నేడు సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష

ABN , First Publish Date - 2020-12-06T05:24:23+05:30 IST

స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఆదివారం రాత పరీక్ష జరగనుంది.

నేడు సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష

  1. ఎస్పీ ఫక్కీరప్ప సమీక్ష


కర్నూలు, డిసెంబరు 5: స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఆదివారం రాత పరీక్ష జరగనుంది. కర్నూలులో నంద్యాల రోడ్డులోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల, నందికొట్కూరు రోడ్డులోని పుల్లయ్య ఇంజనీరింగ్‌ కళాశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను ఎస్పీ ఫక్కీరప్ప శనివారం పరిశీలించారు. కళాశాలల యాజమాన్యం, అధికారులతో వ్యాస్‌ ఆడిటోరియంలో ఎస్పీ సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ టీవీల కెమెరాల నిఘా ఉండాలని సూచించారు. ఫుటేజీని నిల్వ చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న లాడ్జిలు, అపార్టుమెంట్లలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి పోలీస్‌ శాఖ తరపున ఒక నోడల్‌ అధికారిని ఏర్పాటు చేశామన్నారు. రాయలసీమ పరిధిలోని ఈ రెండు పరీక్ష కేంద్రాలలో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. పుల్లారెడ్డి కళాశాలలో 748 మంది, పుల్లయ్య కాలేజీలో 738 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. పుల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి, పుల్లయ్య కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు, డీఎస్పీలు వెంకటాద్రి, యుగంధర్‌బాబు, కేవీ మహేష్‌, రామాంజినాయక్‌, సీఐలు ఓబులేసు, శ్రీనాథ్‌ రెడ్డి, శివశంకరయ్య, ఈకాప్స్‌ ఇన్‌చార్జి రాఘవరెడ్డి పాల్గొన్నారు.


నిబంధనలు.. సూచనలు

పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లు, హోటల్స్‌, దుకాణాలను మూసివేయించాలి.

అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తరువాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలి.

అభ్యర్థులు హాల్‌ టికెట్‌తో గంట ముందే చేరుకోవాలి. 

 ఫేస్‌ మాస్కులు, శానిటైజర్‌లు తెచ్చుకోవాలి

పరీక్ష కేంద్రంలోకి పెన్నులు, సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలకు అనుమతి లేదు. పెన్నులను ప్రతి అభ్యర్థికి పరీక్ష కేంద్రంలోనే ఇస్తారు. 

అభ్యర్థులకు బయోమెట్రిక్‌, మాన్యువల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సేకరణ ఉంటుంది. హాల్‌ టికెట్‌తో పాటు పాటు ఆధార్‌కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలి.

Updated Date - 2020-12-06T05:24:23+05:30 IST