నేడే లూర్ధుమాత ఉత్సవం

ABN , First Publish Date - 2020-03-04T09:02:00+05:30 IST

యానాంలో రోమన్‌కేథలిక్‌ చర్చి ఆవరణలో బుధవారం లూర్ధుమాత యాత్ర మహోత్సవం జరగనుంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని

నేడే లూర్ధుమాత ఉత్సవం

యానాంలో రాత్రిపూట తేరు యాత్ర

కులమతాలకు అతీతంగా ప్రార్థనలు

ముస్తాబైన చర్చి.. లూర్ధు మాత కొండగుడి

ఫ్రెంచ్‌ పరిపాలకులకు స్మృతి చిహ్నంగా రోమన్‌ కేథలిక్‌ చర్చ్‌


యానాం: 

యానాంలో రోమన్‌కేథలిక్‌ చర్చి ఆవరణలో బుధవారం లూర్ధుమాత యాత్ర మహోత్సవం జరగనుంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని గతనెల 24నుంచి 9రోజులపాటు ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించారు. అనతికాలంనుంచి సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా ఈ వేడుక నిలుస్తోంది. ఈ ఆలయం మరో ప్రత్యేకత సంతరించుకుంది. క్రైస్తవులే కాకుండా యానాం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు కులమతాలకు అతీతంగా వచ్చి ప్రార్థనలు చేసి కొవ్వొత్తులను వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. తొమ్మిదిరోజులుగా సాయంత్రం 6 గంటల నుంచి ఒక ప్రత్యేక అంశంపై పలు చర్చిల ఫాదర్‌లు ప్రసంగిస్తున్నారు. 


ప్రతిఏటా మార్చిలో..

ప్రతి సంవత్సరం మార్చి మొదటి బుధవారం రోజున లూర్ధుమాత యాత్ర మహోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చర్చి ఫాదర్‌ లూకోస్‌ కాలిక్కట్‌ తెలిపారు. బుధవారం ఉదయం 11గంటల నుంంచి విశాఖ అగ్రపీఠాధిపతి ఫాదర్‌ ఎస్‌.శౌరిబాబు వర్గీస్‌ చారపత్‌ ఇతర గురువులు సమష్టి దివ్య పూజాబలి నిర్వహించనున్నారు.


అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై లూర్ధుమాతను ప్రతిష్టించి ప్రార్థనలు చేస్తారు. రాత్రి 7.30గంటలకు లూర్ధుమాత తేరుతో పురప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి ఆరోగ్యశాఖా మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయనున్నారు. పురప్రదక్షిణ అనంతరం బాణసంచా కాల్పులు నిర్వహిస్తారు. 


300ఏళ్ల చరిత్ర గల రోమన్‌ కేథలిక్‌ చర్చ్‌

భిన్న మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలవారితో సమ్మిళితమైన పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాం ప్రాంతానికి ఒక విశిష్ట చరిత్ర ఉంది. ఫ్రెంచ్‌ యానాంగా ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతాన్ని ఫ్రాన్స్‌ దేశీయులు మూడు శతాబ్ధాలపాటు పరిపాలించారు. గోదావరి తీరం సముద్రతీరాలు కల్గిన ఈ ప్రాంతం అప్పట్లో ఫ్రెంచ్‌వారిని ఆకర్షించింది. వర్తక వ్యాపారాలకోసం 1671లో పుదుచ్చేరి, 1723లో యానాం, 1725లో మాహే, 1730లో కారేకాల్‌ ప్రాంతాలను వీరు స్వాధీనం చేసుకున్నారు. బ్రిటీష్‌వారు 1947లో భారతదేశాన్ని విడిచి వెళ్లినా ఏడేళ్లపాటు 1954 వరకు ఈ నాలుగు ప్రాంతాలను(పుదుచ్చేరి, కారేకాల్‌, మాహే, యానాం) ఫ్రెంచ్‌వారు పరిపాలించారు.


దీంతో ఇప్పటికీ ఫ్రెంచ్‌ యానాంగానే పిలుస్తున్నారు. అప్పటి ఫ్రెంచ్‌ పాలకులు సాక్ష్యాలుగా నిర్మించినదే ఈ రోమన్‌ కేథలిక్‌ చర్చ్‌. వీరు పరిపాలనలకు సంబంధించి మరో సాక్ష్యం చర్చ్‌కు సంబంధించి సమాధులు ఉన్నాయి. వీటిని రోమన్‌, గ్రీకు నిర్మాణ శైలిలో నిర్మించారు. వీరి పాలనలో ఎంతోమంది ఫ్రెంచ్‌ మిలటరీ, సివిల్‌, విద్యావేత్తలు ఇక్కడ పుట్టి గతించారు(మరణించారు).


ముఖ్యంగా ఈ చర్చ్‌లో యూరోపియన్‌ నిర్మాణ పద్ధతిని తలపిస్తూ ఉంటుంది. ఈ చర్చ్‌లో ఉన్న స్వరూపాలు, సామాగ్రి అన్నీ ఫ్రాన్స్‌ నుంచి తీసుకువచ్చినవే. 1846లో ఫ్రెంచ్‌ మిషనరీ ఈ చర్చిని నిర్మించింది. అంటే ఇప్పటికి 170ఏళ్లు పూర్తయింది. చర్చికి సంబంధించి మరో ప్రత్యేక ఆకర్షణ దీని ఆవరణలో నిర్మితమైన కొండగుడి. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది.


కొండగుడి చరిత్ర..

లూర్ధుమాత ఆలయ నిర్మాణం వెనుక ఎంతో చరిత్ర ఉంది. 1943లో బంగాళాఖాతంలో సంభవించిన పెను తుఫానుకు అమెరికాకు చెందిన విలియం బోగ్డన్‌ అనే వెయ్యి టన్నుల బరువు గల ఓడ యానానికి దగ్గరలోని అప్పటి సాక్రమెంట్‌ లైట్‌ హౌస్‌ సమీపంలోని ఇసుకలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో చిక్కుకున్న ఓడను బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడాది తర్వాత సముద్రంలో చిక్కిన ఓడను ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అమెరికా ప్రభుత్వం ఇహెచ్‌ స్వీన్లీ అనే ఇంజనీర్‌ను నియమించింది.


ఈ మేరకు ఇంజనీర్‌ దంపతులు యానాం విచ్చేశారు. వారు ఓడను సముద్రంనుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అది విఫలమైంది. దీంతో ఇంజనీర్‌ దంపతులు యానాం కేథలిక్‌ చర్చిలో లూర్థుమాతను జపమాల ద్వారా ప్రార్థించి ఓడను లాక్కొచ్చేందుకు చేసిన ప్రయత్నం సఫలమైంది. దీనికి గుర్తుగా స్వీన్లీ దంపతులు కేథలిక్‌ చర్చి ఆవరణలో అమ్మవారికి కొండగుడిని నిర్మించినట్లు తెలుస్తోంది.


మొదటి ఉత్సవాలు..

ఈ కొండగుడిని 1945, ఫిబ్రవరి 11వతేదీ ఆదివారం అప్పటి వైజాగ్‌ పట్టణ పీఠాధిపతి డాక్టర్‌ పీటర్‌ రొసిలియన్‌ ఎమ్‌.ఎస్‌.ఎఫ్‌.ఎస్‌, యానాం విచారణ గురువు అగస్టీన్‌ గాంగలఫ్‌ ఎమ్‌.ఎస్‌.ఎఫ్‌.ఎస్‌ మొదటిసారిగా లూర్థు మాత ఉత్సవాలను ప్రారంభించారు. 1957 నుంచి ఫాదర్‌ మత్తయి మ్యాపిల కున్నెల్‌ నుంచి ఇప్పటివరకు భారీ విద్యుత్‌ దీపాలంకరణలతో బాలయేసు, మరియా మాతల స్వరూపాలను ఊరేగిస్తున్నారు.

Updated Date - 2020-03-04T09:02:00+05:30 IST