టమోట ధర మోత

ABN , First Publish Date - 2020-07-08T10:33:27+05:30 IST

టమోట ధర మోతెక్కిపోతోంది. కేజీ పదీ పదిహేను రూపాయలుండే ధర ఇటీవల బాగా పెరిగింది.

టమోట ధర మోత

తెల్ల వంకాయ అంతే

దొండ  కేజీ రూ.5 

ఉల్లి కేజీ రూ. 9 నుంచి 13 


 సిటీ : టమోట ధర మోతెక్కిపోతోంది. కేజీ పదీ పదిహేను రూపాయలుండే ధర ఇటీవల బాగా పెరిగింది. హోల్‌సేల్‌లోనే కేజీ రూ.40 వరకూ ఉంది. రిటైల్‌గా రూ.50 నుంచి రూ.60 వరకూ అమ్ముడవుతోంది. పైగా పెద్ద నాణ్యత కూడా లేవు. సైజు కూడా బాగా చిన్నవి. వాటిలోనే కొద్దిగా పెద్దవి వేరు చేసి మరింత ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. టమోటా అంతా మదనపల్లి మార్కెట్‌ నుంచే ఇక్కడకు వస్తోంది. ఇక తెల్లవంకాయ ధర   కూడా కొంత పెరిగింది. కేజీ తెల్లవంకాయధర రూ.25 వరకూ ఉంది. ఇది హోల్‌సేల్‌ ధర.  నలుపు వంకాయ ధర కేజీ కేవలం రూ.8 మాత్ర మే. ఉల్లిపాయ ధరలు బాగా అందుబాటులో ఉన్నాయి.


చాలా రోజుల నుంచి ఇంచుమించు ఒకే విధంగా ధర పలుకుతోంది. హోల్‌సేల్‌లో కేజీ రూ. 9 నుంచి రూ.13 వరకూ ఉన్నాయి. నంబర్‌ వన్‌ రకం  కేజీ  రూ.13. ఇప్పట్లో ధరలు పెరిగే అవ కాశం లేదు. మహారాష్ట్రలో అధికంగా పంట ఉంది. అక్కడ కొనేవాడే లేడు.  రైతులు మాసూలు చేయడానికి కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉంది. అందువల్ల  మరికొంత కాలం ఈ ధరలు కొనసాగే అవకాశం ఉంది. తర్వాత నెమ్మదిగా కర్నూలు పాయ, స్థానికంగా పండే ఉల్లిపాయలు అందుబాటులోకి వస్తే ధరల్లో పెద్దగా మార్పు ఉండదు.  మొన్నటి వరకూ బెండ కాయల ధర బాగా తక్కువగా ఉండేది. హోల్‌సేల్‌  రైతు మార్కెట్లకు వెళితే  రూ.10కి దోసెళ్లతో రెండు కేజీలకు పైగా ఇచ్చేసేవారు. బయట మార్కెట్‌లో రూ.20 వరకూ అమ్మే వారు. ఇవాళ బెండకాయ రూ.14కి చేరింది.  బయ ట మార్కెట్‌లో మరింత ఎక్కువకు అమ్ముతారు. దోసకాయ కేజీ కేవలం మూడు రూపాయలే.


దొండకాయ ధర బాగా తగ్గింది. కేజీ కేవలం రూ.5 మాత్రమే. ఆనబ రూ.5 నుంచి ధర పలుకుతోంది. పచ్చిమిర్చి ధరలు రెండు రకాలుగా ఉన్నాయి. సన్నాలు కేజీ ధర రూ.38 ఉండగా, లావులు  కేజీ రూ.20 వరకూ ఉన్నాయి.  మిర్చి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తోంది. బరంపురం, కడప,          కర్నూలు వంటి ప్రాంతాల నుంచి కూడా వస్తోంది. బంగాళాదుంపలు కేజీ రూ.24,  క్యారెట్‌ రూ. 14, బీట్‌రూట్‌ కేజీ రూ.16 వరకూ ఉంది. పైగా  సరుకు ఎక్కువగా కూడా మార్కెట్‌లో లభ్యమవుతోంది. తోట కూర, బచ్చలి, గోంగూర, పాలకూర,మెంతుకూర, కొత్తిమీర వంటివి కూడా సరసమైన ధరలకే అమ్ముడవుతున్నాయి. చింతకూర ఈ            సీజన్‌లో దొరుకుతుంది. పావుకేజీ రూ.80 నుంచి 100వరకూ అమ్ముతున్నారు.


పునాస మామిడికాయ మార్కెట్‌లో ఎక్కువగా ఉంది. కాయ రూ. 5 నుంచి రూ.10 వరకూ అమ్ముతున్నారు. కొంచెం పెద్దదైతే రూ.15 వరకూ అమ్ముతున్నారు. నిమ్మకాయలూ చౌకే. పది కాయలు రూ.10 ఇస్తున్నారు. చిల్లర మార్కెట్‌లో రూ.10కి నాలుగైదు ఇస్తున్నారు. చాలా రోజుల నుంచి కాయకూరలు, ఆకు కూరల ధరలు పెరగపోవడానికి మార్కెట్‌లో పలు అంచ నాలు ఉన్నాయి. కరోనా వల్ల ఫంక్షన్లు లేకపోవడం,హాస్టళ్లు లేకపోవడం, హోటళ్లకు పెద్దగా రద్దీ లేకపోవడం వంటి కారణాలు చెబుతున్నారు. వర్షాకాలం సీజన్‌ మొదలైంది కాబట్టి, వరదలు, భారీ వర్షాలు వల్ల పంటలు దెబ్బతిని, సరుకు కొరత ఏర్పడితే కాస్త ధరలు పెరిగే అవకాశం ఉంది. కానీ ఇటీవల గోదావరి లంకలలోకంటే, ఇతర ప్రాంతాలలోనే ఎక్కువగా కాయకూరలు పండిస్తున్నారు. కరోనా వైరస్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న జనానికి కూరగాయలు అందుబాటులో ఉండడం వల్ల కాస్త ఊరట కలిగిందని చెప్పవచ్చు.


కూరగాయల వ్యాపారం మీద వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. రైతు బజార్లు అన్నీ తెరవకపోయినప్పటికీ, ఇటీవల రిటైల్‌ దుకాణాలు బాగా పెరిగాయి. ప్రతీ వీధిలోనూ కూరగాయల షాపులు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారి, ప్రధాన రహదారులలో కూడా కూరగాయలు, ఆకుకూరల వ్యాపారులు పెరగడం విశేషం.

Updated Date - 2020-07-08T10:33:27+05:30 IST