టమోటా పండుగ

ABN , First Publish Date - 2021-11-28T06:21:37+05:30 IST

అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విపత్తు ఇంకా కొనసాగుతోంది.

టమోటా పండుగ

  1. పెరిగిన ధరలతో రైతుకు లాభాలు
  2. కిలో రూ.80 నుంచి రూ.100కు పైగా..
  3. జిల్లాలో 4,500 హెక్టార్లలో సాగు
  4. ఆగస్టులో కిలో రూ.2తో తీవ్ర నష్టం


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 27: అకాల వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విపత్తు ఇంకా కొనసాగుతోంది. వరి, మొక్కజొన్న, మిరప, ఉల్లి తదితర పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ టమోటా సాగు చేసిన రైతుల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. టమోటా ధర మరో నెలపాటు తగ్గే అవకాశం లేదని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో టమోటా రైతులు తమ కష్టాలు తీరుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


4,500 హెక్టార్లు


జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,500 హెక్టార్లలో టమోటా సాగైంది. డోన్‌, పత్తికొండ, ఎమ్మిగనూరు, ప్యాపిలి, కోసిగి, కోడుమూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో ఖరీఫ్‌లో ఈ పంటను సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేశారు. ఆగస్టు చివరలో పంట చేతికి అందడం మొదలైంది. ఆ సమయంలో ధర పూర్తిగా పడిపోయింది. కిలో రూ.2 కూడా పలకలేదు. దీంతో రైతులు రోడ్లపై పారబోసి ఇంటి ముఖం పట్టారు. నవంబరులో భారీ వర్షాలు మొదలయ్యాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పంటలన్నీ నీటి పాలయ్యాయి. టమోటా పంట పూర్తిగా దెబ్బతింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో కాస్తో కూస్తో మిగిలిన టమోటానే దేశానికి దిక్కయింది. అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతంలో దాదాపు 50 వేల హెక్టార్లలో టమోటా సాగు చేశారు. అంతటా పంట దెబ్బతిన్నా మిగిలిన అరకొర దిగుబడికి మంచి ధర లభిస్తోంది. రైతులకు మేలు జరుగుతున్నా, వినియోగదారులకు భారం లేకుండా ప్రభుత్వం రైతుల నుంచి కొని, రైతు బజార్ల ద్వారా కిలో రూ.50కి అందజేస్తోంది. 


వ్యాపారుల దోపిడీ 


టమోటా ధరలు పెరిగినా, వ్యాపారుల చేతిలో రైతులు దోపిడీకి గురవుతున్నారు. తరుగు పేరుతో గంపకు రెండు కిలోల నుంచి నాలుగు కిలోల వరకు తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. కూరగాయల అమ్మకంపై కమీషన్‌ వసూలు చేయరాదని ఆరు నెలల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ జిల్లాలో అమలు కావడం లేదు. కర్నూలు, ప్యాపిలి, ఆస్పరి, పత్తికొండ, గోనెగండ్ల, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు రైతుల నుంచి పది శాతం కమీషన్‌ వసూలు చేస్తున్నారు. రైతులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు. 


ఫిర్యాదు చేస్తే చర్యలు..


కూరగాయల కొనుగోలులో వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు రైతులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లైసెన్సులను రద్దు చేస్తాం. రైతుల నుంచి వ్యాపారులు కమీషన్‌ వసూలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని అన్ని మార్కెట్‌ కమిటీలకు తెలియజేశాం. టమోటా ధర ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. రైతు బజార్లలో కిలో టమోట రూ.30 నుంచి రూ.40 మధ్య అందుబాటులో ఉంది. 


- సత్యనారాయణ చౌదరి, ఏడీఎం, కర్నూలు

Updated Date - 2021-11-28T06:21:37+05:30 IST