధించడానికి రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రాన్ని బోనులో నిలబెట్టడం అవసరమని అధికారపక్షం భావిస్తూండవచ్చు. ఐటిఐఆర్ ప్రాజెక్టు రద్దు, బడ్జెట్ కేటాయింపులు మొదలైన అంశాలలో కేంద్రంపై విమర్శల స్వరాన్ని రాష్ట్ర ప్రముఖులు పెంచారు. కేంద్రంతో ఘర్షణవైఖరిలో ఉండబోమని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పినప్పటికీ, కుమారుడు కెటిఆర్ మాత్రం క్రమం తప్పకుండా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 


విభజన హామీల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలాకాలం నుంచి పోరాడుతున్నది. అయితే, డిమాండ్లు, విమర్శలు అక్కడ అధికారంలో ఉండిన, ఉంటున్న రాజకీయ పక్షాలకు ఆయా సందర్భాలలో కేంద్రంలోని అధికారపక్షంతో ఉన్న సంబంధాలకు లోబడి ఉండడం సహజమే. ప్రత్యేక హోదా కల్పిస్తామని విభజన బిల్లు ఆమోదం సందర్భంగా సాక్షాత్తూ ప్రధాని చెప్పినప్పటికీ, ఆ వాగ్దానం విషయంలోనే అనంతర ప్రభుత్వం వెనుకంజ వేసింది. విభజన చట్టంలో పేర్కొన్న అనేక ఇతర అంశాలను విషయంలో కూడా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రశ్నించవలసి వస్తున్నది. ఇస్తామన్న కొత్తఫ్యాక్టరీల ఊసు లేకపోగా, ఎప్పటినుంచో రాష్ట్రానికి గర్వకారణంగా ఉంటున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలనుకోవడం ఆంధ్రప్రదేశ్‌కు మరొక దెబ్బ. మమతా బెనర్జీ అన్నట్టు, అబద్ధాల ఫ్యాక్టరీ ఒక్కటి తప్ప తక్కిన అన్ని ఫ్యాక్టరీలూ మూసేస్తారు కాబోలు. 


నిజానికి విభజన హామీల విషయంలో రెండు రాష్ట్రాలు ఒక మాట మీద నిలబడి పోరాడవలసిన అవసరం ఉన్నది. తెలంగాణలో బయ్యారం అయినా, ఆంధ్రలో కడప ఉక్కు ఫ్యాక్టరీ అయినా ప్రజల అభివృద్ధి ఆకాంక్షలతో ముడిపడినవి. సమస్తాన్నీ మార్కెట్ శక్తులకు వదిలిపెడితే, ప్రైవేటు రంగమే అన్ని అవసరాలను తీర్చాలనుకుంటే గ్రామీణ ప్రాంతాలలో, చిన్న పట్టణాలలో పరిశ్రమలు ఎట్లా వస్తాయి? ప్రజలు తమ ప్రాంతీయ అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను అందించే ఫ్యాక్టరీలను, వ్యవస్థలను ప్రభుత్వం నుంచి డిమాండ్ చేయగలరు తప్ప, ప్రైవేటురంగానికి ప్రజల విషయంలో ఏమి బాధ్యత ఉంటుంది? 


తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ ఒకప్పుడు పారిశ్రామిక పట్టణం. ఆజంజాహి మిల్లుతో పాటు పత్తిపంటకు, జౌళి పరిశ్రమకు చెందిన అనేక స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులు ఉండేవి. తివాచీలకు, లోహగృహసామగ్రికి పెట్టింది పేరు. కాలక్రమంలో, అక్కడి పారిశ్రామిక వైభవం అంతరించింది. ఆదుకోవలసిన ప్రభుత్వం ఆదుకోలేదు. అక్కడ ఒక భారీపరిశ్రమ ఏర్పాటు చేసి, స్థానికంగా ఇంకా మిగిలి ఉన్న అనేక చిన్న పరిశ్రమలకు కూడా చేయూత అందిస్తే తప్ప, విస్తృతికి తగ్గ ఉపాధిని, సంపదను ఆ నగరం సృష్టించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మధ్యతరహా పట్టణాలు అనేకం ఉండగా, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ కాక తక్కినవన్నీ చిన్న పట్టణాలే. కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ, మామునూరు విమానాశ్రయం గురించి కానీ వరంగల్ ప్రాంతం కలలు కనడంలో అత్యాశ ఏమీ లేదు. అవి ఆర్థిక ఉధృతికి దోహదం చేసే ఇంధనాలు. 

ప్రజలు తమకు కావలసింది సాధించుకోవాలనే అనుకుంటారు. నాయకులకే చిత్తశుద్ధి ఉండదు, అది ఉన్నా లక్ష్యశుద్ధి ఉండదు. అనేక ఇతర ప్రయోజనాల కోసం విస్తృత ప్రజాప్రయోజనాలను పక్కన బెట్టగలిగే త్యాగగుణం కూడా నాయకులకు ఉంటుంది. ప్రజాసంకల్పమే వారికి 

ములుగర్రగా పనిచేసి ముందుకు నడిపించాలి. ప్రాంతీయ అభివృద్ధిని కోరుతూ ఉద్యమించడానికి మించిన ప్రజా ఉద్యమం ఉండదు. దాన్ని కూడా తప్పు పట్టేవారిని ఎవరూ క్షమించరు. రావలసిన ఫ్యాక్టరీలను సాధించుకోవడం, ఉన్న ఫ్యాక్టరీలను కాపాడుకోవడం- ఇవే తెలుగు ప్రజల ముందు ఇప్పుడున్న కర్తవ్యాలు.

Advertisement
Advertisement
Advertisement