కిలో Tomato రూ.100.. Tamarind వైపు జనం చూపు

ABN , First Publish Date - 2022-05-18T00:29:31+05:30 IST

టమోటా (Tomato) ధర కర్ణాటకలో అమాంతం కొండెక్కింది. తుపాను, ఎడతెగని వర్షాల కారణంగా మార్కెట్లకు వస్తున్న టమోటా లోడింగ్ ట్రక్కులు..

కిలో Tomato రూ.100.. Tamarind వైపు జనం చూపు

బెంగళూరు: టమోటా (Tomato) ధర కర్ణాటకలో అమాంతం కొండెక్కింది. తుపాను, ఎడతెగని వర్షాల కారణంగా మార్కెట్లకు వస్తున్న టమోటా లోడింగ్ ట్రక్కులు తగ్గిపోవడంతో ఒక్కసారిగా ధరలు రెట్టింపయ్యాయి. కిలో ధర రూ.80 దాటటంతో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బెంగళూరువాసులు బెంబేలెత్తుతున్నారు. ఫలితంగా సామాన్య ప్రజానీకం కొనుగోళ్లను బలవంతంగా తగ్గించుకోక తప్పడం లేదు. మరికొందరు టమాటాకు ప్రత్యామ్నాయంగా సాంబారు, ఇతర వంటకాల్లో వాడేందుకు చింతపండు (Tamarind) కొనుగోళ్ల వైపు మళ్లుతున్నారు.


ఇటీవల కాలంలో టమోటా ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్ర నిరసన తెలుపుతూ తాము తెచ్చుకున్న కూరగాయాలను రోడ్లపైనే వదలేసి వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ టమోటా సాగునే కొనసాగించిన రైతులు మాత్రం ఇప్పుడు పెరిగిన ధరలతో సంతోషం వ్యక్తం చేస్తుండగా, సామాన్య ప్రజానీకం మాత్రం తమ జేబులకు చిల్లులు పడుతుండటంతో కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గుతున్నారు. హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ మార్కెటింగ్ అండ్ ప్రోసెసింగ్ సొసైటీ ఆఫ్ లిమిటెడ్ (హెచ్‌ఓపీసీఓఎంఎస్) ధరల జాబితా ప్రకారం మంగళవారం కిలో టమోటా ధర రూ.75గా ఉంది. అయితే బెంగళూరులోని దాదాపు అన్ని కూరగాయల దుకాణాలు, మాల్స్‌లో కిలో టమోటా రూ.100కు పైనే అమ్ముతున్నారు.


కర్ణాటకలోని ఇతర జిల్లాలతో పోలిస్తే టమోటాలు పెద్దఎత్తున పండించే జిల్లాగా కోలార్‌కు పేరుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,328 హెక్టార్లలో టమోటా పండిస్తున్నారు. జూన్, ఆగస్టులో పంట విస్తారంగా పండింది. నిపుణుల అంచనా ప్రకారం, కర్ణాటకలో ఏటా 9.50 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిస్తున్నారు. కోలార్ మార్కెట్లో గత ఏడాది 15 కిలోల టమోటా రూ.15కు అమ్ముకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అది రూ.80 నుంచి రూ.100కి చేరింది. శివమొగ్గ, కార్వార్, హుబ్బళ్లి, ధార్వాడ్‌లో రూ .50 నుంచి రూ.70 వరకూ అమ్ముతున్నట్టు చెబుతున్నారు. నాసిక్ నుంచి బెంగళూరు మార్కెట్‌కు ప్రస్తుతం 3 నుంచి 4 ట్రక్కుల టమోటాలు మాత్రమే వస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ప్రజలు టమోటాకు ప్రత్యామ్నాయంగా చింతపండు (Tamarind) కొనుగోళ్ల వైపు మళ్లుతున్నారు.

Updated Date - 2022-05-18T00:29:31+05:30 IST