ఇళ్లకు చేరుకోమని కోరిన మంత్రి... ఏడాది వరకూ ఢోకా లేదన్న రైతు ప్రతినిధులు

ABN , First Publish Date - 2020-12-06T01:53:51+05:30 IST

వ్యవసాయ చట్టాలపై రోడ్లపైకి వచ్చిన వృద్ధులు, పిల్లలు నిరసన స్థలాలు వదిలి ఇళ్లకు..

ఇళ్లకు చేరుకోమని కోరిన మంత్రి... ఏడాది వరకూ ఢోకా లేదన్న రైతు ప్రతినిధులు

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై రోడ్లపైకి వచ్చిన వృద్ధులు, పిల్లలు నిరసన స్థలాలు వదిలి ఇళ్లకు చేరుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. మంత్రి అభ్యర్థనను రైతు ప్రతినిధులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఏడాదికి సరిపడా తిండిగింజలు తమ వద్ద ఉన్నాయని, ప్రభుత్వం తమను రోడ్లపైనే ఉంచాలనుకుంటే తమకేమీ ఇబ్బంది లేదని తెగేసి చెప్పారు. రైతు సంఘాల ప్రతినిధులతో శనివారంనాడు కేంద్ర మంత్రులు జరిగిన ఐదో రౌండ్ చర్చల్లో ఈ సంభాషణలు చోటుచేసుకున్నారు.


చర్చలకు హాజరైన రైతు ప్రతినిధులతో తోమర్ మాట్లాడుతూ... ''మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిరసన ప్రదేశాల్లోని సీనియర్ సిటిజన్లు, పిల్లలను ఇంటికి వెళ్లమని చెప్పండి'' అని కోరారు. ఆయన విజ్ఞప్తిని రైతు ప్రతినిధులు తోసిపుచ్చారు. ''మా దగ్గర ఏడాదికి సరిపడా తిండిగింజలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మేము రోడ్లపైనే ఉంటున్నాం. మమల్ని రోడ్లపైనే ఉంచాలని ప్రభుత్వం అనుకుంటే మాకేమీ ఇబ్బంది లేదు. మేము  హింసామార్గం తొక్కం. నిరసన స్థలిలో మేము ఏమి చేస్తున్నామో మీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోనే చెబుతుంది' అని నిష్కర్షగా చెప్పారు. కార్పొరేట్ వ్యవసాయాన్ని తాము కోరుకోవడం లేదని, ఈ చట్టం వల్ల లాభపడేది ప్రభుత్వమే కానీ రైతు కాదని రైతు ప్రతినిధులు స్పష్టం చేశారు.


వాకౌట్ చేస్తాం...

సమావేశాన్ని విడిచిపోతామని ఓ దశలో రైతు ప్రతినిధులు హెచ్చరించారు. ''మా డిమాండ్లపై ప్రభుత్వం తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే మేము సమావేశం నుంచి వాకౌట్ చేస్తాం'' అని రైతు ప్రతినిధులు మంత్రుల బృందానికి తేల్చిచెప్పారు. రైతులతో జరిపిన చర్చల్లో తోమర్‌తో పాటు, రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T01:53:51+05:30 IST