నేడే కీలకం..!

ABN , First Publish Date - 2021-03-03T04:59:19+05:30 IST

నామినేషన్ల ఉపసంహరణతో పురపోరు మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజున 210 మంది నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు.

నేడే కీలకం..!

పుర పోరు ప్రక్రియ ప్రారంభం

తొలిరోజు 210 నామినేషన్లు ఉపసంహరణ

98 వార్డులు ఏకగ్రీవం

పులివెందుల, రాయచోటి, ఎర్రగుంట్ల చైర్మన్‌ పీఠం వైసీపీకే..!

కడప నగరంలో 16 డివిజన్లు ఏకగ్రీవం

మిగిలిన డివిజన్లలో విత్‌డ్రాల కోసం పైరవీలు

బెదిరింపులు, బేరాలకు సై అంటున్న అధికార పక్షం

నేడు 3 గంటల వరకు విత్‌డ్రాలకు గడువు


(కడప-ఆంధ్రజ్యోతి): నామినేషన్ల ఉపసంహరణతో పురపోరు మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజున 210 మంది నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. కడప నగరంలో 16 డివిజన్లతో కలిపి పులివెందుల, రాయచోటి, ఎర్రగుంట్ల, బద్వేలు, జమ్మలమడుగు మున్సిపాలిటీల్లో 98 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఉపసంహరణకు నేటి సాయంత్రం 3 గంటల వరకు గడువు ఉంది. వీలైనన్ని ఎక్కువ వార్డులు, డివిజన్లు ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకోవడానికి అధికార  వైసీపీ బుజ్జగింపులు, బెదిరింపులు, బేరాలకు సై అంది. అదే క్రమంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలు తమ అభ్యర్థులను రక్షించుకోవడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.

కడప నగరపాలక సంస్థ, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాయచోటి, పులివెందుల, బద్వేలు, మైదుకూరు మున్సిపాలిటీలు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల నగర పంచాయతీల పరిధిలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గతేడాది మార్చి 15న ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుంచి మొదలైంది. ఆయా పట్టణాల్లో గతేడాది మార్చి 11 నుంచి 13వ తేది వరకు 257 వార్డులకు 1,542 నామినేషన్లు వచ్చాయి. పరిశీలనలో 108 తిరస్కరించారు. 1,434 నామినేషన్లు ఆమోదం పొందాయి. అందులో పులివెందుల, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో అప్పుడే 62 నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. రాయచోటిలో 28 వార్డులకు సింగిల్‌ నామినేషన్‌ దాఖలైందని అధికారులు వివరించారు. మంగళవారం మొదలైన ఉపసంహరణ ప్రక్రియలో వివిధ మున్సిపాలిటీల్లో 210 మంది అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకొని పోటీ నుంచి తప్పుకున్నారు. వారిలో వైసీపీ అభ్యర్థులు 75 మంది, టీడీపీ అభ్యర్థులు 54, బీజేపీ/జనసేన కూటమి అభ్యర్థులు 10, కాంగ్రెస్‌ అభ్యర్థులు 12, ఇతరులు 59 మంది ఉన్నారు.


ఆ పట్టణాల్లో ఎన్నికలు నామమాత్రమే

సీఎం జగన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రం పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులకు 45 మంది వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిలో 12 మంది గతేడాదే పోటీ నుంచి తప్పుకోవడంతో వార్డులన్ని ఏకగ్రీవమై చైర్మన్‌ పీఠం అధికార పార్టీ పక్షమైంది. రాయచోటిలో 34 వార్డులు ఉంటే 28 వార్డులకు వైసీపీ అభ్యర్థుల నుంచి మాత్రమే సింగిల్‌ నామినేషన్‌ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 20 వార్డులకు గానూ 11 ఏకగ్రీవం అయ్యాయి. సగం కన్నా ఎక్కువ వార్డులు ఏకగ్రీవం కావడంతో  చైర్మన్‌ పీఠం వైసీపీకి దక్కినట్లే. ఆ రెండు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నామమాత్రమే. కడప నగరపాలక సంస్థ పరిధిలో 50 విడిజన్లకు గానూ 16 ఏకగ్రీవం అయ్యాయి.


బెదిరింపులు.. బేరాలు

నామినేషన్ల విత్‌డ్రాలకు ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకు గడువు ఉంది. సగానికి పైగా వార్డులు ఏకపక్షం చేసుకోవడానికి వైసీపీ అన్ని ఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా కడప కార్పొరేషన్‌లో 25-35 డివిజన్లను ఏకగ్రీవం చేసుకోవాలనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 16 వార్డులు ఏకగ్రీవం చేసుకున్నారు. మిగిలిన వార్డులపై అధికార పార్టీ కీలక నేతలు దృష్టి సారించారు. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు బుజ్జగింపులు, బేరాలు, బెదిరింపులకు సై అన్నారు. 41వ వార్డు టీడీపీ అభ్యర్థిగా తస్లీమ్‌ నామినేషన్‌ వేశారు. ఆమెకు మద్దతుగా ఆమె భర్త, టీడీపీ నాయకుడు షేక్‌ నజీర్‌ అహ్మద్‌ ప్రచారం చేపట్టారు. అయితే.. ప్రచారం ఆపేసి నామినేషన్‌ వెనక్కి తీసుకోవాలని వైసీపీ నాయకులు కొందరు తనను బెదిరిస్తున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని, అవసరమైతే భౌతిక దాడి తప్పదని హెచ్చరిస్తున్నారని అభ్యర్థి తస్లీమ్‌ భర్త ఆరోపిస్తున్నారు. ఆ విడిజన్‌లో మాత్రమే కాదు.. మెజార్టీ డివిజన్లలో ఇదే పరిస్థితి ఉందని విశ్వసనీయ సమాచారం. ప్రొద్దుటూరులో కూడా సగానికి పైగా వార్డులను తమ ఖాతాల్లో వేసుకొని చైర్మన్‌ పీఠం ఏకపక్షం చేసుకోవడానికి పలురకాల ఎత్తులు అమలు చేస్తున్నారు. ఎర్రగుంట్లలో 20 వార్డులకు గానూ 11 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వార్డుల్లో కూడా విత్‌డ్రాలకు అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడ గతేడాది బలవంతం వల్ల విత్‌డ్రా చేసుకున్న ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను ఎస్‌ఈసీ పునరుద్ధరించింది. మైదుకూరు, బద్వేలులో టీడీపీ అఽభ్యర్థులు అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లారు. నేడు సాయంత్రం 5 గంటల తరువాత వార్డుల్లో ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది.


నామినేషన్ల ఉపసంహరణ వివరాలు

------------------------------------------------------------------------------------------------------------

కార్పొరేషన్‌/ డివిజన్‌/ వైసీపీ టీడీపీ బీజేపీ/ ఇతరులు మొత్తం

మున్సిపాలిటీ వార్డులు జనసేనా

--------------------------------------------------------------------------------------------------------------

కడప 50 14 18 5 33 70

ప్రొద్దుటూరు 41 33 17 -- 10 60

మైదుకూరు 24 4 1 -- -- 5

బద్వేలు 35 11 9 1 16 37

రాయచోటి 34 8 2 -- 5 15

జమ్మలమడుగు 20 7 -- 3 5 15

ఎర్రగుంట్ల 20 5 -- 1 2 8

పులివెందల 33 -- -- -- -- --

-----------------------------------------------------------------------------------------------------------

మొత్తం 257 75 54 10 71 210

-----------------------------------------------------------------------------------------------------------


ఏకగ్రీవమైన వార్డుల వివరాలు

-----------------------------------------------

కార్పొరేషన్‌/ డివిజన్‌/ వైసీపీ

మున్సిపాలిటీ వార్డులు

------------------------------------------------

కడప 50 16

ప్రొద్దుటూరు 41 5

బద్వేలు 35 3

రాయచోటి 34 28

ఎర్రగుంట్ల 20 11

పులివెందల 33 33

జమ్మలమడుగు 20 2

-------------------------------------------------

మొత్తం 257 98

------------------------------------------------

Updated Date - 2021-03-03T04:59:19+05:30 IST