Abn logo
May 13 2021 @ 23:49PM

నేడే ఈదుల్‌ ఫిత్ర్‌ పర్వదినం

రంజాన్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు

కొవిడ్‌ నేపథ్యంలో మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు


గోపాలపట్నం, మే 13: ఇస్లాం ధర్మాన్ని ఆచరించే ప్రపంచంలో ఏ దేశానికి చెందిన ముస్లింలైనా ఏడాదిలో జరుపుకునేవి రెండే పండుగలు మొదటిది ఈదుల్‌ ఫిత్ర్‌. రెండు ఈదుల్‌ అజ్‌హా లేదా బక్రీద్‌ పండుగ. రంజాన్‌ మాసంలో నెల రోజుల పాటు కఠోర ఉపావాస దీక్షలు పూర్తి చేసిన తరువాత నెల వంకను చూసిన పిదప జరుపుకునే పండుగే ఈదుల్‌ ఫిత్ర్‌. 

రంజాన్‌ అనేది ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో వచ్చే 9వ నెల పేరు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (సఅస)పై అవతరించిన దైవదత్త గ్రంథం ఖురాన్‌ ఈ నెలలోనే భూమండలంపైకి అవతరించిందని ఖురాన్‌లో ఉంది. ఈ నెలలో మొదటి నెలవంకను చూసిన తరవాత రోజు నుంచి ఉపవాసాలు ప్రారంభమవుతాయి. నెలవంకను చూసిన రోజు రాత్రి నుంచి మళ్లీ నెలాఖరులో నెలవంకను చూసేంత వరకూ ప్రతి రోజు రాత్రి ప్రత్యేక నమాజులు ఆచరిస్తూ పగటి పూట ఉపవాసాలు ఆచరించడం ఇస్లాం ధర్మంలోని ఓ ముఖ్యమైన విధి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పూర్తిచేసిన తరువాత నెలాఖరులో దర్శనమిచ్చే నెలవంకను చూసిన మరుసటి రోజు రంజాన్‌ ఈద్‌ అంటే ఈదుల్‌ ఫిత్ర్‌ పండుగ జరుపుకుంటారు. 

ఈదుల్‌ ఫిత్ర్‌ అంటే..

రంజాన్‌ అనేది పండుగ పేరు కాదు. ఇది ఒక నెలపేరు మాత్రమే. ఈ నెలలో జరుపుకునే పండుగే ఈదుల్‌ ఫిత్ర్‌. ఈద్‌ అంటే అరబిక్‌ భాషలో పండుగ అని అర్థం. ఫిత్ర్‌ అంటే రంజాన్‌ నెలలో చేసే దానం. ప్రతి ముస్లిం తన కుటుంబ సభ్యులు, తల్లి గర్భంలో ఉన్న బిడ్డతో సహా అందరి పేరున రంజాన్‌ ఈద్‌ నమాజ్‌కు వెళ్లే సమయం ముందుగా ఒక్కొక్కరి పేరున రెండున్న కిలోల గోధుమలు, బార్లీ, కిస్మిస్‌, ఖర్జూరం లేదా దానికి సమానమైన విలువ కలిగిన నగదును పేదవారికి దానం చేయాలి. ఈ దానం చెల్లించడాన్నే ఫిత్రా అంటారు. ఫిత్రా చెల్లించే ఈ పండుగనే ఈదుల్‌ ఫిత్ర్‌ అంటారు.

నమాజ్‌కు ముందు ఫిత్రా చెల్లించడం తప్పనిసరి

రంజాన్‌ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈద్‌ నమాజ్‌ ఆచరించడం. మసీదులతో పాటు పండుగ రోజు నమాజ్‌ ఆచరించే ప్రత్యేక ప్రార్థన స్థలాలైన ఈద్‌ గాహ్‌లలో పండుగ నమాజ్‌ను ఆచరిస్తారు. ఈద్‌ రోజు సూర్యోదయం జరిగిన తరువాత నుంచి ఉదయం 11 గంటల సమయం వరకూ ఈద్‌ నమాజ్‌ ఆచరించవచ్చు. అయితే నమాజ్‌కు వెళ్లే ముందే ఫిత్రాదానం చెల్లించి నమాజ్‌కు వెళ్లడం ప్రవక్త ముహమ్మద్‌(సఅస) ఆనవాయితీ. నమాజు ముగిసిన తరువాత పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

జకాత్‌ దానం కూడా చెల్లించాలి

జకాత్‌ దానం అనేది ఇస్లాం ధర్మంలో ఆదాయపన్నుగా చెప్పవచ్చు. ఇస్లాం ధర్మం ఆచరించే ప్రతి ముస్లిం దైవారాధన అనగా నమాజ్‌కు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ జకాత్‌ దానం చేయడానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. జకాత్‌ దానం చేయాలని ఖురాన్‌ గ్రంథంలో 100 సార్లకంటే ఎక్కువగానే దేవుని ఆజ్ఞ ఉంది. ఏడాది పొడవునా ఒక వ్యక్తి తన సంపాదన మొత్తంలో కుటుంబ ఖర్చులు, అప్పులు పోనూ తన వద్ద గల ధనం, వెండి, బంగారం, పశువులు, ఆహార ధాన్యాలపై జకాత్‌ చెల్లించాలి. తన సంపదపై నూటికి రూ.2.50 జకాత్‌ చెల్లించాలి. ఈ జకాత్‌ సొమ్మును కేవలం పేదలకు మాత్రమే చెల్లించాలి. సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించడమే ఈ జకాత్‌ ముఖ్య ఉద్దేశం.

ఇదీ రంజాన్‌ సారాంశం  

రంజాన్‌ నెలలో ఆచరించే ఉపవాసాల వెనుక మహా పరమార్థం ఉంది. ఉపవాసం చేసి శరీరాన్ని పస్తులతో బలహీనపరచడం ముఖ్య ఉద్దేశం కాదు. ఉపవాస దీక్షలో దైవ ప్రీతి కోసం ఉపవాస దీక్షలు ఆచరించే సమయంలో ఏ విధంగా సమస్త చెడు కార్యాలకు దూరంగా ఉంటామో ఏడాదిలోని మిగిలిన 11 నెలల పాటు రంజాన్‌ స్ఫూర్తితో సన్మార్గంలో ఉండడానికి ఈ నెలలోని ఉపవాసాలు దోహదపడతాయి. ఆకలిగా ఉన్నవారి ఆకలిని తీర్చడం, జకాత్‌ దానం ద్వారా పేదరికం నిర్మూలించడం, రంజాన్‌ ఆచరణలతో సన్మార్గానికి బాటవేయడం ప్రవక్త ముహమ్మద్‌(సఅస) బోధించిన మార్గం.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నమాజులు

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో మసీదుల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నమాజులు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం పరిపూర్ణంగా సూర్యోదయం అయిన తరువాత నుంచి ఉదయం 11 గంటలలోపు పరిమిత సంఖ్యలో పలు విడతలుగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి ప్రార్థనలు చేయనున్నారు. దీనికి సంబంధించి మసీదుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.


Advertisement
Advertisement
Advertisement