రేపటి నుంచి ఆందోళన

ABN , First Publish Date - 2022-05-24T13:44:39+05:30 IST

కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకమైన విధంగా ఉన్న కేంద్రప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని సీపీఎం,

రేపటి నుంచి ఆందోళన

- కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం

- సీపీఐ, సీపీఎం, డీపీఐ సంయుక్త నిర్ణయం


పెరంబూర్‌(చెన్నై): కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేకమైన విధంగా ఉన్న కేంద్రప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని సీపీఎం, సీపీఐ, డీపీఐ, మార్క్సిస్ట్‌ (లెనినిస్ట్‌) నిర్ణయించాయి. ఆ ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీలు ప్రకటించాయి. ఈ మేరకు నగరంలో సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌, డీపీఐ అధ్యక్షుడు తిరుమావళవన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక విధానాలతో దేశాభివృద్ధి తిరోగమనంలోకి వెళ్లే ప్రమాదముందన్నారు. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గించారన్నారు. ఈ ప న్నుల తగ్గింపుతో కేంద్రప్రభుత్వానికి రూ. లక్ష కోట్లు నష్టం వస్తుందంటున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి, అడ్డదారిన పరోక్ష పన్నుల రూపంలో ప్రజలపై భారం మో పేందుకు సిద్ధమయ్యారన్నారు. కేంద్రప్రభుత్వ అనాలోచిత ఆర్ధిక విధానాల కారణంగా త్వరలోనే మన దేశంలో శ్రీలంక తరహా సంక్షోభం రాబోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ పన్నులు తగ్గించిందని, రాష్ట్రంలో కూడా పన్నులు తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం పన్నులు పెంచితే, రాష్ట్రప్రభుత్వాలు తగ్గించాలా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.28 కోట్ల బకాయిలు వచ్చేలా అన్నామలై చర్యలు చేపడితే బాగుంటుందని సూచించారు. 

Updated Date - 2022-05-24T13:44:39+05:30 IST